Jun 14 2021 @ 18:18PM

భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సినీ నటుడు అరెస్ట్‌

కోలీవుడ్‌: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సినీనటుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని విరుగంబాక్కంలో వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, విరుగంబాక్కం సుబ్రహ్మణ్య వీధికి చెందిన తంగదురై సహాయ నటుడుగా పని చేస్తున్నారు. ఆయన భార్య పేరు జయలక్ష్మి (41). భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు వస్తుండేవి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయలక్ష్మి ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే, ఆమె మృతిపై అనుమానం ఉందని పేర్కొంటూ ఆమె బంధువులు విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ఫరాఖ్‌తుల్లా కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో జయలక్ష్మి ఫోనులో ఉన్న ఒక ఆడియో కీలక ఆధారంగా మారింది. తన భర్తకు అనేక మంది మహిళలతో సంబంధం ఉందని, వారి ద్వారా మీరు చనిపోవచ్చు అంటూ పదేపదే వేధిస్తూ వచ్చారని, అందుకే తాను బలవన్మరణానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. దీంతో తంగదురైను పోలీసులు అరెస్టు చేశారు.