May 1 2021 @ 19:53PM

ఆ గిరిబాబు పెళ్లి చేసుకుంటే.. నేననుకుని ఏడుపులు, పెడబొబ్బలు: గిరిబాబు (పార్ట్‌ 5)

సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్‌, బాపు, జంధ్యాల .. ఇలా ప్రతి ఒక్క దర్శకునితో పనిచేసే అవకాశం నాకు లభించింది. మరో సీనియర్‌ డైరెక్టర్‌ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ సినిమా చేశాను. అందులో దుశ్శాసునుడి వేషం నాది. నేను మిస్‌ అయిన డైరెక్టర్‌ ఎన్టీఆర్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో అర్జునుడి వేషం నేనే వెయ్యాలి. అప్పటికే ‘కురుక్షేత్రం’ సినిమా కమిట్‌ కావడంతో, డేట్స్‌ అడ్జెస్ట్‌ అవక నటించలేదు.. అంటూ గిరిబాబు పార్ట్ 4లో తెలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన మాటల్లోనే.. 


అంతకుముందు విజయనిర్మలగారి దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. ‘కవిత’ సినిమా షూటింగ్‌లో గొడవ జరిగినప్పటికీ ఆ తర్వాత కృష్ణగారు, నేను, విజయనిర్మల గారు చాలా క్లోజ్‌ అయ్యాం. ఇక అప్పటి నుంచి పద్మాలయా స్టూడియో ఏ చిత్రం నిర్మించినా అందులో నాకూ వేషం తప్పకుండా ఉండేది. అంతే కాదు కృష్ణగారు బయటి చిత్రాల్లో నటిస్తున్నప్పుడు కూడా కథాచర్చల సమయంలోనే ఫలానా పాత్ర గిరిబాబుతో వేయిద్దాం అని ఆయన ముందే చెప్పేవారు. అలాగే విజయనిర్మలగారి సారథ్యంలో విజయ కృష్ణా మూవీస్‌ సంస్థ ఏ సినిమా తీసినా నాకో వేషం ఇచ్చేవారు. విలన్‌ పాత్రలే కాదు ఆ సంస్థలు తీసిన కొన్ని చిత్రాల్లో పాజిటివ్‌ పాత్రలూ చేశాను.

జయంతితో తొలి పరిచయం 

విజయనిర్మలగారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రౌడీరంగమ్మ’ చిత్రంలో నేను ఓ వేషం వేశాను. నాకు భార్యగా జయంతిగారు నటించారు. నేను పరిశ్రమలోకి రాకముందే అభిమానించిన కథానాయికల్లో ఆమె ఒకరు. అంజలీదేవిగారు, సావిత్రిగారు, జమునగారు, కృష్ణకుమారిగారు తర్వాత వచ్చిన వాళ్లు విజయనిర్మలగారు, వాణిశ్రీగారు, జయంతిగారు, భారతి, చంద్రకళ ఇత్యాదులు. అందుకే వీళ్లందరూ నా కంటే సీనియర్స్‌ అనే భావనతో వాళ్లతో నటించేటప్పడు కొంచెం బిడియంగా ఉండేవాడిని. అదీగాక స్వతహాగా చొచ్చుకునిపోయే స్వభావం కాదునాది. స్పీడ్‌గా ఎప్రోచ్‌ అయి పరిచయాలు చేసుకొనే అలవాటు నాకు లేదు. ఈ కారణంగానే నేను జయంతిగారితో సెట్లో ముభావంగా ఉండేవాడిని. కల్పించుకుని ఆవిడతో మాట్లాడేవాణ్ణి కాదు.

 

అయితే ఆవిడ చాలా కలుపుగోలు మనిషి.. సెట్లో అందరితో జోక్స్‌ వేస్తూ చాలా సరదాగా ఉండేది. రౌడీ రంగమ్మ షూటింగ్‌ స్పాట్‌లో విజయనిర్మలగారు, చంద్రమోహన్‌, నాగభూషణం.. వీళ్లందరిని నవ్విస్తూ, తను నవ్వుతూ చాలా హడావిడి చేసేది. నేను అంటీ అంటనట్లుగా ఉండటంతో నా జోలికి వచ్చేది కాదు. నేను కూడా ఆమె పెద్ద నటి కదా అనే భావంతో దూరంగా ఉండేవాడిని. సీన్‌లో మాత్రం భార్యాభర్తలం కనుక చాలా సన్నిహితంగా నటించేవాళ్లం. షాట్‌ అయిన తర్వాత ఎవరి దారి వాళ్లదే.

 

ఈ సినిమా షూటింగ్‌లోనే విజయనిర్మలగారు మా ఇద్దరి మీద ఒక లాంగ్‌ షాట్‌ పెట్టారు. ఇద్దరు కలిసి కార్లో వచ్చే షాట్‌ అది. నేను డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చుని ఉంటే, నా పక్క సీట్లో జయంతి. దూరంగా కెమెరా పెట్టారు. సాధారణంగా ఇలాంటి షాట్స్‌లో టైమ్‌పాస్‌ కోసం పక్కనున్న ఆర్టిస్ట్‌తో మాట్లాడటం సహజం.. కానీ మా ఇద్దరి మధ్య మాటలు లేవు. నేను మౌనంగా ఉన్నాను. ఆమె కూడా మౌనంగా ఉంది. ఆమె ఏమన్నా మాట్లాడితే మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆమెతో మాట కలిపే ధైర్యం మాత్రం చేయలేకపోయాను. నా మౌనాన్ని జయంతిగారు మరోలా అర్థం చేసుకున్నారట. ‘కొత్తగా వచ్చిన ఈ కుర్రాడికి ఎంత పొగరు! పక్కనే ఉన్న సీనియర్‌ ఆర్టిస్ట్‌ని పలకరించడేం’ అని. ఆమె అలా అనుకున్నట్లు నాకు తెలీదు. మొత్తానికి మేమిద్దరం ఏం మాట్లాడుకోకుండానే ‘రౌడీ రంగమ్మ’ షూటింగ్‌ పూర్తయింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘కమలమ్మ కమతం’ చిత్రంలో మళ్లీ మేమిద్గరం కలసి నటించాల్సి వచ్చింది. కృష్ణంరాజు హీరో. జయంతిది లీడ్‌ రోల్‌. విజయవాడ దగ్గరున్న పునాదిపాడులో షూటింగ్‌ జరిగింది. ఎలాగైతేనేం ఆ చిత్రం షూటింగ్‌లో మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పరిచయాలు పెరిగాయి.

జయంతితో పెళ్లి?!

ఇది జరగడానికి ముందు జయంతిగారు ‘చందన’ సినిమాలో కథానాయికగా నటించారు. గిరిబాబుగారు దానికి నిర్మాత, దర్శకుడు. రాజమండ్రిలో థియేటర్‌ ఓనర్‌. సినిమా తీయాలనే ఆసక్తితో ఆయన మద్రాసు వచ్చారు. ‘చందన’ నిర్మాణసమయంలోనే గిరిబాబు, జయంతి మనసులు కలిసి, పెళ్లి చేసుకున్నారు. ఆ సినిమాతోనే హీరోగా రంగనాథ్‌ పరిచయమయ్యారు. ఆ గిరిబాబు, జయంతి పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నట్లు వారి పెళ్లితో నాకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆ గిరిబాబు ఎవరో చాలా మందికి తెలియక పోవడం వల్ల నేనే జయంతిని రెండో వివాహం చేసుకున్నాననే ప్రచారం మొదలైంది. ‘చందన’ సినిమాని నేనే తీశాననీ, అందులో హీరోయిన్‌ జయంతి మీద మనసు పడి ఆమెని పెళ్లి చేసుకున్నాననీ నమ్మేసిన జనం దాని గురించి కథలుకథలుగా చెప్పుకొనేవారు. గిరిబాబు పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనే విషయం పరిశ్రమలో చాలా మందికి తెలుసు కనుక అక్కడ ఇబ్బంది ఏమీ రాలేదుకానీ బయటి జనం మాత్రం ఇదే అభిప్రాయంలో ఉన్నారు.

 

ఔట్‌డోర్స్‌కి ఎక్కడికి వెళ్లినా ‘రంగనాథ్‌ వంటి మంచి ఆర్టిస్ట్‌ను పరిచయం చేశారు సార్‌’ అని కొందరు, జయంతిగారు ఎలా ఉన్నారని మరికొందరు అడిగేవారు. ‘ఆ గిరిబాబు వేరయ్యా.. నేను కాదు’ అని వాళ్లకి వివరంగా చెప్పేవాడిని. కొంతమంది నమ్మారు, మరి కొందరు నమ్మలేదు. సినిమారంగంలో ప్రేమలు, పెళ్లిళ్లు సహజమే కనుక నన్ను కూడా ఆ బాపతులో జమ వేసేశారు జనం. ఈ వార్త ఎంతదూరం వెళ్లిందంటే మా ఊళ్లో కూడా జయంతిని నేను పెళ్లి చేసుకున్నానని మా వాళ్లంతా నమ్మేశారు. ఊళ్లో నలుగురు కలిస్తే ఇదే చర్చ. ‘గిరిబాబు ఆర్టిస్ట్‌ కావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నష్టాలు భరించాడు. అదృష్టం కలిసి అవకాశాలు రావడంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. నిర్మాతగా మారి సినిమాలు కూడా తీస్తున్నాడు. ఇప్పుడు ఇదేం పాడుబుద్ధి? ఇంతకాలం తన కష్టసుఖాల్లో భాగం పంచుకొన్న భార్యని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడట.. మనిషి ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తాడు. ఆ సినిమా వాతావరణం అంతేనమ్మా.. మంచివాడు కూడా పక్కదారి పడతాడు. అలాగే ఇతను కూడా.. పాపం ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇక వాళ్ల పరిస్థితి ఏమిటో.. భార్య ఎన్ని కష్టాలు పడింది. ఆ కష్టాలు గట్టెక్కాయని అనుకుంటున్న తరుణంలో ఇలా చేయడం ఏమన్నా బాగుందా?’ అని బాధపడిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే నా ఎదుగుదలని సహించలేని వాళ్లు కూడా ఉంటారు కదా. వాళ్లు మాత్రం ఈ వార్త విని; చాలా ఆనందించారు. నలుగురైదుగురు స్నేహితులకు తప్ప అసలు విషయం మిగతా వాళ్లకి తెలీదు. అలాగే మా ఆవిడకు మాత్రం అన్ని విషయాలు తెలుసు. బయటి జనం అనుకొనే మాటలు ఆమెతో చెబితే తను నవ్వుకునేది.

ఈ వివాదం ఇలా జరుగుతున్న సమయంలోనే పరిశ్రమలో స్ట్రయిక్‌ వచ్చింది. షూటింగ్స్‌ లేవు. ఆర్టిస్టులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సమ్మె ఎంతకాలం జరుగుతుందో, ఎప్పుడు ముగిస్తుందో ఎవరికీ తెలియడంలేదు! అందుకే తనని, పిల్లల్ని తీసుకుని మా ఊరు వెళ్లాను. అదే నేను చేసిన పొరపాటు అని అక్కడికి వెళ్ళాక గానీ తెలియలేదు. మేం వెళ్లేటప్పటికి మా ఆవిడ అక్కలు, బావలు, ఇతర బంధువర్గం అంతా కట్ట కట్టుకుని మా ఊరు వచ్చేశారు. అంతా ఒక చోట చేరి ‘మా అమ్మాయి జీవితం నాశనం అయి పోయింది’ అంటూ ఏడుపులు, రాగాలు మొదలు పెట్టారు. ఒక గాలివార్త ఊళ్ళో ఇంతగా ప్రభావం చూపిస్తోందనీ, చివరికి అది కుటుంబ సమస్యగా పరిణమిస్తుందని నేను ఊహించలేదు. మేం వచ్చామని తెలియగానే పక్క ఊళ్లో ఉన్న బంధువులు కూడా వచ్చేశారు. మా ఆవిణ్ణి దగ్గరకు తీసుకుని పరామర్శించడం మొదలుపెట్టారు. జరుగుతున్న వ్యవహారం ఏమిటో మా ఆవిడకి మొదట అర్థం కాలేదు. వాళ్లు వివరించి చెప్పాక ‘ఓసి మీ దుంపలు తెగ.. ఆ గిరిబాబు ఈయన కాదే.. జయంతిని పెళ్లి చేసుకున్నది వేరే గిరిబాబు’ అని వారందరికి ఆమె విడమరిచి చెప్పే ప్రయత్నం చేసింది కానీ వాళ్లు వింటేగా.. ‘నిన్ను మాయ చేశాడు.. మత్తు పెట్డాడు. మాతో ఇలా చెప్పమని నిన్ను హింస పెట్టి ఉంటాడు, ఇక ఎలా బతుకుతావే తల్లీ’ అని ఒకటే ఏడుపులు, పెడబొబ్బలు. ఎంత విడమరిచి చెప్పినా వాళ్లు నమ్మడం లేదు. చివరికి నేను రంగంలోకి దిగి అసలు విషయం ఏమిటో చెప్పాలని ప్రయత్నించాను. కానీ నా మాట అసలు నమ్మలేదు వాళ్లు.  

