ఆక్సిజన కొరత లేకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-05-11T05:41:28+05:30 IST

జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడులు అన్నారు.

ఆక్సిజన కొరత లేకుండా చర్యలు
తూముకుంటలో ఆక్సిజన ప్లాంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎంపీ

-ఎంపీ మాధవ్‌, కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడి

హిందూపురం టౌన, మే 10: జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడులు అన్నారు. సోమవారం తూముకుంట పారిశ్రామికవాడలోని వేదిక్‌ ఇస్పాట్‌ ఆక్సిజన ప్లాంట్‌ను తనిఖీ చేశారు. అదేవిధంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన ప్లాంట్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 40వేల లీటర్ల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రి, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో 13వేల లీటర్ల చొప్పున, క్యాన్సర్‌ ఆసుపత్రి, హిందూపురం ఆసుపత్రిలో 6వేల చొప్పున, కదిరి, గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో వెయ్యిలీటర్ల చొప్పున ఆక్సిజన ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా మొత్తానికి 336 సిలెండర్లు ఉన్నాయని పరిశ్రమలో వేరే అవసరాలకు ఉపయోగించే మరో 700 సిలెండర్లు తీసుకోవడం జరిగిందన్నారు. తూముకుంట వద్ద ఉత్పత్తి అయ్యే ఆక్సిజన, హిందూపురం, ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులకు వినియోగించుకుని మిగిలితే ఇతర జిల్లాలకు పంపుతామన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆక్సిజన కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాక ఇందులో అవకతవకలు జరగకుండా ఆక్సిజన ఉత్పత్తి ఎంత అవుతుందో, ఎంత ధరకు అమ్ముతున్నారో ఎన్ని సిలెండర్లు బయటికి వెళ్తుందో రోజువారి పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఎంపీ మాధవ్‌ చొరవతో తూముకుంటలోని ఆక్సిజన ప్లాంట్‌లను పునఃప్రారంభించామని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ వైద్యం అందక ఏ ఒక్కరూ మరణించకూడదని ప్రతి ఒక్కరికీ ఆక్సిజన అవసరమని దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి, పరిశ్రమలశాఖ జీఎం అజయ్‌కుమార్‌, నోడల్‌ అధికారి ప్రసన్నకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, వేదిక ఇస్పాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఎండీ శరతబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:41:28+05:30 IST