ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు

ABN , First Publish Date - 2020-08-11T11:32:35+05:30 IST

తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొంది న ఓ కానిస్టేబుల్‌, పంచ లోహాల చోరీ కేసులోని నిందితులతో సంబంధాలు కొనసాగించిన మరో కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు వేటు వేశారు.

ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు

ఉద్యోగం నుంచి ఒకరి తొలగింపు..

మరొకరిపై శాఖాపరమైన చర్యలు


అనంతపురం క్రైం, ఆగస్టు10: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొంది న ఓ కానిస్టేబుల్‌, పంచ లోహాల చోరీ కేసులోని నిందితులతో సంబంధాలు కొనసాగించిన మరో కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు వేటు వేశారు. ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించగా.. మరొకరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సోమవారం ప్రకటన ద్వారా వివరించారు. కళ్యాణదుర్గం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌ (పీసీ నెం. 2022) తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. అతడిపై 2001లో హిందూపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నేరం జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం కావడంతో ఆ కేసును స్థానిక టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు బదలాయించారు. దర్యాప్తులో వాస్తవం నిర్ధారణ కావటంతో తాజాగా అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌ షేక్షావలి (పీసీ నెం. 09)పై పలు ఆరోపణలు వచ్చాయి.


ప్రధానంగా 2015లో కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి  రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పంచలోహ విగ్రహాలను అపహరించారు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని అప్పట్లో కర్ణాటక పోలీసులు కానిస్టేబుల్‌ షేక్షావలిని అరెస్ట్‌ చేశారు. దీంతో లోతుగా విచారణ చేసి, తాజాగా శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. వీరితోపాటు శాఖలో మరికొంతమందిపై విచారణ సాగుతోంది. నిజం నిర్ధారణ కాగానే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. ఈ చర్యలతో జిల్లా పోలీసుశాఖలో అలజడి మొదలైంది.

Updated Date - 2020-08-11T11:32:35+05:30 IST