‘‘25 కుట్లు... ఆ ప్రమాదం తరువాత మళ్లీ నేను మునుపటిలా కనిపిస్తాననుకోలేదు!’’

‘‘నేను మళ్లీ మునుపటిలా కనిపిస్తానని అస్సలు అనుకోలేదు’’ అంటున్నాడు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. అందుక్కారణం, ఆయన పెదవిపై చోటు చేసుకున్న తీవ్రమైన గాయమే. డాక్టర్లు ఏకంగా 25 కుట్లు వేయాల్సి వచ్చిందట! ఇంతకీ, ఆయన పెదవి పగిలిపోయి తీవ్రమైన రక్తస్రావం జరిగింది ఏ సినిమా షూటింగ్‌లోనో తెలుసా? ‘జెర్సీ’...


షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ‘జెర్సీ’ చిత్రం మన తెలుగు ‘జెర్సీ’కి రీమేకే. ఇక్కడ నాని చేసిన పాత్రలో హిందీ తెరపై షాహిద్ కనిపించనున్నాడు. అయితే, నాని అద్భుతంగా నటించాడని మెచ్చుకున్న బీ-టౌన్ స్టార్ మొదట్లో ‘జెర్సీ’ రీమేక్ మాత్రం చేయవద్దని అనుకున్నాడట. ఇంతకు ముందు విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన షాహిద్ వెంటనే మరో తెలుగు రీమేక్‌తో రిస్క్ వద్దనుకున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో హీరో చేసిన పర్ఫామెన్స్ రీమేక్‌లో మళ్లీ ఇంకొక నటుడు అందించటం చాలా కష్టమని షాహిద్ అంటున్నాడు. అందుకే, నాని హిట్ మూవీకి దూరంగా ఉండాలని భావించాడట. కానీ, చివరకు ‘జెర్సీ’ రీమేక్‌కు సై  అనేశాడు. అది తెరకెక్కిస్తుండగానే షాహిద్ పెదవిపై ప్రమాదకరమైన గాయమైంది.


షాహిద్ కపూర్ పెదవికి ఆందోళనకర రీతిలో గాయం అవ్వటంతో రెండు నెలలు షూటింగ్ ఆపేశారట. ‘‘నా పెదవిలో కొంత భాగం ఇప్పటికీ చచ్చుబడిపోయినట్టే ఉంటోంది. నేను ఆ భాగాన్ని కదల్చలేకపోతున్నాను’’ అంటూ గాయం తాలూకూ తీవ్రతని వివరించాడు షాహిద్. 2021 సంవత్సరం చివరి రోజున... డిసెంబర్ 31 వేళ... జనం ముందుకొస్తోంది హిందీ ‘జెర్సీ’. షాహిద్, మృణాళ్ ఠాకూర్ హీరోహీరోయిన్స్‌గా నటించారు. తెలుగు వర్షన్‌ డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరియే బాలీవుడ్‌లోనూ సారథ్యం వహించాడు. కాగా నిర్మాతలుగా దిల్ రాజు, అల్లు అరవింద్, పవన్ గిల్ వ్యవహరించారు. 

Advertisement

Bollywoodమరిన్ని...