Abn logo
May 23 2020 @ 04:51AM

దేవుడి మాన్యం భద్రమే!

జిల్లాలో దేవాలయ భూముల రక్షణకు యాక్షన్‌ప్లాన్‌ 

72 ఆలయాల భూములకు పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు 

ఇప్పటికే 48 ఆలయాలకు సంబంధించి ప్రక్రియ పూర్తి 

అన్యాక్రాంత భూములపై పూర్తయిన సర్వే 

కబ్జాభూముల స్వాధీనం 

దేవాదాయశాఖ మంత్రి పర్యవేక్షణలో సీరియస్‌ చర్యలు 

అడెల్లి భూములపై సందిగ్ధత 


నిర్మల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న దేవాదాయ భూములకు సంబంధించి పకడ్బందీ చర్యలు మొదలయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వీయపర్యవేక్షణలో ఆక్రమిత భూములను స్వాఽధీనం చేసుకోవడమే కాకుండా మొత్తం భూములన్నింటికీ ఆయా ఆలయాల్లోని కొలువైన దేవుళ్ల పేరుపై పట్టాదార్‌, పాస్‌ పుస్తకాలు కూడా రూపొందించే చర్యలు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 72 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల పరిధిలో 1381 ఎకరాల 7 గుంటల భూములున్నాయి.


ఇందులో నుంచి 1185.05 ఎక రాలు కుష్కిభూమి కాగా 196.2 ఎకరాలు మెట్టభూమి. అయితే మొత్తం 1381 ఎకరాల నుంచి దాదాపు 500 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అయితే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు గత కొద్ది రోజుల క్రితం దేవాదాయ భూముల ఆక్రమణపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ఆక్రమిత భూముల వివరాలను సేకరించి ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. కాగా కొంతమంది కోర్టును ఆశ్రయించినప్పటికీ దేవాదాయశాఖ అధికారులు కౌంటర్‌దాఖలు చేసి ఆ భూములను దక్కించుకునే ప్రయత్నం చేశారు. గత రెండు దశాబ్దాల నుంచి జిల్లాలోని దేవాదాయ భూములు పరాధీనం అవుతూనే ఉన్నాయి. భూములను కొంతమంది అక్రమంగా లీజుకు తీసుకొని నామమాత్రపు పన్నును చెల్లించారు.


మరికొంత మంది ఓ అడుగు ముందుకు వేసి తమ ఆధీనంలో ఉన్న దేవాలయాల భూములకు సంబందించి రికార్డులను సైతం తారుమారు చేసి బినామీల పేరిటా ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే కోట్ల రూపాయల విలువైన దేవాదాయ భూముల ఆక్రమణపై దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి సీరియస్‌గా చర్యలు మొదలుపెట్టారు. అధికారులను సైతం ఆయన హెచ్చరిస్తూ దేవాలయాల భూములన్నింటినీ వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవంటూ కూడా మంత్రి చేసిన హెచ్చరికలు క్రమంగా ఫలితాన్నిచ్చాయి. మంత్రి స్వీయ పర్యవేక్షణ చేస్తున్నందున సంబంధిత అధికారులు ఆక్రమిత భూములపై దృష్టి పెట్టి వాటికి సంబంధించి మరుగున పడ్డ రికార్డులను వెలికితీశారు. దీంతో కబ్జాదారుల గుట్టు రట్టయినట్లయ్యింది.


మొత్తం భూములన్నింటినీ గుర్తించి ఆలయాల వారిగా ఆ భూములపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూములన్నింటినీ సంబంధిత ఆలయంలోని దేవుని పేరిటా పట్టాలు చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లాలో ఇలా 360 ఎకరాల భూములను ఆయా ఆలయాల దేవుళ్ల పేరిట సంబంధిత తహసీల్దార్‌లు పట్టాలు జారీ చేశారు. మరో వెయ్యి ఎకరాల భూములకు కొద్ది రోజుల్లోనే పట్టాలు జారీ కాబోతున్నాయి. న్యాయపరంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూస్తూ ఈ పట్టాదార్‌పాస్‌ పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోనే ప్రసిద్ది చెందిన అడెల్లిపోచమ్మ ఆలయానికి సంబంధించిన కొన్ని భూములపై ఏర్పడుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కూడా సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అడెల్లిపోచమ్మ ఆలయానికి గతంలో కొంతమంది పరిసర భూములను దానం చేశారు.


ప్రస్తుతం అడెల్లి పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇలా దానం చేసిన వారు మళ్ళీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొంతమంది దానం చేసిన భూములను రికార్డులను సైతం తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 


బాసర భూముల గుర్తింపు

ప్రసిద్ధ బాసర సరస్వతీదేవి ఆలయానికి సంబంధించిన భూముల వివరాలను దేవాదాయశాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తం బాసర ఆలయానికి సంబంధించి 156 ఎకరాల 9 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఇక్కడి విఠలేశ్వర ఆలయానికి సంబంధించి కూడా 18 ఎకరాల 19 గుంటల భూములు ఉన్నాయి. అలాగే తానూర్‌లోని ఎల్వత్‌ దత్తాత్రేయ మందిరం పరిధిలో 22 ఎకరాల 1 గుంట భూమి ఉండగా ఆ భూమిని ఇటీవలే 3.91లక్షలకు లీజుకు ఇచ్చారు. విఠలేశ్వర ఆలయం భూమికి వేలం వేయగా 1.50 లక్షల ఆదాయం సమకూరింది. గతంలో ఈ భూములకు సంబంధించిన లీజుల గడువు దాటినప్పటికీ వాటిని పునరుద్దరించకుండానే ఒక్కరికే కట్టబెట్టేవారు. క్రమక్రమంగా భూములపై లీజుదారుల ఆధిపత్యం పెరగడం, వారు తప్పుడు రికార్డులను సృష్టించడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. బాసరలో ఉన్న 156 ఎకరాల 9 గుంటల భూమి ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైనదిగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు బాసర విఠలేశ్వర ఆలయం భూములు కబ్జాకు గురయ్యాయి.


