Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి కుమార్తెను తీసుకు వెళ్తుండగా...

- కారును ఢీకొన్న వ్యాను

- ఒకరి మృతి, ఏడుగురుకి గాయాలు

-  కుంటికోట-బాలిగాం హైవేపై ఘటన

హరిపురం, జూన్‌ 3 : మందస మండలం కుంటికోట-బాలిగాం మధ్య జాతీయ రహదారిపై గురువారం పెళ్లికుమార్తెను తీసుకెళ్తున్న ఓ కారును వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. పెళ్లి కుమార్తె స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి మందస పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మందస మండలం హరిపురానికి చెందిన ఒక యువకుడి వివాహం పలాసలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో గురువారం జరుగుతోంది.  పెళ్లి కుమార్తెను సోంపేట మండలం కొర్లాం నుంచి పలాసలో కల్యాణ మండపానికి కారులో తీసుకెళ్తున్నారు. అదే సమయంలో  కుంటికోట-బాలిగాం మధ్య ఎదురుగా పలాస వైపు నుంచి బాతులలోడుతో వెళ్తున్న బొలెరో వ్యాను అధిక వేగంతో వస్తూ అదుపుతప్పి.. అవతల రోడ్డుకు వెళ్లి పెళ్లి కారుపై బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పెళ్లికుమార్తెతో సహా మరో ఐదుగురు, వ్యాన్‌ క్లీనర్లు గాయపడ్డారు. ప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ సాయి(28)మృతి చెందాడు. క్లీనర్‌ హరీష్‌తోపాటు కారు డ్రైవర్‌ ఎం.రమేష్‌, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి కుమార్తెతోపాటు మరో ఇద్దరు స్పల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు  108 హైవే అంబులెన్స్‌లో హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌-రిమ్స్‌)కి తరలించారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్‌ఐ నారాయణస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement
Advertisement