ఇక పక్కాగా నీటి వనరుల లెక్క!

ABN , First Publish Date - 2022-01-15T09:36:35+05:30 IST

ఇక నీటి వనరుల లెక్క పక్కా కానుంది. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వల సమాచారం మొత్తం అరచేతిలోనే ఉండనుంది.

ఇక పక్కాగా నీటి వనరుల లెక్క!

  • ఆటోమేటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్లతో నమోదు
  • రాష్ట్రంలో మరో 53 చోట్ల ఏర్పాటు
  • ప్రాంతీయ, రాష్ట్ర డేటా కేంద్రానికి అనుసంధానం


హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇక నీటి వనరుల లెక్క పక్కా కానుంది. రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వల సమాచారం మొత్తం అరచేతిలోనే ఉండనుంది. అధికారులతో పాటు రైతులూ ఈ సమాచారాన్ని సులువుగా అందుకునేలా నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ జలాశయం, వాగులు, వంకలు, నదుల సమాచారాన్ని క్రోడీకరించే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దేశంలో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్‌హెచ్‌పీ)అమలవుతుండటంతో ఆ నిధులతో ఆటోమేటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్లు, రియల్‌ టైమ్‌ డేటా అక్విజిషన్‌ సిస్టమ్‌(ఆర్‌టీడీఏఎ్‌స)ను ఏర్పాటు చేస్తోంది.


దశలవారీగా రిజర్వాయర్లు, బ్యారేజీలు, నదులు, వాగుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఆటోమేటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్లు నీటి నిల్వలను, నీటి ప్రవాహాన్ని సెన్సర్ల ఆధారంగా సేకరించి.. రియల్‌ టైమ్‌ డేటా అక్విజేషన్‌ సిస్టమ్‌(ఆర్‌టీడీఏఎ్‌స)కు పంపితే... శాటిలైట్‌ ద్వారా ఆ వివరాలు ప్రాంతీయ డేటా కేంద్రం(కరీంనగర్‌) లేదా రాష్ట్ర డేటా కేంద్రానికి(హైదరాబాద్‌) చేరనునున్నాయి. 2, 3 రోజుల్లో కరీంనగర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 153 ఆటోమేటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్లు ఉండగా... మూడో దశలో తాజాగా 53 రికార్డర్ల కోసం బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. బిడ్ల దాఖలు బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11వ తేదీ దాకా బిడ్లను స్వీకరిస్తారు.

 

ప్రతీ పది నిమిషాలకు సమాచారం..

వాటర్‌ లెవల్‌ రికార్డర్లతో నమోదైన సమాచారం ఆర్‌టీడీఏఎస్‌ ద్వారా ప్రతీ 10 నిమిషాలకు డేటా సెంటర్లకు చేరనుంది. రబీలో పంటలు వేసే రైతులకు ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. క్షేత్రస్థాయి యంత్రాంగం చురుగ్గా వ్యవహరించడానికి దోహదపడుతుందని అంటున్నారు. ఈ సమాచారం ఆధారంగా.. ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ గేట్లు ఎత్తడం, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయడం వంటి నిర్ణయాలను తీసుకునే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతస్థాయి యంత్రాంగం కూడా డేటా ఆధారంగా సూచనలు/సలహాలు ఇవ్వడానికి  సమాచారం పనికొస్తుందని గుర్తు చేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. నీటి వనరుల సమాచారాన్ని అరచేతి(మొబైల్‌)లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-15T09:36:35+05:30 IST