Feb 23 2021 @ 12:09PM

`ఆచార్య`.. అడవుల్లో ఛేజింగ్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య`లో నటిస్తున్నారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. `సిద్ధ` పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కొంత భాగాన్ని చిత్రీకరించేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి రామ్‌చరణ్ కొద్ది రోజుల క్రితమే వెళ్లాడు. 

రెండ్రోజుల క్రితం చిరంజీవి కూడా మారేడుమిల్లి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ చిరు, చరణ్ మధ్య కార్ ఛేజింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. వచ్చే నెల 6వ తేదీ వరకు చిరంజీవి, చరణ్ అక్కడ షూటింగ్‌లో పాల్గొంటారట. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పూజా హెగ్డే అని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ సినిమా వేసవి సందర్భంగా మే 13న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలన రికార్డులు నమోదు చేసింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెని, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.