కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-10T05:30:00+05:30 IST

కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆదోని ఆర్డీవో రామకృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం కోసిగిలోని 144 సెక్షన్‌ కర్ఫ్యూ ఆంక్షలను అకస్మికంగా తనిఖీ చేశారు.

కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు
కోసిగిలో వాహనదారులతో మాట్లాడుతున్న ఆదోని ఆర్డీవో రామక్రిష్ణా రెడ్డి

  1. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి 


కోసిగి, మే 10:  కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘిస్తే  చర్యలు తప్పవని ఆదోని ఆర్డీవో రామకృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం కోసిగిలోని 144 సెక్షన్‌ కర్ఫ్యూ ఆంక్షలను అకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారులకు, ప్రజలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎవరైనా రోడ్లపై కనిపిస్తే  చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.  తహసీల్దార్‌ రుద్రగౌడు, ఎంపీడీవో సూర్యనరసింహారెడ్డి, సీఐ ఈశ్వరయ్య, వీఆర్వో లింగన్న తదితరులు పాల్గొన్నారు. 


సచివాలయ సిబ్బంది, వలంటీర్లపై ఆగ్రహం 

కోసిగి మండలంలో సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లపై ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్డీవో రామకృష్ణారెడ్డి అకస్మికంగా మధ్యాహ్నం 1 గంట సమయంలో కర్ఫ్యూ ఆంక్షలను తనిఖీ చేయగా, రెవెన్యూ, పోలీసు సిబ్బంది మాత్రమే కనిపించడంతో సచివాలయ సిబ్బంది, వలంటీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై  కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. విధులకు హాజరుకాని సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆయా శాఖ అధికారుల పేర్లు తమకు ఇవ్వాలని స్థానిక వీఆర్వోలకు ఆర్డీవో ఆదేశించారు.  అలాగే కోసిగి సచివాలయం-1లో ఉదయం 11 గంటలైనా సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఇద్దరు తప్ప.. మిగతావారు విధులకు హాజరు కాకపోవడంతో 11 గంటలైనా ఖాళీ కుర్చీలు కనిపించాయి.  కర్ఫ్యూ నిబంధనలు ప్రారంభమైనప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులు  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండల స్థాయి అధికారులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొన్ని గ్రామ సచివాలయాల్లో విధులకు వెళ్లని ఉద్యోగులపై అధికారులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎంపీడీవో సూర్యనరసింహారెడ్డిని వివరణ కోరగా,  సమయపాలన పాటించడం  వారికి మెమోలు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.



ఆదోని: ఆదోని పట్టణంలోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం వన్‌టౌన్‌, త్రీటౌన్‌, టూటౌన్‌, ట్రాఫిక్‌ సీఐలు చంద్రశేఖర్‌, శ్రీరాములు, నరేష్‌కుమార్‌, లక్ష్మయ్యలు కర్ఫ్యూను కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ సమయంలో పోలీసులు పెద్దసంఖ్యలో రోడ్లపైకి చేరి మాస్కు లేకుండా ద్విచక్ర వాహనాలపై వస్తున్న వారికి జరిమానా విధించారు. కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరగరాదంటూ సూచనలు సలహాలు ఇచ్చారు. 


హాలహర్వి: ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. సోమవారం సరిహద్దులో ఏర్పాటు చేసిన ఛత్రగుడి చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. అనంతరం బళ్లారి జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సైతం ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ భాస్కర్‌, ఎస్‌ఐలు నరేంద్ర, రామాంజులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-10T05:30:00+05:30 IST