గుర్తింపు లేదా మూతే..

ABN , First Publish Date - 2020-08-12T11:07:04+05:30 IST

గడువులోగా సరిదిద్దుకోకపోతే సీజ్‌ ప్రతీ ఏటా సర్వే నిర్వహిస్తున్నట్టే ఈ ఏడాదీ అనధికారిక పాఠశాలలను గుర్తించడానికి ..

గుర్తింపు లేదా మూతే..

 అనధికారిక పాఠశాలల ఏరివేతపై విద్యా శాఖ దృష్టి 

  ఒకే రిజిస్ర్టేషన్‌తో పలు పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు 

 ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోతే కొరడా 


కరోనా వల్ల నేటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. వచ్చే నెల తెరుస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా స్పష్టత లేదు. తెరుస్తారా, తెరవరా అనేది కొవిడ్‌ తగ్గుముఖంపై ఆధారపడి ఉంది. ఇటుచూస్తే అన్ని యాజమాన్య పాఠశాలల్లో అడ్మిషన్లు మందకొడిగా సాగుతున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు కాస్త ఊపందుకుంటున్నాయు. వెంట విద్యార్థులను తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం వెళుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలను ఏరివేయాలని ప్రభుత్వం నుంచి డీఈవో కార్యాలయానికి ఆదేశాలందినట్టు సమాచారం. దీంతో ఎంఈవోలు రంగంలోకి దిగారు. 


 (కాకినాడ-ఆంధ్రజ్యోతి): గడువులోగా సరిదిద్దుకోకపోతే సీజ్‌ ప్రతీ ఏటా సర్వే నిర్వహిస్తున్నట్టే ఈ ఏడాదీ అనధికారిక పాఠశాలలను గుర్తించడానికి విద్యాశాఖాధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో చేసిన సర్వే వేరని, ఈసారి పక్కా లెక్కలతో ఎన్ని ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలున్నాయో, వాటన్నింటిని మూయించాలని ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది నుంచి అమలవుతున్న ‘నాడు-నేడు’ పథకంలో ప్రభుత్వ బడులన్నీ ఆధునికీకరి స్తున్నందున హెచ్చు శాతం విద్యార్థుల అడ్మిషన్లు ఉండాలని లక్ష్యంగా నిర్ధేశించారు. అలాగే విద్యా దీవెన పేద విద్యార్థులందరికీ అందాలని ప్రభుత్వం భావించి ఎటువంటి అనుమతులు లేని ప్రైవేట్‌ పాఠశాలలపై కొరఢా ఝుళిపించాలని హుకుం జారీచేసింది. ఇదే సమయంలో ఒకే రిజిస్ర్టేషన్‌తో పలు పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోతే, సరిద్దుకోడానికి గడువు ఇవ్వాలని లేని పక్షంలో సీజ్‌ చేయాలని ఆదేశించింది.


ఈ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గద్దని విద్యాశాఖాధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చింది.  జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు గత ఏడాది 800 పైనే ఉన్నాయని, వాటిని వెంటనే మూసేయాలని, లేదా రిజిస్ర్టేషన్‌కు దరఖాస్తు చేయాలని విద్యాశాఖ ఆదేశాలి చ్చింది. సదరు ప్రైవేట్‌ పాఠశాలలు అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే కొనసాగుతుండ డంతో ఆయా ప్రాంతాల్లో ఈ శాఖ దృష్టి సారించింది. దీంతో గత ఏడాది 219 పాఠశాలల యాజమాన్యాలు ఎల్‌కేజీ నుంచి 5 వరకు రిజిస్ర్టేషన్‌కు దరఖాస్తు చేశారు. కొన్ని స్కూళ్లల్లో 5 వరకు రిజిస్ర్టేషన్‌ ఉండగా, 6,7 తరగతుల విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇలా చేర్చుకున్న విద్యార్థులకు ఇదే స్కూళ్లల్లో పాఠాలు చెప్పి పరీక్షల సమయానికి 6,7 అనుమతులున్న స్కూళ్ల నుంచి పరీక్ష రాయిస్తూ విద్యా శాఖ కళ్లుగప్పుతున్నారు. గుర్తింపు లేని పాఠశా లల యాజమాన్యాలకు విద్యాశాఖ కూడా నోటీసులతో సరిపెడుతోంది. కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో అనధికార ప్రైవేట్‌ పాఠశాలలు ఏటా పెరుగుతున్నాయి.


జిల్లాలో 201 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదని విద్యాశాఖ చెబుతోంది. కానీ జిల్లాలో ఏ మండలంలో చూసినా వీధికి రెండేసి చొప్పున అనధికార పాఠశాలలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రం గా పరిగణించిందని అధికారులు చెబుతున్నారు. అలాగే రిజిస్ర్టేషన్‌ లేకుండా విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్న యాజమాన్యాలపై కొరఢా ఝుళిపించాలని హుకుం జారీ చేసింది. ఒకే రిజిస్ర్టేషన్‌తో పలుచోట్ల పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో  జిల్లావ్యాప్తంగా ఎంఈవోలు తనిఖీలు ప్రారంభించారు. రిజిస్టర్డ్‌ పాఠశా లల్లో మౌలిక వసతులు లేకపోతే నోటీసులు జారీ చేస్తున్నారు. 


జీవో ఎమ్‌ఎస్‌ నెంబరు 1కు తూట్లు 

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల యాజమాన్యాలు జీవో ఎమ్‌ఎస్‌ నెంబరు 1లో సూచించిన నిబంధనలను ఖాతరు చేయడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వసతుల కల్పన విషయంలో అధికా రులను మేనేజ్‌ చేస్తూ తూతూమంత్రంగా వ్యవహారం కానిచ్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుర్తింపు కలిగిన ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధలను అమలయ్యేలా చర్యలు తీసుకుంటే అడ్మిషన్లు తగ్గి, ప్రభు త్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడానికి మార్గం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యాశాఖకు సంబంధించి కాకినాడ, రాజమ హేంద్రవరం, అమలాపురం, రామచంద్రాపురం, పిఠాపురం డివిజన్‌లుగా ఉన్నాయి.


రాజమహేంద్రవరం డివిజన్‌లో 224, కాకినాడ డివిజన్‌లో 196, అమలాపురం డివిజన్‌లో 170, రామచంద్రాపురం డివిజన్‌లో 126, పిఠాపురం డివిజన్‌లో 90. మొత్తం 706 పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి పాఠశాల రికగ్నైజ్డ్‌ చేయాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. అన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉన్నాయి. నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి రికగ్నైజేషన్‌ పొందాలంటే ఒక్కో పాఠశాల కనీసంగా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-08-12T11:07:04+05:30 IST