ఆలయ భూమి స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

అల్లిపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 650 గజాల స్థలాన్ని దేవదాయ శాఖ అధికారులు మంగళవారం స్వాఽధీనం చేసుకున్నారు. అందులో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూలగొట్టారు.

ఆలయ భూమి స్వాధీనం
భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దేవదాయశాఖ సిబ్బంది

కర్ఫ్యూ సమయంలో అక్రమ నిర్మాణం

విశాఖపట్నం/ దొండపర్తి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అల్లిపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 650 గజాల స్థలాన్ని దేవదాయ శాఖ అధికారులు మంగళవారం స్వాఽధీనం చేసుకున్నారు. అందులో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూలగొట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దొండపర్తి డీఆర్‌ఎం ఆఫీసు జంక్షన్‌ అల్లిపురం వార్డు నంబరు 31, సర్వే నంబరు 329లో దేవదాయశాఖకు 650 గజాల స్థలం ఉంది. దానిపై దేవదాయ ట్రిబ్యునల్‌లో కేసు ఉంది. కె.సత్యవతి అనే మహిళ ఆ స్థలం తనదంటూ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించగా అధికారులు పిటిషన్‌ వేశారు. దాంతో వివాదం తేలేవరకు అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ట్రిబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి అందులో గత కొన్నేళ్లుగా నిర్మాణం చేపట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దానిపై దేవదాయశాఖ నోటీసులు ఇస్తోంది. కొద్ది కాలం క్రితం ఆ స్థలానికి వారసురాలినని కేసువేసిన సత్యవతి మరణించారని, దాంతో ఆ స్థలంపై వివాదం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఆమె మేనల్లుడినంటూ ఓ వ్యక్తి వచ్చి అక్కడ నిర్మాణం చేపట్టారు. దానిపై కూడా దేవాలయం ఈఓ పద్మ  నోటీసులు ఇచ్చారు. అయితే కరోనా కర్ఫ్యూ ను ఆసరాగా తీసుకుని నిర్మాణం వేగవంతం చేశారు.  దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, నిర్మాణం పడగొట్టి స్థలం స్వాధీనం చేసుకున్నామని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి తెలిపారు. దీనిపై ఐదుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, రాత్రి సమయంలో నిర్మాణ పనులు చేపట్టారని, దీనికి జీవీఎంసీ అనుమతి కూడా లేదని ఆమె తెలిపారు. అయితే తమ నిర్మాణం కూల్చవద్దంటూ ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులు అడ్డుపడ్డారు. అందులో ఒకరు వైసీపీ నాయకుడిని అని అధికారులకు చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా వారు కూల్చివేతకు వచ్చిన జేసీబీని అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీస్‌లు వచ్చి వారిని దూరంగా తీసుకెళ్లడంతో అధికారులు అక్కడ దేవదాయ శాఖ బోర్డు పెట్టారు. మరోసారి ఆ స్థలంలోకి రాకూడదని వారికి స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఈఓలు పద్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST