ఇళ్ల మ్యూటేషన్లకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-08-01T05:47:34+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితులు కొన్న ఇళ్ల మ్యూటేషన్లకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

ఇళ్ల మ్యూటేషన్లకు చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితులు కొన్న ఇళ్ల మ్యూటేషన్లకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ రామయ్యతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితులు కొనుగోలు చేసిన ఇళ్ల మ్యూటేషన్లు, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓస్డీ రామయ్య మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల ఇళ్లు మ్యూటేషన్లు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని, ఏయే స్థాయిలో ఉన్నాయని తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, ట్రైనీ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, డీపీవో వీరబుచ్చయ్య, హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ అశోక్‌, హుజూరాబాద్‌ డివిజన్‌ పంచాయతీ అధికారి లత పాల్గొన్నారు. 

నేటి నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రేషన్‌ కార్డులు లేనివారికి కొత్త  కార్డులు మంజూరు చేయడానిక ఆదివారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీడీవోలు, దళితబంధు మండల రీసోర్స్‌ పర్సన్‌లతో హుజూరాబాద్‌లోని దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, మిషన్‌ భగీరథ, ఎలక్ర్టిసిటీ, రెవెన్యూ, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాలనే లక్ష్యంతో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని దళితవాడల్లో మౌళిక వసతుల కల్పన కోసం పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మిషన్‌ భగీరథ, విద్యుత్‌శాఖ అధికారులు సర్వే చేసి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామాల్లోని అన్ని దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సర్వే టీంలు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం 70 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్‌ తెలిపారు. మండల, గ్రామాల రీసోర్స్‌ పర్సన్స్‌ సంబంధితసర్పంచ్‌లతో కలిసి దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు వెంటనే గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రీసోర్స్‌ పర్సన్స్‌ గ్రామాల్లో రేషన్‌కార్డులేని వారందరిని గుర్తించి వెంటనే దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు, వంగిపోయిన విద్యుత్‌ స్తంభాలను సరి చేయడం, కొత్తగా స్తంభాల ఏర్పాటు పనులు త్వరలో చేపడతారని తెలిపారు. ఇంటింటికి మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరాకు సంబంధించి పనులు చేపడతారని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది అన్ని దళితవాడల్లో భూ సమస్యలను గుర్తించి నివేదిక తయారు చేశారని, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్‌ తెలిపారు.  సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, ట్రైనీ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, డీఆర్డీవో శ్రీలత, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T05:47:34+05:30 IST