ఆపద్బాంధవులు 108 సిబ్బంది

ABN , First Publish Date - 2022-03-17T04:45:57+05:30 IST

గర్భిణులకు ఆపత్కాలంలో 108సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరు కుని బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేరవేస్తున్నారు. ప్రసవ వేధనకు గురవుతున్న గర్భిణులకు అన్నీతామై 108వాహనంలోనే పురుడు పోస్తు న్నారు.

ఆపద్బాంధవులు 108 సిబ్బంది

- ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఉద్యోగులు

- అత్యవసర సమయాల్లో వాహనంలోనే డెలివరీలు

- ప్రత్యేక శిక్షణతో సమర్థవంతంగా విధులు 

రెబ్బెన, మార్చి 16: గర్భిణులకు ఆపత్కాలంలో 108సిబ్బంది ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరు కుని బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేరవేస్తున్నారు. ప్రసవ వేధనకు గురవుతున్న గర్భిణులకు అన్నీతామై 108వాహనంలోనే పురుడు పోస్తు న్నారు. అత్యవసర సమయంలో కాన్పులు చేసేందుకు తీసుకున్న శిక్షణ వీరికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు 108లో వీరు చేస్తున్న డెలవరీల్లో తల్లీబిడ్డలకు ఎలాంటి అపాయం జరగలేదు. డెలివరీ చేసిన తర్వాత వారిని మాతాశిశు కేంద్రాలకు తరలిస్తున్నారు.

- డెలివరీల కోసం ముందస్తు శిక్షణ

ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రు లకు చేర్చి వారి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో దివంగత నేత వైస్‌ రాజశేఖర్‌రెడ్డి 108వాహనాలను తీసుకువచ్చారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం 108ప్రథమ కర్తవ్యం. అందుకు గాను ప్రతి వాహనంలో ఒక ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌), ఒక పైలట్‌(డ్రైవర్‌) ఉంటారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిం చి ఆస్పత్రుల్లో చేర్చడం, డెలవరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై నెలరోజులపాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. గర్భిణులను ఆస్పత్రికి తరలించే క్రమంలో పురిటినొప్పులు అధికమై పరిస్థితి చేయిదాటే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మార్గ మధ్యలోనే వాహనాన్ని నిలిపి అంబులెన్స్‌లోనే డెలవరీలు చేస్తున్నారు. అత్యవసర సమయంలో డెలవరీ చేయాల్సి వస్తే కాల్‌సెంటర్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటూ తల్లీబిడ్డలకు ఎలాంటి హాని కలగకుండా డెలివరీ చేస్తారు. 

 -  సౌకర్యాలు లేక తప్పని రెఫరీ

సాధారణ కాన్పులకు అవకాశం లేని సమయంలో సర్జరీ చేసేందుకు జిల్లాలో అవసరమైన సౌకర్యాలు లేవు. శస్త్రచికిత్స చేసేందుకు జిల్లాలో స్పెషలిస్టు సర్జన్లు, గైనకాలజిస్టు లేరు. దీనితో పక్క జిల్లా మంచిర్యాలపై ఆధార పడాల్సి వస్తోంది. జిల్లాలో కొన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల సిబ్బంది సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉన్నా గర్భిణులను చూసీ చూడ నట్లు వ్యవహరిస్తూ మంచిర్యాలకు రెఫర్‌ చేస్తున్నారు. అలాంటి వారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో పురిటినొప్పులు అధికమై 108లో ప్రసవి స్తున్నారు. ఎక్కువగా కౌటాల, బెజ్జూరు వంటి మండలాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. 

జిల్లా కేంద్రంలో ఉన్న అస్పత్రిలో స్పెషలిస్టు వైద్యులు, శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు, సరిపడ సిబ్బంది లేకపోవడంతో సాధారణ కాన్పులు మినహా మిగిలిన వాటిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. రక్తహీనత, పేగు మెడకు చుట్టుకుని ఉండడం, శిశువు కాళ్లు ముందుకు వచ్చి ఉండడం అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నప్పుడు సాధారణ కాన్పులు చేసే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో మంచిర్యాల జిల్లాకు రెఫర్‌చేయడం తప్పనిసరిగా మారు తోంది. ఇటువంటి సందర్భాల్లో జిల్లాలోని సిర్పూర్‌, కౌటాల, బెజ్జూరు ప్రాంతాలకు చెందిన గర్భిణులను మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలిం చాలంటే సుమారు మూడుగంటల సయయం పడుతోంది. స్థానిక ఆస్పత్రిలో వైద్యసేవల రెఫరల్‌ వంటి తతంగం కోసం మరోగంట సమయం వృథా అవుతోంది. ఇలా అధిక సమయం వృథా అవుతుం డడంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో నొప్పులు తీవ్రమై కొంతమందికి అంబులెన్స్‌లోనే డెలవరీలు చేయాల్సి వస్తోందని 108 సిబ్బంది అంటున్నారు.

- తప్పనిసరి పరిస్థితుల్లో..

- మానస, ఈఎంటీ, రెబ్బెన  

గర్భిణులను ఆస్పత్రికి తరలించే క్రమంలో పురిటి పొప్పులు అధికమైతే తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్‌లోనే డెలవరీలు చేస్తుంటాం. అందుకు కాల్‌ సెంటర్‌ ద్వారా స్పెషలిస్టు వైద్యుడిని సంప్రదించి వారి సలహాలు, సూచనలను పాటిస్తూ డెలవరీలు చేస్తుంటాం. తీసుకోవాల్సిన జ్రాత్తలపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం.

- దూరం సమస్యగా మారుతోంది..

- జంబుల సంతోష్‌, పైలట్‌, రెబ్బెన

గర్భిణీ కండీషన్‌ కొంచెం క్రిటికల్‌ అనిపిస్తే మంచిర్యాలకు రెఫర్‌ చేస్తున్నారు. అలాంటి సమయంలో మంచిర్యాలకు తరలించేందుకు దూరం ఎక్కువ అవుతోంది. సిర్పూర్‌(టి), బెజ్జూరు, కౌటాల వంటి ప్రాంతాల నుంచి మంచిర్యాలకు వెళ్లాలంటే సుమారు 3గంటల సమయం పడుతోంది.

Updated Date - 2022-03-17T04:45:57+05:30 IST