వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయాల్సిందే!

ABN , First Publish Date - 2020-08-09T05:16:33+05:30 IST

‘అందంగా కనిపిస్తే సరిపోదు, ఆరోగ్యంగానూ కనిపించాలి’ అని నమ్మే హీరోయిన్లు అరుదు. అలాంటివారిలో చెప్పుకోదగిన హిందీ నటి దిశా

వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయాల్సిందే!

‘అందంగా కనిపిస్తే సరిపోదు, ఆరోగ్యంగానూ కనిపించాలి’ అని నమ్మే హీరోయిన్లు అరుదు. అలాంటివారిలో చెప్పుకోదగిన హిందీ నటి దిశా పఠానీ! చక్కని ఆకృతితో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న దిశ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ గురించి ఇలా చెబుతోంది.


చదునైన పొట్ట, బలమైన చేతులు నాకు ప్లస్‌ పాయింట్లు. ఇలాంటి ఫిట్‌నెస్‌ దక్కించుకోవాలంటే రెండింతలు కష్టపడాలి. సాధారణంగా ఎవరైనా ఉదయం జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేసి, మిగతా పనుల్లో పడిపోతారు. కానీ నేను అలా కాదు. ఉదయం, సాయంత్రం... రోజుకు రెండుసార్లు జిమ్‌కు వెళ్తాను. ఉదయం గుండె వేగాన్ని పెంచే కార్డియో వ్యాయామాలు చేస్తే, సాయంత్రం బరువులతో కూడిన వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తాను. డ్యాన్సింగ్‌, కిక్‌బాక్సింగ్‌, జిమ్నాస్టిక్స్‌ కూడా నా వ్యాయామంలో భాగాలే. నాకు సైకిల్‌ తొక్కడం, ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తడం నచ్చదు. వాటికి బదులుగా గుండె వేగాన్ని పెంచే డ్యాన్సులు చేస్తాను. అవి సాదా సీదా డ్యాన్సులు కాదు. అత్యధిక తీవ్రతతో కూడిన హై ఇంటెన్సిటీ డ్యాన్సులు. వాటితో శరీరం మొత్తానికీ చక్కని వ్యాయామం దొరుకుతుంది. సాయంత్రం బరువులతో చేసే వ్యాయామాల వల్ల నా శరీరాకృతి చక్కగా మారుతుంది. బరువులతో కూడిన వ్యాయామాలు చేస్తే కండలు తిరిగి, అందం పోతుంది అనుకుంటాం. కానీ అది అపోహ మాత్రమే! ముఖ్యంగా మహిళలు బరువులతో కూడిన వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం.


వ్యాయామానికి ముందు...

వ్యాయామం చేసినంత సేపు శక్తి తగ్గకుండా నిలకడగా కొనసాగాలంటే, వ్యాయామానికి ముందు శక్తినిచ్చే పదార్థాలు తినాలి. పన్నీర్‌ లాంటి మాంసకృత్తులతో కూడిన ఆహారం వ్యాయామానికి ముందు తప్పక తినాలి. అలాగే వ్యాయామం ముగిసిన తర్వాత అలసిన కండరాలు బలం పుంజుకోవడం కోసం కూడా మాంసకృత్తులు అవసరమే.


వారంలో 5 రోజులు

క్రమంతప్పక జిమ్‌కు వెళ్లాలని ఉన్నా, అన్నిసార్లూ వీలుపడకపోవచ్చు. అయితే వారంలో కనీసం 5 రోజులపాటు జిమ్‌కు వెళ్లగలిగితే వ్యాయామ ఫలం దక్కుతుంది. రెండు రోజులకు మించి విరామం ఇచ్చినా శరీరం ఫిట్‌నెస్‌ను కోల్పోతుంది. కాబట్టి వీలైతే వారానికి ఒక్కరోజు లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వారానికి రెండు రోజులు వ్యాయామానికి విరామం ఇవ్వవచ్చు. అలాగే ఆరోగ్యం అనుకూలించని సందర్భాల్లో ఎక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలకు బదులు తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సాధ్యమైనంతవరకూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగంగా భావించడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి ఆలోచన వ్యాయామం పట్ల ఆసక్తి కొనసాగడానికి తోడ్పడుతుంది.

Updated Date - 2020-08-09T05:16:33+05:30 IST