ఆచార్య ఎండ్లూరి కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-29T07:54:23+05:30 IST

ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి ఆచార్య డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ (63) కన్నుమూశారు.

ఆచార్య ఎండ్లూరి కన్నుమూత

  • గుండెపోటుతో సుధాకర్‌ తుదిశ్వాస.. 
  • 2019లో భార్య మృతి.. మూడేళ్లుగా మనోవేదన.. 
  • ఈ నెల 21న పెద్ద కుమార్తె పెళ్లి 
  • వేడుక తర్వాత వారానికే విషాదం.. ప్రముఖుల నివాళులు, సంతాపం
  • రాజమండ్రి, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో ఆచార్యుడిగా సేవలు
  • కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం.. గోసంగి తదితర రచనలు



హైదరాబాద్‌ సిటీ/ కవాడిగూడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి ఆచార్య  డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ (63) కన్నుమూశారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా సేవలందించిన సుధాకర్‌ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తెలు మనోజ్ఞ, మానస ఉన్నారు. ఆయన భార్య హేమలత రచయిత్రి. ఆమె 2019లో మృతిచెందారు. జీవన సహచరి మరణంతో సుదాకర్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కరోనా వచ్చి హేమలత చెంతకు తనను చేరిస్తే బాగుండేదంటూ కొన్ని సందర్భాల్లో ఆవేదనను వ్యక్తపరిచేవారు. పెద్ద కుమార్తె మనోజ్ఞకు ఈనెల 21నే వివాహమైంది. ఆ వేడుక జరిగిన వారం రోజులకే ఆయన చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న కుమార్తె మానస కథా రచయిత్రి. ఆమె రాసిన కథా సంపుటి ‘మిళింద ’కు 2020 కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. 1959 జనవరి 21న నిజామాబాద్‌ జిల్లా పాములబస్తీలో సుధాకర్‌ జన్మించారు. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. 


ఉన్నత విద్యను ఎండ్లూరి హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యుడి స్థాయికి ఎదిగారు.  వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువ, తెలి వెన్నెల తదితర  రచనలు చేశారు. సుధాకర్‌ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నారాయణగూడలోని క్రైస్తవ శ్మశానవాటికలో నిర్వహించారు. అంతకుముందు ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని దోమల్‌గూడలోని నివాసంలో ఉంచారు. ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు  కె.శ్రీనివాస్‌, కవి, రచయిత జయరాజ్‌, అరుణోదయ విమలక్క, ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు, ప్రముఖ దళిత రచయిత్రి జూపాక సుభద్ర, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, సామాజిక వేత్త సజయ, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌ తదితరులు నివాళులర్పించారు. 


ఎండ్లూరి మృతిపట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఎండ్లూరి రచనలకు మరణం లేదని అన్నారు. వర్తమాన దళిత సాహిత్యంలో ఎండ్లూరి మేరు పర్వతం వంటివారని కవి సంధ్య సంపాదకుడు శిఖామణి పేర్కొన్నారు. సుధాకర్‌ మృతి విషాదకరమని నందిని సిధారెడ్డి అన్నారు. ఎడ్లూరి గొప్ప మానవతావాది అని సామాజికవేత్త బీఎస్‌ రాములు అభివర్ణించారు. వర్గీకరణ ఉద్యమ అక్షర ఆయుధం ఎండ్లూరి అని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ  పేర్కొన్నారు. ఎడ్లూరి మృతి సాహితీ లోకానికి తీరని లోటు అని తెలుగు వర్సిటీ ఉప సంచాలకులు కిషన్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ పేర్కొన్నారు. అభ్యుదయ సాహితీవేత్తను తెలంగాణ, ఏపీ కోల్పోయాయని అరసం అధ్యక్షుడు ఆర్వీ రామారావు నివాళులర్పించారు. ఎండ్లూరి మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-29T07:54:23+05:30 IST