 

‘నువ్వు సినిమా నటుడివి కదా. తెర మీదే కాదు ఇక్కడ కూడా బాగా నటిస్తున్నావు’ అన్నారు వ్యంగ్యంగా. వాళ్లకి అర్థమయ్యేట్లు ఎలా చెప్పాలో నాకు తోచలేదు. పది రోజులు ఇలా పరామర్శలతోనే కాలం గడించింది. ఇంతలో స్ట్రయిక్‌ కాలాఫ్‌ అయింది. మళ్లీ షూటింగ్స్‌ మొదలయ్యాయని కబురు వచ్చింది. ‘ముందు నేను వెళతాను. వీలు చూసుకుని ఒకటిరెండు రోజుల్లో మీరు బయలుదేరి రండి’ అని మా ఆవిడతో చెప్పాను. తను సరేనంది. తనని, పిల్లల్ని అక్కడ వదిలెయ్యడం చూసి మా బంధువులు మరోలా అర్థం చేసుకున్నారు. ‘మనం ఏమి కాకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఆవిడను, పిల్లల్ని ఇక్కడ వదిలేసి తను వెళ్లిపోతున్నాడు ఇక నిన్ను మద్రాసుకి తీసుకెళ్లే ఉద్దేశం అతనికి లేదు. నా తల్లీ ఎంత కష్టం వచ్చిందే నీకు’ అని మళ్లీ ఏడుపులు. చుట్టాలే కాదు మా అమ్మా, నాన్న కూడా ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. భవిష్యత్‌ కార్యాచరణని నిర్ణయించే పనిలో పడ్డారు. నేను మద్రాసు వచ్చేసిన రెండు రోజులకు మా ఆవిడ కూడా మద్రాసు బయలుదేరడానికి సిద్ధమైంది కానీ వాళ్లెవరూ ఒప్పుకోలేదు. ‘మా బాధ చూడలేక నువ్వు అక్కడికి వెళతానని అంటున్నావు కానీ ఆ బాధలు నువ్వు పడలేవే తల్లీ.. దాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెడతాడు, నీతో సేవలు చేయిస్తాడు. నిన్ను, నీ పిల్లల్ని హింసిస్తాడు. వద్దమ్మా, నువ్వు వెళ్లనేవద్దు’ అని ఆపేశారు.

 

‘అదేం కాదు. మా ఆయన సంగతి మీకు తెలీదు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. నేను మద్రాసు వెళ్లి తీరాల్సిందే’ అని మా ఆవిడ మొండిపట్టు పట్టడంతో అంతా ఆలోచించు కుని ఒక్కదాన్నే పంపించకుండా మా మూడో వదిన భర్త, నా తోడల్లుడు చిగురుపాటి శేషయ్యని తోడు ఇచ్చి పంపించారు. మద్రాసులో జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు తమకు చెప్పాలని మా శేషయ్యకి చెప్పారట. ఇంటికి వచ్చిన తర్వాత ఊళ్లో జరిగిన విషయమంతా చెప్పి మా ఆవిడ ఒకటే నవ్వు. ‘నేను ఎంత చెప్పినా వాళ్లు నమ్మడం లేదు. అందుకే ఇక్కడ మీరేం చేస్తున్నారో కనిపెట్టడానికి ఒక గూఢచారిని కూడా పంపించారు. అసలు విషయమేమిటో తొందరగా తెలిస్తే మా వాళ్లకు మనశ్శాంతిగా ఉంటుంది. మనకూ ఒక తలనొప్పి వదులుతుంది’ అందామె. సరేనని నేను షూటింగ్స్‌ వెళుతూ మా తోడల్లుడిని కూడా వెంట తీసుకెళ్లేవాడిని. షూటింగ్‌ బిజీలో నేను ఉంటే ఆయన మెల్లిగా మిగతా వాళ్ల దగ్గర నా గురించి, జయంతి గురించి ఎంక్వయిరీ చేసేవాడు. ‘జయంతిని గిరిబాబు పెళ్లి చేసుకున్నాడట. నిజమేనా’ అని ఈయన అడిగితే, ‘అవునండి నిజమే అయితే ఈ గిరిబాబు కాదు, ఆయన వేరే’ అని చెప్పేవాళ్లు. అలా వారం రోజుల పాటు ఎంతో మందిని అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు శేషయ్య. ఇంట్లో కూడా నేను పిల్లలతో, మా ఆవిడతో ఎంతో ప్రేమగా ఉండటం గమనించాడు. చివరికి ‘ఆ గిరిబాబు వేరు, ఈ గిరిబాబు వేరు..’ అని నిర్థారించుకుని అప్పుడు మనశ్శాంతిగా ఊరికి వెళ్లాడు. . ఈ విషయం తెలుసుకుని ఊళ్లో వాళ్లు కూడా ఎంతో ఆనందించారు. అక్కడ ఆ కథకి దాంతో శుభం కార్డ్‌ పడింది.  

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...