Abn logo
Jan 19 2021 @ 00:28AM

అదానీ గ్రీన్‌లో 20% వాటా టోటల్‌ చేతికి

ఇరువర్గాల మధ్య రూ.18,500 కోట్ల డీల్‌ 


న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. ఫ్రాన్స్‌ ఇంధన దిగ్గజం టోటల్‌తో 250 కోట్ల డాలర్ల (రూ.18,500 కోట్లు) డీల్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌)లో 20 శాతం వాటాను టోటల్‌ కొనుగోలు చేయనుంది. ఏజీఈఎల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ సంస్థ. ఈ ఒప్పందం ద్వారా టోటల్‌కు ఏజీఈఎల్‌ బోర్డులో ప్రవేశం లభించడంతో పాటు సంస్థ ఉత్పత్తి ప్రారంభించిన 2.35 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ఆస్తుల్లో 50 శాతం వాటా కూడా దక్కనుంది. సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఇరు కంపెనీలు ఈ విషయాలను వెల్లడించాయి. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు టోటల్‌కు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.  కాగా అదానీ గ్రూప్‌నకు చెందిన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూన్‌ సంస్థ అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌లో 37.4 శాతం వాటాతో పాటు ఒడిశాలో నిర్మిస్తున్న ధర్మా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టులో 50 శాతం వాటాను టోటల్‌ గతంలో కొనుగోలు చేసింది. 


ఏజీఈఎల్‌ గురించి : అదానీ గ్రూప్‌నకు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ ఏజీఈఎల్‌ 2015లో ప్రారంభమైంది.  తమిళనాడులోని కముతిలో ఈ సంస్థ 648 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకే ప్రాంతం నుంచి అత్యధికంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టుల్లో ఇదే అతిపెద్దది. ఇప్పటివరకు ఏజీఈఎల్‌ కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల సామర్థ్యం 14.6 గిగావాట్లు. అందులో 3 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నుంచి ఇప్పటికే విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. మరో 3 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. 8.6 గిగావాట్ల ప్రాజెక్టులు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. 2025 నాటికి సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని 25 గిగావాట్లకు పెంచుకోవాలని ఏజీఈఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

Advertisement
Advertisement
Advertisement