అక్క ప్రోత్సాహమే నటిని చేసింది

ABN , First Publish Date - 2021-05-31T06:07:35+05:30 IST

కాలేజీలో టాప్‌... అది చదువైనా... పాటైనా! చుట్టూ స్నేహితులు... గలగల గోదారిలా సాగే మాటలు! ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే టీనేజ్‌ అమ్మాయి ఇప్పుడు ‘బంగారు పంజరం’లో బందీ అయింది. అక్కడ ‘

అక్క ప్రోత్సాహమే నటిని చేసింది

కాలేజీలో టాప్‌... అది చదువైనా... పాటైనా! చుట్టూ స్నేహితులు... గలగల గోదారిలా సాగే మాటలు! ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే టీనేజ్‌ అమ్మాయి ఇప్పుడు ‘బంగారు పంజరం’లో బందీ అయింది. అక్కడ ‘మహాలక్ష్మి’గా బరువైన పాత్రలో ఒదిగి భావోద్వేగాలు పండిస్తోంది. తెలుగింటి ఆడపడచుగా మహిళా లోకానికి దగ్గరైన నటి లిఖితా మూర్తి ‘నవ్య’తో పంచుకున్న అనుభూతులివి...


పరిమితులు లేని ఒక చిన్న ప్రపంచం నాది. అలాగని హద్దులు దాటి ప్రవర్తిస్తానని కాదు. నచ్చింది చేసుకొంటూ.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటూ సాగిపోయే సాధారణ అమ్మాయినంతే! రెండేళ్ల క్రితం... అప్పుడు నేను బీకాం ఫస్ట్‌ ఇయర్‌. అక్క కల్పితామూర్తి ద్వారా ఒక ఆఫర్‌ వచ్చింది. ఆడిషన్స్‌కు వెళ్లాను. వాళ్లు ఓకే అన్నారు. వెంటనే సీరియల్‌ మొదలైపోయింది. అదే ‘బంగారు పంజరం’. కట్‌ చేస్తే... నేనిప్పుడు తెలుగు వారందరికీ పరిచయమైన అమ్మాయిని. వారి అభిమానం సంపాదించిన నటిని. నాడు ఆ అవకాశం... నేడు ఈ విజయం... రెండూ నేను ఏమాత్రం ఊహించనవి! 


వద్దు వద్దంటూనే... 

మాది బెంగళూరు. మా అక్క కూడా నటి. తను ‘ఒకరికి ఒకరు’ సీరియల్‌తో పాటు కన్నడంలోనూ నటించింది. అయితే ప్రస్తుతం ఎంకాం ఫైనల్‌ ఇయర్‌ కోసం బ్రేక్‌ ఇచ్చింది. అక్క నటి కావడంతో చాలామంది నన్ను అడిగేవారు... ‘నువ్వు కూడా ఆ దారిలో వెళతావా’ అని! అసలు నాకా ఉద్దేశమే లేదని చెప్పేదాన్ని. అలాంటిది నేను ఇప్పుడు నటిస్తున్నానంటే అందుకు అక్క ప్రోద్బలమే కారణం. ఆడిషన్స్‌కు వెళ్లనంటే... ‘ప్రయత్నించి చూడు... నచ్చకపోతే వదిలెయ్‌’ అంది. ‘సర్లే... చూద్దాం’ అని ఆడిషన్స్‌కు వెళితే, ఎంపికయ్యాను. 


వీడియోలు చూసి... 

నటనలో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. అయితే ఆడిషన్స్‌ తరువాత నన్ను పాత సినిమాలు చూడమని దర్శక, నిర్మాతలు చెప్పారు. వాటితో పాటు ‘మహానటి’ చిత్రం చూశాను. కీర్తి సురేశ్‌ హావభావాలు అద్భుతం. ఇప్పుడు ‘బంగారు పంజరం’లో నేను చేస్తున్న మహాలక్ష్మి పాత్రకు అలాంటి ఎక్స్‌ప్రెషన్సే కావాలి. అందుకే ఆ వీడియోలు చూసి సాధన చేశాను. కెమెరా ముందుకు వచ్చాక అందరి సహకారంతో ఎంతో నేర్చుకొంటున్నాను. మహాలక్ష్మి ఒక బరువైన పాత్ర. తెలియకుండా పిల్లల తండ్రికి తను భార్య అవుతుంది. పెళ్లి తరువాత చనిపోయిందనుకున్న భర్త మొదటి భార్య తిరిగి వస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో నలిగిపోతున్న ఒక సాధారణ మహిళ కథ ఇది. 



