టౌనషిప్‌ మాటున.. కాసుల వేట..!

ABN , First Publish Date - 2022-01-20T06:36:46+05:30 IST

మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే బూచితో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.

టౌనషిప్‌ మాటున.. కాసుల వేట..!
గుట్టలు, బండరాళ్లు, కంపచెట్లతో కూడిన జగనన్న స్మార్ట్‌ టౌనషిప్‌ భూమి ఇదే..

రియల్‌ పేరుతో మధ్యతరగతి  ప్రజలతో వ్యాపారం

గ్రాఫిక్స్‌తో బురిడీ కొట్టించే యత్నం

అధికార పార్టీ నేతల లబ్ధి కోసమే భూముల కొనుగోలు

పరోక్షంగా ఎమ్మెల్యేకు ప్రయోజనం చేకూర్చే ఎత్తుగడ

ధర్మవరం చుట్టూ ప్లాట్ల రిజిస్ర్టేషన్ల నిలిపివేత 

సొంత పార్టీ నేతల వెంచర్లకు తప్పని కష్టాలు

నేటికీ జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌పలో గంపెడు మట్టి తీయని వైనం

అనంతపురం, జనవరి19 (ఆంధ్రజ్యోతి): మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే బూచితో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. కాసుల వేటకు తెరలేపారు. జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప పేరుతో ప్రభుత్వమే రియల్‌ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మధ్య తరగతి ప్రజలతో వ్యాపారం చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో రూ. కోట్లు ఖర్చు పెట్టి, టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తయినా... వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచట్లేదు. జగనన్న ఇళ్ల పేరుతో వేలాది మంది పేదలకు స్థలాలు పంపిణీ చేసినా.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తిగా నిర్మించి, ఇవ్వ లేదు. పేదల సొంతింటి కలలు నెరవేర్చలేని ప్రభుత్వం... జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప పేరుతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడం అంత సులువైన పని కాదన్నది తేటతెల్లమవుతోంది. ఈ పరిణామాల క్రమంలో జగనన్న స్మార్ట్‌ సిటీ పేరుతో ఓవైపు పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం తోపాటు... మరోవైపు మధ్య తరగతి ప్రజలను బురి డీ కొట్టించి, గల్లాపెట్టె నింపుకునేందుకు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


గ్రాఫిక్స్‌తో బురిడీ...

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి అతి సమీపంలో ధర్మవరం పట్టణానికి కూతవేటు దూరంలో జగనన్న స్మార్ట్‌ టౌనషిప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గ్రాఫిక్స్‌తో వెంచర్‌ రూపొందించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల తరహాలోనే ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రితో వర్చువల్‌ విధానంలో ఇటీవలే వెంచర్‌ను ప్రారంభించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్‌లో తొలుత రోడ్లు వేసి, ప్లాట్లు ఏర్పాటు చేస్తారు. ప్లాట్లు కొనదలచిన వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి, నచ్చిన దానిని కొనుగోలు చేస్తారు. జగనన్న స్మార్ట్‌ సిటీని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే... రోడ్లు గానీ... ప్లాట్లు గానీ కనిపించవు. అక్కడంతా పొలాలు, కొండగుట్టలు, కంపచెట్లతో ఎత్తుపల్లాలతో కూడిన భూములు మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటికీ జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప వెంచర్‌లో రైతులు సాగు చేసిన జొన్న, కంది ఇతరత్రా పంటలు న్నాయి. అక్కడ ప్లాటు కొందామని ఇతర ప్రాంతాల వారు వెళితే ఎక్కడ జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప ఏర్పాటు చేస్తున్నారని ఆ దారి గుండా వెళ్లే వారిని తెలుసుకో వాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు మాత్రం జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌పలో ప్లాట్లను బుక్‌ చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను ఓపెన చేశారు. ఏ ప్లాట్‌ ఎక్కడుందో... ఎక్కడైతే ప్లాట్‌ బాగుంటుందో ఎంచుకోలేని అయోమయ స్థితిలో కొనుగోలుదారులున్నారు. అధికారులు మాత్రం గ్రాఫిక్స్‌తో వెంచర్‌ను అద్భుతంగా రూపొందించారు. దీన్నిబట్టి చూస్తే.. గ్రాఫిక్స్‌తో మధ్య తరగతి ప్రజలను బురిడీ కొట్టించేలా వారి ప్రయత్నాలున్నాయనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప కోసం కొనుగోలు చేసిన భూముల్లో గంపెడు మట్టి తీయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


ఎమ్మెల్యేకు లబ్ధి చేకూర్చేందుకు పక్కా వ్యూహం...

జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప కోసం కుణుతూరు పొలాల్లోని భూములను ఎంచుకోవడం వెనుక పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేకు లబ్ధి చేకూర్చేందుకేనన్న విమర్శలున్నాయి. జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప భూములకు కూతవేటు దూరంలో అంటే మధ్యలో వంకను మినహాయిస్తే... అవలివైపు ధర్మవరం-చిగిచెర్ల ప్రధాన రహదారి సమీపంలో స్థానిక ఎమ్మెల్యే దాదాపు 40 ఎకరాల్లో వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంచర్‌ పనులు చకచకా జరిగిపోతున్నాయి. జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప కోసం మొత్తం 153 ఎకరాల భూములు కొనుగోలు చేయగా... అందులో 120 ఎకరాలకుపైగా భూముల్లో... 65 ఎకరాల దాకా రహదారుల విస్తరణ, యుటిలిటీ, ఓపెన సైట్‌తోపాటు ఇతర అవసరాలకు కేటాయించారు. మిగిలిన దాదాపు 56 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప కోసం 1272 ప్లాట్లు (3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఒక్కొక్క సెంటు రూ.3 లక్షలు చొప్పున విక్రయ ధర నిర్ణయించారు. కాగా... సౌకర్యాలు లేని ఆ ప్రాంతంలో సెంటు రూ.3 లక్షలు ధర నిర్ణయించడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌పలో సెంటు రూ.3 లక్షలున్న నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్యేదిగా చెబుతున్న వెంచర్లో సెంటు అంతకంటే ఎక్కువ ధర నిర్ణయించేందుకు వీలు కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విపక్షాల నుంచి అదే తరహా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చుట్టుపక్కల... అందులోనూ అధికార పార్టీ నేతలు, మద్దతుదారులకు సంబంధించినవి 60 వెంచర్ల దాకా... ఉన్నట్లు సమాచారం. వారందరి వెంచర్లలో ప్లాట్ల రిజిస్ర్టేషన్లను నిలుపుదల చేసినట్లు తెలిసింది. తన వెంచర్‌లోని ప్లాట్లన్నీ అమ్ముడుపోయిన తరువాతనే... మిగతా వారివి రిజిస్ర్టేషన చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలోనే... సంబంధిత అధికారులు నిలుపుదల చేశారన్న విమర్శలున్నాయి. ధర్మవరం మున్సిపాలిటీలో సొంత పార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ భర్త వేసిన వెంచర్‌లో ప్లాట్లు రిజిస్ర్టేషన కాకుండా నిలుపుదల చేసినట్లు ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటుండటం గమనార్హం.


సొంత పార్టీ నేతలు, మద్దతుదారులకు మేలు చేసేందుకే..

జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప భూ ముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వాస్తవాల్లోకి తొంగి చూస్తే... ఆసక్తికర అం శాలు వెలుగు చూస్తున్నాయి. జాతీయ రహదారిలోని మరూరు టోల్‌ప్లాజా నుంచి జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప వెంచర్‌ 9 కి.మీ., దూరంలో ఉంది. ధర్మవరం పట్టణానికి దాదాపు 5 కి.మీ దూరం. జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప కోసం కుణుతూరు పొలంలో దాదాపు 153 ఎకరాలను గుట్టకిందపల్లి, బడనపల్లి, గొల్లపల్లికి చెందిన 43 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఎకరా రూ.25 లక్షలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకుపైగా చెల్లించారు. అక్కడే భూములు కొనుగోలు చేయడం వెనుక సొంత పార్టీ నేతలు, మద్దతుదారులకు లబ్ధి చేకూర్చడానికే ఆ భూములను ఎంచుకున్నారన్న వి మర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. భూ ములు విక్రయించిన వారిలో అత్యధికులు అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు, మద్దతుదారులున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 







Updated Date - 2022-01-20T06:36:46+05:30 IST