Abn logo
Sep 22 2021 @ 03:43AM

10 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు

 • పునరుత్పాదక ఇంధన రంగంపై అదానీ గ్రూప్‌ భారీ బెట్‌
 • ముకేశ్‌ అంబానీతో సై అంటే  సై అంటున్న గౌతమ్‌ అదానీ


న్యూఢిల్లీ: ఇద్దరూ గుజరాతీ పారిశ్రామికవేత్తలే. ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితులే. వారే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ. ఇప్పుడు ఈ ఇద్దరూ పునరుత్పాదక ఇంధన రంగంలో పోటాపోటీగా పెట్టుబడులకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో 1,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.75,000 కోట్లు) పెట్టుబడి పెడతామని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే పదేళ్లలో మేము 2,000 కోట్ల డాలర్లు (రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెడతామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తాజాగా ప్రకటించారు. మంగళవారం జరిగిన ‘జేపీ మోర్గాన్‌ ఇండియా ఇన్వెస్టర్‌ సదస్సు’లో గౌతమ్‌ అదానీ ఈ విషయం ప్రకటించారు.


మావీ సమగ్ర ప్రాజెక్టులే: రిలయన్స్‌లానే అదానీ గ్రూప్‌ కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో సమగ్ర కంపెనీగా ఎదిగేందుకు సిద్ధమైంది. అదానీ గ్రూప్‌ ఇప్పటికే దేశంలో అతి పెద్ద ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థ. పునరుత్పాదక ఇంధన రంగంలో సమగ్ర కంపెనీగా ఎదిగేందుకు రిలయన్స్‌ జామ్‌నగర్‌లో నాలుగు ప్రత్యేక మెగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తోంది. అదానీ గ్రూప్‌ మెగా ఫ్యాక్టరీలతో పాటు ఆ విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్లోనూ దూసుకుపోవాలని భావిస్తోందని అదానీ అన్నారు. ఇన్వెస్టర్స్‌ సదస్సులో అదానీ ఇంకా ఏమన్నారంటే..


 • వచ్చే నాలుగేళ్లలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం మూడింతలు పెంచుకుంటాం
 •  త్వరలో హరిత ఉదజని (హైడ్రోజన్‌) ఇంధన ఉత్పత్తిలోకీ ప్రవేశం
 • ప్రపంచంలో ఎక్కడా లేనంత చౌక ధరకు హరిత ఉదజని ఉత్పత్తి చేస్తాం
 • 2030 నాటికి మా డేటా కేంద్రాలు అన్నీ పునరుత్పాదక విద్యుత్‌తోనే నడుస్తాయి
 • 2025 నాటికి మా ఓడ రేవుల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలే ఉండదు
 • 2025 వరకు మా పెట్టుబడుల్లో 75 శాతం పునరుత్పాదక ఇంధన టెక్నాలజీలపైనే
 • ఎయిర్‌పోర్టులు కేంద్రంగా మెట్రో నగరాల్లో వినోద, ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌పై దృష్టి
 • వచ్చే పదేళ్లలో నాలుగో అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ దేశంగా భారత్‌
 • దేశీయ కంపెనీలే భారత్‌కు చోదక శక్తి
 • భూతాప సమస్యను అన్ని దేశాలు సమిష్టిగా ఎదుర్కోవాలి
 • భూతాపం పాపం సంపన్న దేశాలదే