రాణేపై చర్య ప్రతీకార రాజకీయం కాదు: శివసేన

ABN , First Publish Date - 2021-08-26T21:38:36+05:30 IST

కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై చర్యలు తీసుకోవడం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ చేసిన ఆరోపణలను...

రాణేపై చర్య ప్రతీకార రాజకీయం కాదు: శివసేన

ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై చర్యలు తీసుకోవడం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ చేసిన ఆరోపణలను శివసేన ఖండించింది. మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, పార్టీ నేత ప్రతాప్ సర్నాయక్‌ నివాసాలపై ఈడీ దాడులే ప్రతీకార రాజకీయాలని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రత్యారోపణలు చేశారు. పశ్చిమబెంగాల్‌లా మహారాష్ట్ర మారుతోందంటూ రాణే చేసిన వ్యాఖ్యలను సైతం రౌత్ తప్పుపట్టారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. బెంగాల్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీనే తోకముడిచిందని ఎద్దేవా చేశారు.


''పశ్చిమబెంగాల్‌లా మహారాష్ట్రను మారనీయమని అనడంలో అర్ధం ఏమిటి? మీరు (బీజేపీ) బెంగాల్‌లో ఓడిపోయారనే విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి తోకముడిచారు. పశ్చిమ బెంగాల్ ఈ దేశానికే సింహంలాంటింది. ఎందరో విప్లవవీరుల పురిటిగడ్డ కూడా. అలాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే మిమ్మల్ని దేశం క్షమించదు'' అని అన్నారు. రాణేను అరెస్టు చేయమంటూ మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ పోలీసులను ఆదేశిస్తున్నట్టు బయటకు వచ్చిన వీడియో క్లిప్‌పై ప్రశ్నించినప్పుడు, రత్నగిరి గార్డియన్ మినిస్టర్ అనిల్ పరబ్ అని, ఆయన ఆదేశాలివ్వవచ్చని రౌత్ సమాధానమిచ్చారు. అయితే తాను ఆ వీడియో క్లిప్ చూడలేదని, అది సాక్ష్యంగా పరిగణించలేమని అన్నారు. రాణేను కొద్దిసేపు అరెస్టు చేయడానికి అనిల్ పరబ్ కారణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ బుధవారంనాడు ఆరోపించారు.

Updated Date - 2021-08-26T21:38:36+05:30 IST