నర్సుగా మారిన నటి

ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST

అసలే మహారాష్ట్ర... అందులో ముంబయ్‌ మహానగరం. ఆ రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు అక్కడే అధికం. కానీ శిఖా వెనుకాడలేదు. ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ హాస్పిటల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ చదివిన ఆమె... వలంటీర్‌గా అనుమతించాలంటూ...

నర్సుగా మారిన నటి

నటీమణులకు బాహ్య సౌందర్యమే కాదు... అందమైన మనసు కూడా ఉంటుందని నిరూపించింది శిఖా మల్హోత్రా. ‘కాంచ్‌లీ’ చిత్రంతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న శిఖా... కరోనా విజృంభిస్తున్న వేళ నర్సుగా అవతారమెత్తారు. ఇప్పుడు ముంబయ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని హాస్పిటల్‌లో సేవలిందిస్తున్నారు.  


అసలే మహారాష్ట్ర... అందులో ముంబయ్‌ మహానగరం. ఆ రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు అక్కడే అధికం. కానీ శిఖా వెనుకాడలేదు. ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ హాస్పిటల్‌లో బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ చదివిన ఆమె... వలంటీర్‌గా అనుమతించాలంటూ ముంబయ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కోరారు. అందుకు కార్పొరేషన్‌ ఓకే చెప్పింది. దీంతో మార్చి 27న ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో వలంటీర్‌ నర్సుగా విధుల్లో చేరిపోయారు ఆమె. 

‘హిందూ హృదయ్‌ సమ్రాట్‌ బాలాసాహెబ్‌ థాకరే ట్రామా హాస్పిటల్‌’ ఐసొలేషన్‌ వార్డు నుంచి తన ఫొటోను శిఖా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అది చూసిన జనం ఆమెలోని సేవామూర్తికీ... సాహసానికీ సాహో అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే... శిఖా నర్సింగ్‌ డిగ్రీ అయితే తీసుకున్నారు కానీ, ఇప్పటి వరకు నర్సుగా ఎక్కడా పనిచేయలేదు. కారణం... నటనపై ఆమెకు ఉన్న మక్కువ. ఆ మక్కువతోనే నటిగా తనను తాను నిరూపించుకోవాలనుకున్నారు. అలా కలను నిజం చేసుకొని, వెండి తెరపై మురిపిస్తున్న శిఖాలో నర్సుగా మారాలన్న స్ఫూర్తినిచ్చింది ఎవరో కాదు... ఆమె తల్లే! 

అవును... శిఖా మల్హోత్రా తల్లి కూడా నలభై ఏళ్లు నర్సుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిన శిఖా... తన తల్లి ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసింది. ఎక్కడ ఉన్నా దేశ సేవకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటున్న శిఖా మల్హోత్రా దయచేసి అందరినీ ఇంట్లోనే ఉండమని వేడుకొంటున్నారు. ‘నర్సింగ్‌లో బీఎస్సీ ఆనర్స్‌ చేసి, ఐదేళ్లు సఫ్దర్‌గంజ్‌ ఆసుపత్రిలోనే గడిపాను. ఆ అనుభవంతోనే ఈ విపత్కర సమయంలో నర్సుగా విధుల్లో చేరాను. నా కృషిని మీరందరూ అభినందిస్తారని కోరుకొంటున్నాను’ అన్నారు శిఖా.



Updated Date - 2020-04-07T05:30:00+05:30 IST