జోరు... హుషారు...  

నేను స్కూల్లో, కాలేజీలో టాప్‌ విద్యార్థినిని. చదువులోనే కాకుండా సింగింగ్‌, డ్యాన్సింగ్‌, స్కెచింగ్‌ కూడా చేసేదాన్ని. అన్నిట్లో పాటలంటే బాగా ఇష్టం. భక్తి పాటలు ఎక్కువ పాడతాను. ‘సుగమ సంగీతం’ నేర్చుకున్నాను. చిన్నప్పుడు రేడియోలో కూడా పాడాను. అలాగే ప్రకృతి, అందులోని పచ్చందాలు నాకు చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ చిత్రాలు గీస్తుంటాను. ఇప్పుడంటే నటిని కానీ, అంతకముందే నేనెవరో కాలేజీలో అందరికీ తెలుసు. కారణం... బాగా చదువుతాను. బాగా పాడతాను. బొమ్మలు వేస్తాను. వివిధ వేదికల నుంచి నా సంగీతాన్ని వినిపించాను. అన్నిటికీ మించి ఎప్పుడూ ఉత్సాహంగా, హుషారుగా ఉంటాను. అందుకే అంతా నన్ను ఇష్టపడతారు. 


బొద్దింకలకు భయపడి... 

ప్రస్తుతం బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నా. నెలలో 15 రోజులు హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉంటుంది. మిగిలిన 15 రోజులు బెంగళూరులో! అక్కడ ఉన్నానంటే కచ్చితంగా కాలేజీకి వెళతాను. ఇప్పుడు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటాను. అప్పుడు.. ఎప్పుడూ నాకు ప్రైజ్‌లు వస్తూనే ఉంటాయి. ఈ కాలంలో అధిక శాతం మంది సైన్స్‌ గ్రూప్‌లో చేరి, ఆ తరువాత ఇంజనీరింగో, మెడిసినో చదువుతారు. కానీ నాకు సైన్స్‌ గ్రూపే పడదు. అందులో చేరితే బొద్దింకలు కట్‌ చేయాల్సి వస్తుందని చిన్నప్పుడు అనుకొనేదాన్ని. పెద్దయినా మనసులో నుంచి అది చెరిగిపోలేదు. అందుకే ఆర్ట్స్‌ తీసుకున్నా. 


ఏదిఏమైనా ప్రేక్షకులు మహాలక్ష్మిగా నా పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యారు. అందులో లీనమైపోతున్నారు. అంటే ఒక నటిగా విజయవంతమైనట్టే కదా! ఆ అనుభూతి నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.


ఐఏఎస్‌ నాన్న కల...

ఈ రంగంలోకి రాక ముందు నేను సీఏ కావాలనుకునేదాన్ని. ఒకవేళ అది కుదరకపోతే ఎయిర్‌హోస్టెస్‌ అవ్వాలనుకున్నా. ఎందుకో చిన్నప్పటి నుంచి ఎయిర్‌హోస్టె్‌సను చూస్తే నాలో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తాయి. కానీ ప్రస్తుతం ఆ రెండిటికీ అవకాశం లేదు. నేను కేఏఎస్‌ లేదా ఐఏఎస్‌ కొట్టాలనేది నాన్న కల. దాన్ని నెరవేర్చడానికి బీకాం తరువాత ఎంబీయే లేదా ఎంకాంలో చేరి, ప్రయత్నిస్తా. కానీ ఒక్కటి నిజం. ఇది జీవితం. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి లక్ష్యాలు మారిపోతుంటాయి. ఒకవేళ మంచి అవకాశాలు వస్తే నటిగానే స్థిరపడిపోతానేమో! ఏదైనా నాకు సంతోషమే. ఈ రంగం నాకు బాగా నచ్చింది. తొలి రోజుల్లో కష్టంగా అనిపించింది. అయితే ఇష్టపడి కష్టపడితే ఎందులోనైనా రాణించవచ్చు... ఆస్వాదించవచ్చని అర్థమైంది.

Updated Date - 2021-05-31T06:07:35+05:30 IST