‘ఉపాధి’లో అక్రమాలు చోటుచేసుకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-12-08T06:46:45+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటే చర్యలు తప్పవని సీఆర్‌డీఈ ప్రత్యేక అధికారి రబ్బానీబాషా హెచ్చరించారు.

‘ఉపాధి’లో అక్రమాలు చోటుచేసుకుంటే చర్యలు
చివ్వెంలలో ఉఫాది హామీ పనులను పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి రబ్బానీ బాషా

 మోతె/చివ్వెంల, డిసెంబరు 7: ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటే చర్యలు తప్పవని సీఆర్‌డీఈ ప్రత్యేక అధికారి రబ్బానీబాషా హెచ్చరించారు. మోతె, చివ్వెంల మండలాల్లోని హుస్సేనాబాద, మోతె, రాంపురంతండాల్లో ఉపాధిహామీ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలోకంటే ప్రస్తుతం ఉపాధి పనులకు కూలీల హాజరు శాతం రెండింతలు పెరిగిందన్నారు. పని ప్రదేశాల వద్ద కార్యదర్శులు లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మూడు గ్రామాల్లో అధిక నిధుల వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన పనులు, రికార్డులను ఆయన పరిశీలించారు. చేపల చెరువుల తవ్వకాలు, భూముల అభివృద్ధి, నర్సరీలను పరిశీలించి, బిల్లులు చెల్లింపులపై ఆరా తీశారు. అనంతరం కేశవాపురం వెళ్లే రోడ్డు వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం చివ్వెంల మండల కేంద్రంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణాలను, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సూర్యాపేట, కోదాడ ఏపీడీలు రాజు, పెంటయ్య, ఎంపీడీవోలు లక్ష్మి, శంకర్‌రెడ్డి, ఎంపీవోలు గోపి, హరిసింగ్‌నాయక్‌, ఏపీవో నాగయ్య, సర్పంచ్‌ జూలకంటి సుధాకర్‌రెడ్డి, ఉన్నారు. 

Updated Date - 2021-12-08T06:46:45+05:30 IST