Jun 11 2021 @ 19:32PM

సొహైల్ హెల్పింగ్ హ్యాండ్స్‌కి మీ ఆశీర్వాదాలు కావాలి: సొహైల్

సొహైల్.. పేరు వినగానే ప్రతి ఒక్కరూ అనుకునే మాట.. ‘కథ వేరే ఉంటది’. బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమైన సొహైల్.. ఇప్పుడు హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో యాంగ్రీ మ్యాన్‌గా ఆయన ఆడిన ఆటకు లక్షలాది మంది సొహైల్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సొహైల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రశంసను పొందిన సొహైల్.. హౌస్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నారు. సొహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి రేషన్, భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు. తాజాగా ఆయన తన సంస్థ పనితీరును వెల్లడిస్తూ.. దీని వెనుక ఉండి నడిపించిన వారిపై ప్రశంసలు కురిపించాడు. 


సొహైల్ మాట్లాడుతూ.. ‘‘సొహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్‌లో కూడా ఇలానే చేస్తాం.. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్‌లకు రేషన్, సరుకులు అందించబోతున్నాం. మా చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్‌ని విజయవంతంగా పూర్తి చేశాం. వాటిలో ఒకటి న్యూరో సర్జరీ కాగా మరో మూడు హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందు నుంచి సపోర్ట్‌గా ఉన్న సోహిలియన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉంది. అందరికీ అందుబాటులో ఉండి.. కష్టాల్లో ఉన్నవారికి మా వంతుగా సాయం అందిస్తాము..’’ అని అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారో పై వీడియోలో చూడవచ్చు.