ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా.. కోపంతో ఊగిపోయిన నమిత!

ABN , First Publish Date - 2021-04-03T14:18:17+05:30 IST

ఇలాగైతే నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

ఇలాగైతే నేను చెన్నైకి చెక్కేస్తా.. కోపంతో ఊగిపోయిన నమిత!

చెన్నై/పెరంబూర్‌ : ప్రచారం చేయడానికి వెళ్తే.. అసలు అభ్యర్థే కనిపించకుండాపోతే ఎలా? నటి నమితకూ ఇలాంటి చిర్రెత్తే వ్యవహారమే ఎదురైంది. దాంతో ప్రచారం గిచారం జాంతానై.. ఇలాగైతే నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ ఘటన రామనాధపురంలో జరిగింది. అసలు విషయమేంటంటారా..? అయితే చదవండి!.. బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చీరానీ తమిళంలోనూ, టీవీల్లో మాట్లాడినట్లు ‘మచ్చా’ అంటూ నమిత చెబుతున్న మాటలు అర్ధం కాకపోయినా కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రామనాథపురం బీజేపీ అభ్యర్ధి కుప్పు రాముకు మద్దతుగా నమిత గురువారం రామేశ్వరం మున్సిపాలిటీల్లో నాలుగు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.


ఉదయం 9.30 గంటలకు మరుదుపాండియన్‌ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉండగా, 10.15 గంటలకు కూడా అభ్యర్ధి రాలేదు. దీంతో, మరుదుపాండియన్‌ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత, బస్టాండ్‌, దేవర్‌ విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికీ కూడా అభ్యర్ధి రాకపోవడంతో ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో, ఆగ్రహించిన నమిత ‘అభ్యర్ధి లేకుండా ప్రచారం చేయబోనని, ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని రుసరుసలాడారు. కానీ ఆ రుసరుసలైనా ఆ అభ్యర్థి పట్టించుకుంటేగా?!.

Updated Date - 2021-04-03T14:18:17+05:30 IST