సోదరితో రాఖీ కట్టించుకుని.. బైక్‌పై తిరిగెళ్తుండగా ఢీకొట్టిన కారు.. చివరకు..

ABN , First Publish Date - 2020-08-04T14:13:50+05:30 IST

హిమాయత్‌సాగర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండిగో ఎయిల్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేసే మహేంద్రసింగ్‌ (40) దుర్మరణం చెందారు. నల్లగండ్ల ప్రాంతంలో నివాసం ఉండే మహేంద్రసింగ్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో

సోదరితో రాఖీ కట్టించుకుని.. బైక్‌పై తిరిగెళ్తుండగా ఢీకొట్టిన కారు.. చివరకు..

ప్రాణాలు తీసిన అతివేగం

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘటనలో పైలట్‌ ..


రాజేంద్రనగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హిమాయత్‌సాగర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండిగో ఎయిల్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేసే మహేంద్రసింగ్‌ (40) దుర్మరణం చెందారు. నల్లగండ్ల ప్రాంతంలో నివాసం ఉండే మహేంద్రసింగ్‌ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పని చేస్తున్నాడు. ఆయన సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు బయలుదేరాడు. హిమాయత్‌సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రాగానే ముందు వెళ్తున్న ట్రక్కును క్యాబ్‌ డ్రైవర్‌ వెనకాల నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహేంద్రసింగ్‌ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మహేంద్రసింగ్‌ స్నేహితుడు ప్రవీణ్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ బాల్‌రాజు తెలిపారు. తెల్లవారు జామున సరిగ్గా కనిపించకపోవడంతో డ్రైవర్‌ ట్రక్కును ఢీ కొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 


రాయదుర్గం పీఎస్‌ పరిధిలో యువతి

బైక్‌పై అతివేగంతో ట్రిపుల్‌ రైడ్‌ చేస్తూ బైక్‌ అదుపుతప్పిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరుకు చెందిన కామేశ్వరి(24), రాథోడ్‌ విక్రమ్‌, ఉదావత్‌ ధనూష్ లతో కలిసి సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు పల్సర్‌ బైక్‌పై చందానగర్‌ నుంచి ఫిలింనగర్‌వైపు వెళ్తున్నారు. బయోడైవర్సిటీ వద్ద అతివేగంతో ఫ్లైఓవర్‌ను ఢీ కొట్టారు. దీంతో ముగ్గురూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కామేశ్వరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించే లోపు మృతి చెందింది. ప్రమాదంలో మిగతా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి మద్యం తాగి ఉండడం ఓ కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 


కిస్మత్‌పూర్‌కు చెందిన వ్యక్తి మృతి 

అతి వేగం మరొకరి మృతికి కారణమైంది. గండిపేట్‌ మండలం కిస్మత్‌పూర్‌ బస్తీకి చెందిన చురుముల శ్రీనివాస్‌(45) టైలర్‌. అతనికి భార్య స్వప్నతో పాటు నాలుగు సంవత్సరాల పాప ఉంది. సోమవారం రాఖీ పౌర్ణమి కావడం, తన సోదరి అనారోగ్యంతో ఉండటంతో బేగంపేట్‌లో ఉండే ఆమె ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి వెళ్లాడు. తిరిగి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం 5.45 గంటలకు ఉప్పర్‌పల్లి దాటిన తర్వాత పిల్లర్‌ నెంబర్‌ 203 వద్దకు రాగానే వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ అంతకు ముందే కిస్మత్‌పూర్‌లో ఓ కారును, బుద్వేల్‌ ఎక్స్‌టెన్షన్‌ చౌరస్తాలో ఆటోను ఢీ కొట్డాడని తెలిసింది. శ్రీనివాస్‌ సోదరుడు సి.నరేందర్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు నెంబర్‌ ఆధారంగా విచారణ జరపగా నిందితుడు లంగర్‌హౌజ్‌ ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ బి.కేశవ్‌(42)గా గుర్తించారు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేశవ్‌ను అరెస్ట్‌ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.


బాలుడి దుర్మరణం

వేగంగా వస్తున్న కారు ఎదురుగా వచ్చే బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళ్తున్న 16 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన చైతన్యపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన రాఘవేంద్ర (16) తన స్నేహితునితో కలిసి నాగోల్‌ వైపు వెళ్తున్నాడు. నాగోల్‌ నుంచి కొత్తపేట వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి మోహన్‌ నగర్‌ చౌరస్తా వద్ద రాఘవేంద్ర బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడి కాలుకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T14:13:50+05:30 IST