ఆ ఒక్కటి మిగిలింది..

ABN , First Publish Date - 2020-03-17T09:49:47+05:30 IST

ముప్పై ఏళ్ల కెరీర్‌. 8 కామన్వెల్త్‌.. 2 ఆసియా పతకాలు. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నా ఆటలో ఇప్పటికీ తగ్గని జోరు. దేశంలో టేబుల్‌ టెన్ని్‌సకు ప్రత్యేక...

ఆ ఒక్కటి మిగిలింది..

ముప్పై ఏళ్ల కెరీర్‌. 8 కామన్వెల్త్‌.. 2 ఆసియా పతకాలు. నాలుగు పదుల వయస్సుకు చేరువవుతున్నా ఆటలో ఇప్పటికీ తగ్గని జోరు. దేశంలో టేబుల్‌ టెన్ని్‌సకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన 37 ఏళ్ల ఆచంట శరత్‌ కమల్‌.. తాజాగా ఒమన్‌ టైటిల్‌ను ముద్దాడి ఒలింపిక్స్‌ రేసుకు తాను సిద్ధమని తెలియజేశాడు. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఈ ప్యాడ్లర్‌.. ఆ ఒక్కటే మిగిలిందని అంటున్నాడు. అదేంటో తెలుసుకుందాం.


పదేళ్ల తర్వాత ఇంటర్నేషనల్‌ టైటిల్‌ సాధించడం ఎలా అనిపిస్తోంది?

గల్ఫ్‌ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుందని తెలిసి కూడా ఒలింపిక్‌ ఏడాది కావడంతో టైటిల్‌ సాధిస్తే ర్యాంకింగ్‌ మెరుగుపడుతుందనే ఉద్దేశంతో వెళ్లా. అనుకున్నట్టే ఒమన్‌ టైటిల్‌ గెలవడంతో సంతోషంగా ఉంది. 2010లో  ఈజిప్టు  టోర్నీ విజయం తర్వాత ఇదే నా తొలి ఇంటర్నేషనల్‌ టైటిల్‌. ఒలింపిక్‌ అర్హత పోటీలు సమీపిస్తుండడంతో కుటుంబ సభ్యులు వెళ్లొద్దని వారించినా ప్రాక్టీస్‌ లభిస్తుందని వెళ్లా.


టేబుల్‌ టెన్నిస్‌ ఎప్పుడు మొదలుపెట్టారు?

ముప్పై ఏళ్ల నుంచి ఆడుతున్నా. నేను పుట్టేసరికే నాన్న టేబుల్‌ టెన్ని్‌సలో కోచింగ్‌ ఇస్తుండేవారు. నా ఆసక్తి గమనించి నాన్న శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఏడేళ్ల వయస్సులో తొలిసారి స్కూల్‌స్థాయి పోటీల్లో పాల్గొన్నా. అనంతరం అం డర్‌-10,14,15,17 విభాగాల్లో పలు టైటిళ్లు సాధించి తమిళనాడులో టాప్‌ ప్లేయర్‌గా గుర్తిం పు తెచ్చుకొన్నా. దీంతో సబ్‌ జూనియర్‌ తర్వాత ఒక్క జాతీయ జూనియర్‌ టోర్నీలో కూడా ఆడకుండానే, నేరుగా సీనియర్‌ నేషనల్స్‌లో పోటీపడ్డా. నిరుడు తొమ్మిదో సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షి్‌ప నెగ్గి కమలేష్‌ మెహతా(8 టైటిళ్లు) రికార్డును బద్దలుకొట్టా.


30 ఏళ్ల కెరీర్‌లో వెనక్కి చూస్తే ఏమనిపిస్తోంది?

నేను టీటీలో కెరీర్‌ ప్రారంభించే నాటికి దేశంలో స్పోర్ట్స్‌కు పెద్దగా ఆదరణ లేదు. 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించాక రాజకీయ నాయకులు, ఎవరైనా ఉన్నత స్థాయి వారిని కలిసినప్పుడు, ఆటలు ఒక్కటే కాదు చదువు కూడా ఉండాలి.. అని చెప్పేవారు. బంధువులు అయితే, స్పోర్ట్స్‌ ఆడితే ఏమొస్తుంది.. పీఈటీ మాస్టరో, కోచ్‌వో అవుతావ్‌ అంతేనా అని చులకనగా మాట్లాడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. క్రీడాకారులకు ఇస్తున్న గౌరవం, వారికొచ్చే ఆదాయం కూడా పెరిగింది. పదేళ్ల కిందటే కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించా. ఒలింపిక్‌ పతకమే మిగిలిపోయింది. ఈసారి అదృష్టం ఎలా ఉందో చూడాలి.


టీటీలో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులేంటి?

టీటీ మౌలిక సదుపాయాల విషయంలో విదేశాలతో పోల్చితే మన దేశం ఇంకా వెనుకే ఉంది. ఆట విషయానికి వస్తే నా కెరీర్‌ ప్రారంభంలో స్కోరింగ్‌ విధానం 5 సెట్లు, 21 పాయింట్లకు ఉండేది. ఇప్పుడు 11 పాయింట్లకు తగ్గిపోయింది. ఇదివరకు బంతి 30 ఎంఎం మాత్రమే ఉండేది. ఇప్పుడు 40 ఎంఎంకుపైగా పెరిగింది. ఆకారంలో తేడా రావడంతో గేమ్‌లో ర్యాలీలు పెరిగాయి. నిబంధనలు, టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వచ్చాయి.


రాజమండ్రితో మీకున్న అనుబంధం గురించి..?

నాన్న శ్రీనివాసరావుది రాజమండ్రి, అమ్మది మచిలీపట్నం. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడ్డాం. బంధువుల శుభకార్యాలకు నాన్నతో కలిసి రాజమండ్రి వెళుతుంటా. 2005లో అర్జున అవార్డు వచ్చినప్పుడు రాజమండ్రి టౌన్‌హాల్‌లో నాకు సన్మానం చేశారు. 


రిటైర్మెంట్‌ ఎప్పుడు?

రిటైర్మెంట్‌ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆట నుంచి తప్పుకొన్నాక కూడా టీటీకి అనుబంధంగానే పనిచేస్తా. టాలెంట్‌ హంట్‌ నిర్వహించి ప్రతిభగల ఆటగాళ్లకు సహాయపడాలనే ఆలోచన ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆహ్వానిస్తే హైదరాబాద్‌, విశాఖపట్నంలో అకాడమీలు ఏర్పాటు చేస్తా.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - 2020-03-17T09:49:47+05:30 IST