కరోనా రోగులకు ఇదే సైలెంట్ కిల్లర్.. అందుకే సెకండ్ వేవ్‌లో ఇంత భారీ సంఖ్యలో మరణాలా..?

ABN , First Publish Date - 2021-05-22T23:12:16+05:30 IST

మరణాల సంగతేంటి? కరోనా వస్తే మరీ ఇంతలా అదీ యువకులు ప్రాణాలు వదిలేయడం ఏంటి? ఇది సామాన్యులకు అంతుచిక్కని పెద్ద చిక్కుముడిగా మారింది. అయితే దీనికి ఒక సైలంట్ కిల్లరే కారణమని డాక్టర్లు గుర్తించారు.

కరోనా రోగులకు ఇదే సైలెంట్ కిల్లర్.. అందుకే సెకండ్ వేవ్‌లో ఇంత భారీ సంఖ్యలో మరణాలా..?

భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎంతటి విలయాన్ని సృష్టిస్తున్నదో వేరే చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఇదే సమయంలో ఉన్న కరోనా కేసులు, మరణాలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది. నిరుడు అమెరికాలో కరోనా వీరవిహారం చేస్తుండగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు భారత్‌లో కనిపిస్తున్నాయి. అమెరికా కన్నా మనదేశంలోనే పరిస్థితి దారుణంగా ఉందనడం కూడా అతిశయోక్తి కాదేమో. అయితే కరోనా అంటే అదేదో కొత్త వేరియంట్ కాబట్టి వేగంగా వ్యాపిస్తోంది అనుకోవచ్చు. మరి మరణాల సంగతేంటి? కరోనా వస్తే మరీ ఇంతలా అదీ యువకులు ప్రాణాలు వదిలేయడం ఏంటి? ఇది సామాన్యులకు అంతుచిక్కని పెద్ద చిక్కుముడిగా మారింది. అయితే దీనికి ఒక సైలంట్ కిల్లరే కారణమని డాక్టర్లు గుర్తించారు. ఇంతకీ ఆ సైలంట్ కిల్లర్ ఎవరు? కరోనా రోగులను అది ఎలా చంపుతోంది..?


మానవ శరీరంలో కరోనా వైరస్ ప్రధానంగా ప్రభావం చూపే ప్రాంతం ఊపిరితిత్తులు. వైరస్ కారణంగా వీటి పనితీరు దెబ్బతిని శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఈ కారణంగానే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారు తప్పనిసరిగా మెడికల్ ఆక్సిజన్ తీసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా పేషెంట్లను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య కూడా ఈ ప్రాణవాయువే. ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు మృత్యువాత పడ్డారు. ఎందుకిలా జరిగిందని ఆవేదన చెందుతుండగా డాక్టర్ల కంటపడింది దీనికి అసలు కారణం. అదే ‘హ్యాపీ హిపోక్సియా’. అంటే శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోవడం.


సాధారణంగా మన శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయి 95శాతంపైగా ఉండాలి. ఇది కనుక ఏమాత్రం తగ్గినా వెంటనే ఆస్పత్రి తలుపులు తట్టాల్సిందే. ఈ హ్యాపీ హైపోక్సియా చేసే పని ఇదే. దీనివల్ల పేషెంట్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి భయానకంగా 40శాతానికి పడిపోతోందట. సాధారణంగా అయితే ఇలా రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గితే మనం ఊపిరి తీసుకునే పద్ధతి మారిపోతుంది. కిడ్నీలు, మెదడు, గుండె పనిచేయడం కష్టమవుతుంది. ఆ ఇబ్బందిని సులభంగా గుర్తించవచ్చు. కానీ కరోనా వైరస్ సోకిన వారిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఈ నిజమే ప్రపంచంలోని వైద్యశాస్త్ర నిపుణులందరికీ మిస్టరీగా మారింది. రక్తంలో కేవలం 40శాతం ఆక్సిజనే ఉన్న పేషెంట్ కూడా చక్కగా మొబైల్ చూసుకుంటున్నాడు. చాట్ చేస్తున్నాడు. డాక్టరుతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నట్లు కనబడుతున్నాడు. సాధారణంగా హైపోక్సియా అంటే రక్తంలో ఆక్సిజన్ విలువలు తగ్గిన వాళ్లు ఇలా ఉండరు. అందుకే కరోనా రోగుల్లో కనిపించిన దీన్ని ‘హ్యాపీ హైపోక్సియా’ అని పిలుస్తున్నారు. 


మెడికల్ పరిభాషలో దీన్ని ‘సైలంట్ హైపోక్సియా’ అని పిలుస్తున్నారు. మనదేశంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న కనీసం 30శాతం మంది ప్రజల్లో ఈ సైలంట్ హైపోక్సియా ఉందట. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని డాక్టర్లు అంటున్నారు. ఇది సాధారణంగా బయటకు తెలియకపోవడం వల్ల తీరా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు కూడా వారు అనుకున్న దానికంటే చాలా విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరుతున్నారు. కరోనా కారణంగా వచ్చిన జ్వరం, డయేరియాతో శరీరం పోరాడుతుండగా.. ఈ సైలంట్ హైపోక్సియా నిశ్శబ్దంగా మనపై దాడి చేస్తుంది. దీంతో మన శరీరంలోని ఆక్సిజన్ లేమిని తట్టుకునేందుకు ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. ఈ మార్పును గమనించడం సాధారణంగా కష్టం.


 ఇది సోకిన కొందరి రక్తంలో ఆక్సిజన్ స్థాయులు మరీ ఘోరంగా 20-30శాతానికి పడిపోయినట్లు బిహార్‌లోని జవహర్‌లాల్ నెమ్రూ మెడికల్ కాలేజీలో మెడికల్ విభాగం ప్రొఫెసర్ రాజ్‌కమల్ చౌదరి తెలిపారు. ఈ హ్యాపీ హైపోక్సియాను గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేశారు. పెదవులు సాధారణ రంగు కోల్పోయి నీలి రంగుకు మారుతున్నా,  చర్మం రంగు కూడా పర్పుల్ కలర్‌కు మారుతున్నా, ఎటువంటి శ్రమ చేయకపోయినా విపరీతంగా చెమటలు పోస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఇవి హ్యాపీ హైపోక్సియా లక్షణాల్లో కొన్ని అని నిపుణులు అంటున్నారు. అందుకే దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, తల నొప్పులు వంటి కరోనా లక్షణాలు చాలా తక్కువ మోతాదులోనే కనిపించినా సరే.. ఆక్సీమీటర్‌తో శరీరంలో ఆక్సిజన్ విలువలు తెలుసుకోవడం మాత్రం మానుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-05-22T23:12:16+05:30 IST