Abn logo
Jun 14 2021 @ 00:00AM

బాసర సెజ్‌ దిశగా కార్యాచరణ

బాసర సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ అక్రమణలో ఉన్న ముంపు భూములను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ , అప్పటి జెసీ భాస్కర్‌ రావు, ఇరిగేషన్‌ అధికారులు ( ఫైల్‌ )

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌గా నిర్మల్‌ జిల్లాకు అవకాశం 

ఇప్పటికే బాసరలో 650 ఎకరాల సర్కారు స్థలం గుర్తింపు 

పుష్కలంగా ఆహార పంటలసాగు 

అందుబాటులో రోడ్డు, రైలుమార్గంతో పాటు నీటి సౌకర్యం 

టీఎస్‌ఐఐసీ నేతృత్వంలో కార్యాచరణ 

నిర్మల్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : గత కొంతకాలం నుంచి నిర్మల్‌ జిల్లాలోని బాసర ప్రాంతంలో సెజ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌) ఏర్పాటు చేయాలన్న యోచన కార్యరూపం దాల్చబోతోంది. బాసరలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ పరిధిలో వృధాగా ఉన్న ఆక్రమిత భూములను లక్ష్యంగా చేసుకొని సెజ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే రూపొందాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడి ఆక్రమణకు గురైన దాదాపు 2 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఇందులో నుంచి సెజ్‌ కోసం 650 ఎకరాలను కేటాయించేందుకు సిద్దం గా ఉన్నట్లు సర్కారుకు ప్రతిపాదించింది. సెజ్‌ ప్రతిపాదనలు సర్కారు పరిశీలనలో ఉన్న నేపథ్యంలోనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ల ఏర్పాటు ప్రక్రియను సర్కారు ప్రారంభించింది. దీంతో ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లు సెజ్‌ పరిధిలోకి చేరబోతున్నాయి. ప్రస్తుతం 650 ఎకరాలకు పైగా సర్కారు స్థలం అందుబాటులో ఉన్న కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కలగనుంది. ప్రభుత్వం తెలంగాణ స్పెషల్‌ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ( టీఎస్‌ఎఫ్‌పీజడ్‌) లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోనుంది. దీని కోసం గాను రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలను ప్రభుత్వం కేంద్రంగా చేసుకోబోతోంది. ప్రభుత్వం ఈ జోన్‌లలో ఆహారశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయిలో రంగంసిద్దం చేసింది. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించే చర్యను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీలోగా తెలంగాణ స్టేట్‌ ఇండస్ర్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆసక్తి గల వారంతా దరఖాస్తులు చేసుకునేందుకు సర్కారు నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. కాగా ప్రభుత్వం 250 ఎకరాల స్థలాన్ని ఈ ఆహారశుద్ది జోన్‌ల కోసం అందుబాటులోకి తేవాలంటూ జిల్లా యంత్రాంగాలను కోరింది. కాగా ప్రస్తుతం జిల్లాలోని బాసరలో 650 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్ల కోసం రైతులు పండించే పంటలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. కాగా ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లలో యూనిట్లను ఏర్పాటు చేసే ఔత్సాహికులకు ప్రభుత్వం అన్ని రకాల ప్రొత్సాహకాలను అందించనుంది. దీనికి సంబందించి ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను కూడా రూపొందించారు. టీఎస్‌ఐఐసీ  ఆధ్వర్యంలో ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం బాసరలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ భూములు పూర్తిస్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే టీఎస్‌ఐఐసీ బాసర ప్రాంతంలో చేపట్టదల్చిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల అంశంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివరిస్తోంది. బాసర ప్రాంతానికి ప్రత్యేకంగా రైలుమార్గంతో పాటు రోడ్డుమార్గం కలిగి ఉంది. అలాగే జాతీయ రహదారులు సైతం బాసరకు సమీపంలోనే ఉన్నాయి. సరిహద్దులో మహారాష్ట్ర ప్రాంతమే కాకుండా ఆహరపంటలను ఎక్కువగా సాగు చేసే నిజామాబాద్‌ జిల్లా కూడా ఉండడంతో స్పెషల్‌జోన్‌ ఏర్పాటుకు అనుకూలంగా మారనుందంటున్నారు. 

