నటి చిత్ర కేసు సెంట్రల్‌క్రైమ్‌కు బదిలీ

ABN , First Publish Date - 2021-01-07T17:29:01+05:30 IST

నటి చిత్ర కేసు సెంట్రల్‌క్రైమ్‌కు బదిలీ

నటి చిత్ర కేసు సెంట్రల్‌క్రైమ్‌కు బదిలీ

చెన్నై : ప్రముఖ టీవీ నటి ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్య కేసును సెంట్రల్‌ క్రైం విభాగానికి బదిలీ చేస్తూ గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్‌ ఉత్తర్వులిచ్చారు. తమిళ టీవీ ఛానెళ్ళలో ‘పాండ్యన్‌ స్టోర్‌’ తదితర సీరియల్స్‌లో నటించిన చిత్రకు పూందమల్లి ప్రాంతానికి చెందిన హేమనాథ్‌ అనే యువకుడితో పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం ఈ నెలలో జరగాల్సి వుంది. అయితే ఇద్దరూ కుటుంబీకులకు చెప్పకుండా అక్టోబర్‌ 19న రిజిస్టర్‌ మేరేజీ చేసుకున్నారు. ఆ తర్వాత పూందమల్లి సమీపంలోని ఓ హోటల్‌ వారు గత డిసెంబర్‌ లో బసచేశారు. 


ఆ హోటల్‌ నుంచి చిత్ర రోజూ షూటింగ్‌కు వెళ్ళి వస్తుండేది. ఆ నేపథ్యంలో గత డిసెంబర్‌ తొమ్మిదో తేదీన చిత్ర హోటల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నజరత్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే నేరారోపణపై ఆమె భర్త  హేమనాథ్‌ను అరెస్టు చేసి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. చిత్ర రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకున్న రెండు మాసాలకే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంఘటనపై శ్రీపెరుంబుదూరు ఆర్డీవో దివ్యశ్రీ విచారణ జరిపారు. చిత్ర తల్లిదండ్రులు, హేమనాథ్‌ తల్లిదండ్రులు, ఆమెతోపాటు నటించిన టీవీ కళాకారులు, సిబ్బంది వద్ద పదిహేను రోజులకు పైగా ఆమె విచారణ జరిపారు. పూందమల్లి అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ వద్ద ఆమె విచారణ నివేదికను అందజేశారు. చిత్ర ఆత్మహత్యకు వరకట్న వేధింపులు కారణం కాదని ఆర్డీవో ఆ నివేదికలో పేర్కొన్నారు.


హేమనాథ్‌పై మోసం కేసు : మెడికల్‌ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ చిత్ర భర్త హేమనాథ్‌ పలువురిని మోసగించాడనే ఆరోపణలపై సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అతడిని కోర్టులో హాజరుపరిచారు. రెండురోజుల జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 2015లో చెన్నై తిరుమంగళం ప్రాంతానికి చెందిన ఆషా మనోహర్‌ అనే వ్యక్తి వద్ద రూ.1.5 కోట్లను తీసుకుని మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి మోసగించాడు. ఈ విషయమై ఆషా మనోహర్‌ జేజే నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై కోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హేమనాథ్‌ను అరెస్టు చేసినట్టు సెంట్రల్‌ క్రైం పోలీసులు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. హేమనాథ్‌ మరో ఇద్దరి వద్ద కూడా మెడికల్‌ సీట్ల పేరిట మోసగించాడని సెంట్రల్‌ క్రైం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

Updated Date - 2021-01-07T17:29:01+05:30 IST