కొంతమంది పలుకుబడి, పరపతి గల వ్యక్తులు ఈ భూములను కబ్జా చేసి తప్పుడు రికార్డులను సైతం సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ తతంగం తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి రికార్డులను వెలికి తీసి ఆక్రమణకు గురైన భూములను స్వాఽధీనం చేసుకోవాలంటూ హెచ్చరించారు. మంత్రి హెచ్చరికలతో కదిలిన యంత్రాంగం 18 ఎకరాల 19 గుంటల విఠలేశ్వర ఆలయ భూములను స్వాధీనం చేసుకొని రికార్డులను సైతం తయారు చేయించారు. దీంతో ఇప్పటి వరకు పరాధీనంలో ఉన్న భూములు దేవాలయ శాఖ పరిధిలోకి చేరిపోయాయి. 


జిల్లా వ్యాప్తంగా దేవాలయాల భూముల గుర్తింపు

జిల్లా వ్యాప్తంగా మొత్తం దేవాదాయ శాఖ పరిధిలో 72 ఆలయాలు ఉండగా ఈ ఆలయాల పరిధిలో 1381 ఎకరాల 7 గుంటల భూములున్నాయి. ఈ భూములకు సంబందిత అధికారులు పకడ్బందీగా రికార్డులను రూపొందింపజేశారు. బాసర సరస్వతీ ఆలయానికి సంబంధించి 156ఎకరాల 09 గుంటలు, విఠలేశ్వర ఆలయానికి సంబంధించి 18ఎకరాల 19 గుంటలు, తానూర్‌ మండలంలోని ఎల్వత్‌ గ్రామంలో గల దత్తాత్రేయ ఆలయానికి సంబంధించిన 22 ఎకరాల 1 గుంట, సోన్‌లోని లక్ష్మీ నర్సింహ ఆలయానికి సంబంధించి లక్ష్మణచాంద, బోరిగాం గ్రామాల్లో గల 44 ఎకరాల 27 గుంటలు, నిర్మల్‌ పట్టణంలోని ఉదాసీమఠంకు సంబంధించిన 2 ఎకరాల 21 గుంటల భూమిని అధికారికంగా గుర్తించడమే కాకుండా వీటికి పకడ్బందీ రికార్డులను కూడా సిద్ధం చేశారు. అయితే ఉదాసీమఠంకు సంబంధించి 14 మంది కోర్టును ఆశ్రయించగా దేవాదాయశాఖ ఈ కోర్టు వివాదాన్ని గెలిచింది. ఇద్దరు మాత్రం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 48 దేవాలయాలకు సంబంధించి భూముల పట్టాలను సిద్ధం చేసి సంబంధిత దేవాదాయశాఖ అధికారులకు అందజేశారు. 


మంత్రి చొరవతోనే..

దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తన సొంత జిల్లాలోని దేవాలయ భూముల పరిరక్షణకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. పలుసార్లు దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపి కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడం, భూములకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నమోదు చేయించుకోవడంతో పాటు అన్‌లైన్‌ విధానం ద్వారా పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు కూడా జారీ అయ్యేట్లు మంత్రి చొరవ తీసుకున్నారు. దీంతో పాటు దేవాలయాల భూముల కబ్జాలకు పాల్పడిన వారికి వంత పాడే వారిపై కఠినచర్యలు సైతం తీసుకుంటామంటూ మంత్రి ఐకేరెడ్డి చేసిన హెచ్చరికలు ఆ భూముల పరిరక్షణపై ప్రభావం చూపాయంటున్నారు. మంత్రి స్వీయ పర్యవేక్షణలో యాక్షన్‌ ప్లాన్‌ అమలవ్వడంతో మొత్తం కబ్జా చెర నుంచి దేవాలయాల భూములకు విముక్తి లభించింది. అలాగే పకడ్బందీ రికార్డులు సైతం రూపొందాయి. ఇక అధికారుల పేరిటనో, అర్చకులు, పాలక మండళ్ల పేరిటనో కాకుండా భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నింటినీ సంబంధిత ఆలయాల దేవుళ్లకే కట్టబెట్టారు. ఈ భూములకు సంబంధించిన పట్టాదార్‌పాస్‌ పుస్తకాలను అక్కడి దేవుళ్ల పేరిటే తయారు చేశారు. దీంతో దేవాలయాల భూములకు సంబంధించిన రికార్డులు ఓ వైపు, స్వాధీనత హక్కు మరోవైపు పకడ్బందీగా రూపొందింపబడ్డాయి. 


ఆలయ భూములను పరిరక్షిస్తాం:రంగు రవికిషన్‌ గౌడ్నిర్మల్‌ డివిజన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ (దేవాదాయ శాఖ) 

జిల్లాలోని దేవాలయ ఆలయ భూముల పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తాం.. ముఖ్యంగా జిల్లాకు చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవతో ఇటీవల బాసర గోదావరి నది ఒడ్డున ఉన్న విఠలేశ్వర ఆలయ భూములను కాపాడగలిగాము జిల్లాలో ఇప్పటి వరకు 48 ఆలయాలకు సంబందిత భూములు సంబంధించిన పట్టాదార్‌పాస్‌ పుస్తకాలను రెవెన్యూశాఖ అధికారులు పట్టా చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతా భూములకు సంబంధించిన పట్టాదార్‌పాస్‌ పుస్తకాలను అందించాలని సంబంధిత రెవెన్యూ అధికారులను కోరడం జరిగిందని వివరించారు.                    

Advertisement
Advertisement