ఆహారశుద్ధి పరిశ్రమలకు అనుకూలం

నిర్మల్‌ జిల్లా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనదిగా పేర్కొంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో ఆహార సంబంధిత పంటలు పుష్కలంగా సాగవుతున్నాయి. పసుపుతో పటు సోయాబిన్‌, మొక్కజొన్న, వరిపంటలు అలాగే పప్పు దినుసులు, పెద్దఎత్తున సాగవుతుండడమే కాకుండా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు వస్తున్నాయి. అయితే ఈ పంటలను ఇతర ప్రాంతాలకు తరలించడం, అలాగే మార్కెటింగ్‌ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం సమస్యగా మారింది. ప్రతీయేటా పెద్దఎత్తున ఆహార పంటలు సాగవుతున్నప్పటికీ పై కారణాల వల్ల ఆ పంటలను సాగుచేసే రైతులకు గిట్టుబాటు కావడం లేదు. బాసరలో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తే స్థానికంగానే రవాణా, మార్కెటింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడమే కాకుండా వారు ఆహార పంటలను మరింత ఎక్కువగా సాగుచేసే అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. 

పుష్కలమైన వనరులు

కాగా బాసర ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుకు పుష్కలమైన వనరులు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. బాసర ప్రాంతంలో ప్రభుత్వం అన్యాక్రాంతమైన 2వేల ఎకరాల స్థలాన్ని గుర్తించడమే కాకుండా 650 ఎకరాల స్థలాన్ని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ కోసం కేటాయించింది. ప్రభుత్వస్థలం పెద్దమొత్తంలో అందుబాటులో ఉన్న కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పడబోవంటున్నారు. వాస్తవానికి ఆహారశుద్ది కార్మాగారాల ఏర్పాటుకు 250 ఎకరాల స్థలం మాత్రమే అవసరం కానుండగా జిల్లాలో 650 ఎకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.  పెద్దమొత్తంలో సర్కారుస్థలం అందుబాటులో ఉన్న కారణంగా స్థలసేకరణ సమస్య ఎదురుకాబోదంటున్నారు. ప్రస్తుతం బాసరలో 650 ఎకరాల స్థలం అందుబాటు లో ఉన్న కారణంగా ఎలాంటి అవరోధాలు ఉడవన్న ధీమాలో అధికారులు ఉన్నారు. దీంతో పాటు భూగర్బజలాలు, రోడ్డు సౌకర్యం, రైలుమార్గం, ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీ అందుబాటులో ఉన్న కారణంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు మార్గం సుగమం కానుందంటున్నారు.  

జిల్లా కలెక్టర్‌ దూరదృష్టితో..

బాసర ప్రాంతంలోని ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ భూముల ఆక్రమణల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ చాకచక్యంగా వెలుగులోకి తెచ్చా రు. గతంలోనే ప్రభుత్వం రైతుల నుంచి ఈ భూములను సేకరించడమే కాకుం డా దీనికి సంబందించి రైతులకు పరిహారం కూడా చెల్లించింది. అయితే ఈ భూములకు సంబందించిన రికార్డులు సంబంధిత శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం ఆక్రమణదారులకు వరంగా మారింది. రికార్డులు తారుమారు చేసిన కబ్జాదారులు ఈ భూములను స్వాధీనం చేసుకొని క్రయ విక్రయాలు జరపడం, వ్యవసాయం సాగుచేయడం లాంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ పూర్తిస్థాయిలో విచారణ జరిపి క్షేత్రస్థాయిలో ఆక్రమణలు వెలుగులోకి తెచ్చారు. అధికారులతో సర్వేలు జరిపించి 2వేల ఎకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఈ భూములన్నింటిని స్వాధీ నం చేసుకున్నారు. అయితే ఈ భూముల్లోని కొంత భాగానైనా సద్వినియోగం లోకి తేవాలన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్‌ సెజ్‌ ఏర్పాటును తెరపైకి తెచ్చారు. ఇక్కడి ప్రాంతమంతా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా అనుకూలంగా ఉందం టూ కలెక్టర్‌ సర్కారుకు నివేదికలు పంపారు. దీనిపై టీఎస్‌ఐఐసీ లోతుగా పరిశీలన జరిపి పరిశ్రమల ఏర్పాటుకు ఈ స్థలం అనుకూలమైనదిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ అంశం ప్రస్తుతం జిల్లాలోని బాసర ప్రాంతానికి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. జిల్లా కలెక్టర్‌ సైతం నిర్మల్‌ జిల్లాలోనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలంటూ సర్కారుకు నివేదిస్తున్నారు.