మరణంలోనూ వీడని స్నేహం

ABN , First Publish Date - 2020-11-30T05:05:14+05:30 IST

వారిద్దరూ చిన్నినాటి నుంచి స్నేహితులు..

మరణంలోనూ వీడని స్నేహం
రవిబాబు, లక్ష్మణ్‌రావు


ద్విచక్ర వాహన్ని లారీ ఢీ కొట్టటంతో ఇద్దరు యువకుల మృతి 

జూలూరుపాడు న్యూకాలనీలో విషాదం 

కొణిజర్ల మండలంలో ఘటన

జూలూరుపాడు/కొణిజర్ల, నవంబరు29: వారిద్దరూ చిన్నినాటి నుంచి స్నేహితులు.. ఎటువెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లే వారు. వృత్తిపరంగా కూడా ఇద్దరు శుభకార్యాలకు డెకరేషన్‌(అలంకరణ)లు చేస్తుండేవారు. ఎవరికి ఏ పని ఉన్నా.. ఇద్దరూ చేసుకునే వారు. వారి వారి కుటుంబాలకు చేదోడు, వాదోడుగా ఉండేవారు. అలాంటి వారిని చివరికి రోడ్డు ప్రమాదం కబళించింది. ప్రాణస్నేహితులిద్దరూ ఒకేసారి మృతి చెందటంతో జూలూరుపాడు న్యూకాలనీలో విషాదంలో విషాదం నెలకొంది. జూలూరుపాడు పంచాయతీ పరిధిలోని న్యూకాలనీకి చెందిన ఇల్లంగి రవిబాబు(20), సంబంధాల లక్ష్మణ్‌రావు(అలియాస్‌ లిఖిత్‌)(19) ప్రాణ స్నేహితులు. ఆదివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని పెద్దరాంపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు మృతి చెందారు. రవిబాబు, లక్ష్మణ్‌రావులు కొణిజర్ల మండలంలోని అంజనాపురం గ్రామంలో స్నేహితుడి కుమారుడి అన్నప్రాసన్న వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్ళారు. అనంతరం ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై కొణిజర్లలోని రవిబాబు మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని జూలూరుపాడుకు తిరిగి వ స్తుండగా పెద్దరాంపురం వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. కాగా రవిబాబు అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణ్‌రావు ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రిలో మరణించాడు. కాగా రవిబాబు తండ్రి 15 సంవత్సరాల క్రితం మృతి చెందగా, తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అదేవిధంగా న్యూకాలనీకి చెందిన సంబంధాల నరసింహారావు- మహాలక్ష్మీలకు ఇద్దరు కుమారులు కాగా లక్ష్మణ్‌రావు పెద్ద కుమారుడు డెకరేషన్‌ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఇద్దరు నిత్యం కలిసి మెలసి తిరుగుతుండే వారు. మరణంలో స్నేహం వీడలేదు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్త న్యూకాలనీలో ద్రావణంలో వ్యాపించింది. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-11-30T05:05:14+05:30 IST