ఆరోగ్య భారత్‌ను సాధిద్దాం!

ABN , First Publish Date - 2021-04-07T05:35:48+05:30 IST

‘యథాఅన్నం – తథా మన్నం’ - ఆగష్టు 2020లో జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహారం ప్రాధాన్యత గురించి...

ఆరోగ్య భారత్‌ను సాధిద్దాం!

‘యథాఅన్నం – తథా మన్నం’ - ఆగష్టు 2020లో జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహారం ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ ప్రస్తావించిన సూక్తి ఇది. ఆహారాన్ని బట్టే ఆరోగ్యం, మనసు ఆధారపడి ఉంటాయనేది దీని అర్థం. భారత ప్రభుత్వం ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యత, ప్రజలకు పౌష్ఠికాహారాన్ని అందించే దిశగా ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రధాని మాటల్లో వ్యక్తమవుతోంది. ఆకలి రహిత స్థితి (జీరో హంగర్)ను సాధించేందుకు భారత ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. కరోనా సవాళ్ళ నేపథ్యంలో ఈ వేగాన్ని మరింత పెంచింది. ప్రజల్లో అవగాహన, ఆచరణలే లక్ష్యంగా జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.


తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ. సరైన అహారం సరైన మానవ సమాజాన్ని నిర్మిస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్న సమాజమే వేగంగా అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. ఈ స్ఫూర్తితోనే 2030 నాటికి ఆకలి బాధలకు తావు లేని సౌభాగ్య ప్రపంచాన్ని సాకారం చేయాలన్న లక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని పరిపూర్ణంగా సాధించి, ఎలాంటి రుగ్మతలకు తావు లేకుండా ఉండడం. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు త్రికరణశుద్ధితో పని చేస్తోంది. దేశంలో అన్ని రకాల పౌష్ఠికాహార లోపాలను రూపు మాపటంలో ప్రభుత్వం చూపుతున్న చొరవ, తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, చేపడుతున్న చర్యల కారణంగా దేశంలో పోషకాహార పరిస్థితి ఎంతో మెరుగుపడింది.


దేశంలోని మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే లక్ష్యంతో 2017 డిసెంబరులో రూ.9046.17 కోట్లతో పోషకాహార కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం 2018 మార్చి 8న గౌరవ భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా రాజస్థాన్‍లోని ఝన్ ఝనులో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పోషకాహార కొరతను తగ్గించడం, రక్తహీనత సమస్యల లేకుండా చూడడం, పుట్టబోయే శిశువులు సరైన బరువుతో పుట్టేలా చూడడం మొదలైనవి ఈ కార్యక్రమ లక్ష్యాల్లో ప్రధానం. దీనితో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోంది.


ప్రభుత్వ కృషి ఇలా సాగుతుండగానే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా భారత్‌లోనూ ప్రవేశించింది. అయితే ఈ మహమ్మారిని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొగలగడమే గాక, దీని నుంచి కొత్త పాఠాలు నేర్చుకుని ఆచరణలో పెట్టింది. కరోనా మహమ్మారి పౌష్ఠికాహార ప్రాధాన్యత ఏమిటో మరోసారి తెలియజెప్పింది. ఆహార భద్రతకే పరిమితంగాక, పోషకాహార భద్రత మీద కూడా మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని కళ్ళకు కట్టింది. ఈ దిశగా అభివృద్ధి సాధించేందుకు ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం ప్రభుత్వం "భారతీయ పోషణ్ కృషి కోశ్" ఏర్పాటులో నిమగ్నమైంది. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పండే పంటలు, వాటి పోషక విలువలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ విధంగా ప్రజలు తమ ప్రాంతాల్లో పండే పంటలను, అందులో ఉండే పోషక విలువలను తెలుసుకునే అవకాశం ఉంది. రేపటి భారత పౌరులైన విద్యార్థుల్లో పోషకాహారం గురించి చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమేగాక వారిలో మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు పోషకాహారం గురించి పోటీలు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్‌లో ఐక్యతా ప్రతిమ సమీపంలో పోషకాహార పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ పోషకాహారానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా కీలకమైన ప్రదేశాల్లో ఇలాంటి పోషకాహార పార్కులను అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు విద్యార్థుల కోసం మరింత ప్రత్యేకంగా ప్రతి తరగతిలో పోషకాహార మానిటరును, కార్డులను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇలా సాంకేతికతను వినియోగించుకుంటూ, పోషకాహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.


ఆరోగ్యభద్రత, పోషకాహార భద్రత లాంటి అంశాల విషయంలో ప్రభుత్వం కృషి చేస్తే సరిపోదు. ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పిల్లలు, తల్లుల్లో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రజలందరి భాగస్వామ్యంతో సంపూర్ణ పోషణ్ మహ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వహించింది. అయితే ఈ స్ఫూర్తి ఇక్కడితో ఆగిపోకూడదు. మనం ఏం తింటున్నామనే విషయం మీద ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాలి. ప్రజల్లో పౌష్ఠికాహార విజ్ఞానం పట్ల అవగాహన పెరిగినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం, తద్వారా అభివృద్ధి చెందిన సమాజం సాధ్యమౌతాయి. భారతదేశంలో 130 కోట్ల ప్రజలు ఉండగా ప్రతి ముగ్గురిలో ఒకరు పోషకాహారలోప సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ళలోపు పిల్లల్లో 33 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. అంతే కాదు ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనికి కారణం పేదరికం మాత్రమే కాదు, అవగాహన లోపం కూడా.


ఈ రోజుల్లో చెప్పుకోదగిన స్థాయిలో చదువుకున్న యువత కూడా పోషకాహార లోపంతో బాధపడుతోంది. దీనికి కారణం ఎలాంటి పోషణ లేని జంక్ ఫుడ్‍కు అలవాటు పడడమే. పోషకాహార లోపం పల్లెలకే పరిమితం కాలేదు. పట్టణాల్లో మరింత అధికంగా విస్తరిస్తోంది. నేటికీ కేవలం బేకరీల్లో దొరికే ఆహారంతో కడుపునింపుకునే ఉద్యోగుల సంఖ్య చాలానే ఉంది. వీరందరికీ పోషకాహారం ప్రాధాన్యత తెలిసినప్పటికీ ఆచరణలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినప్పటికీ 57 శాతం మంది మాత్రమే దీన్ని పాటిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు, పిల్లల విషయంలో సమాజంలో నేటికీ ఎన్నో మూఢనమ్మకాలు, అవగాహనా లోపాలు, ఆచరణా లోపాలు కొనసాగుతునే ఉన్నాయి. వీటన్నింటినీ చరమగీతం పాడే విధంగా ప్రజల ఆలోచనా ధోరణి మారినప్పుడే ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా సంపూర్ణ పోషణ్ మాహ్ లాంటి కార్యక్రమాల విజయంలో ప్రజల అవగాహన కంటే, ఆచరణే మరింత కీలకం. 

పరవస్తు నాగసాయి సూరి

కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి, న్యూఢిల్లీ

Updated Date - 2021-04-07T05:35:48+05:30 IST