మనవడిని చూసి వస్తూ..

ABN , First Publish Date - 2021-06-14T05:43:42+05:30 IST

కుమార్తె మగబిడ్డకు జన్మనిచ్చింది. తన మన వడిని చూసుకుని ఆనందంగా తిరిగి వస్తున్న అతన్ని కారు రూపంలో మృత్యువు కబళించింది.

మనవడిని చూసి వస్తూ..
ప్రమాద దృశ్యం

ఏలూరు క్రైం, జూన్‌ 13: కుమార్తె మగబిడ్డకు జన్మనిచ్చింది. తన మన వడిని చూసుకుని ఆనందంగా తిరిగి వస్తున్న అతన్ని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఘటనకు సం బంధించి పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.  ద్వారకాతిరుమలకు చెందిన తాళ్ళూరి రామకృష్ణ (45) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.   అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఏలూరు ప్రభు త్వాసుపత్రిలో శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చూడడానికి ఆదివారం ఆసుపత్రికి వచ్చి సాయంత్రం తిరిగి తన మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ తీవ్ర గాయాలకు గురి కాగా 108 అంబులెన్స్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆయనను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్‌ ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిశోర్‌బాబు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారవడంతో అతని కోసం గాలిస్తున్నారు. 

దూబచర్లలో ఒకరి అనుమానాస్పద మృతి

నల్లజర్ల, జూన్‌ 13:  ఇంటి నుంచి గొడవపడి వెళ్లిన వ్యక్తి శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామానికి చెందిన పూతాటి శ్రీనివాసరావు (44) దూబచర్ల మసీదు సెంటర్‌లో నివాసం ఉంటూ పంది మాంసం వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఽశ్రీనివాసరావు నిత్యం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో గొడవపడిన శ్రీనివాసరావు దూబచర్లలో ఉన్న ఆర్‌ఆర్‌ పవర్‌ ప్లాంట్‌ ఆవరణలో ఆదివారం శవమై కని పించాడు.  దీంతో నల్లజర్ల ఎస్‌ఐ అవినాష్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ముఖం, శరీరంపై గాయాలున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

 విద్యుత్‌ వైరు తెగి పడి..

ఉంగుటూరు, జూన్‌ 13: మండలంలోని బాదంపూడి గ్రామంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు వీచిన సమయంలో విద్యుత్‌ వైరు తెగి పాల ప్యాకెట్ల కోసం వెళుతున్న సప్పా నాగేశ్వరరావు (39)పై పడింది. దీంతో అతను విద్యుదాఘాతంతో మృతి చెందాడు.  దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించినట్టు  ఎస్‌ఐ ఐ.వీర్రాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

పెంటపాడు, జూన్‌ 13: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యానాలపల్లి గ్రామానికి చెందిన రావూరి లక్ష్మణరావు (80) సరుకులు కొనుగోలుకు సైకిల్‌పై తాడేపల్లిగూడెం వస్తుండగా గణపవరం నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న లారీ కె. పెంటపాడు వద్ద ఇతనిని వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.  హెచ్‌సీ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేయగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌  దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-14T05:43:42+05:30 IST