Abn logo
Apr 7 2021 @ 00:14AM

అదానీ హవా

 రూ.7.84 లక్షల కోట్లకు  గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌

 టాటా, రిలయన్స్‌ తర్వాత మూడో స్థానం


ముంబై: స్టాక్‌ మార్కెట్లోనూ అదానీ గ్రూప్‌ కంపెనీలు దూసుకుపోతున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో  ఈ గ్రూప్‌లోని ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో నాలుగు కంపెనీల షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని తాకాయి. దీంతో ఈ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) రూ.7.84 లక్షల కోట్లకు (సుమారు 10,608 కోట్ల డాలర్లు) చేరింది. 


మూడో అతి పెద్ద గ్రూప్‌: మార్కెట్‌ క్యాప్‌ పరం గా చూస్తే అదానీ గ్రూప్‌ ఇపుడు దేశీయ స్టాక్‌ మార్కె ట్లో మూడో అతి పెద్ద గ్రూప్‌. 24,200 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో టాటా గ్రూప్‌, 17,100 కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువతో ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.


10,608 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో అదానీ గ్రూప్‌ కంపెనీలు ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాయి. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి ఒక్క అదానీ పవర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మాత్రమే రూ.37,952.28 కోట్లుగా ఉంది. మిగతా ఐదు లిస్టింగ్‌ కంపెనీల్లో ఒక్కో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.లక్ష కోట్లకుపైగా ఉంది. 


ఇదీ ప్రస్థానం: గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ ప్రమోటర్‌ గౌతమ్‌ అదానీ 1980వ దశకం చివర్లో కమొడిటీస్‌ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించారు. గత 20 ఏళ్లలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని బహుముఖంగా విస్తరించారు. అదానీ గ్రూప్‌ ప్రస్తుతం గనులు, రేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్‌, రక్షణ రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రము ఖ రాజకీయ నేతలతో గౌతమ్‌ అదానీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందుకు కలిసొచ్చాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోనూ అదానీ గ్రూప్‌ ఇటీవల తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. కీలకమైన కృష్ణపట్నం, గంగవరం ఓడ రేవులను అసలు ప్రమోటర్ల నుంచి కైవసం చేసుకుంది. ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులు, విమానాశ్రయాల రంగాల్లోనూ దూసుకుపోతోంది. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ వంటి పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతోనూ అదానీ గ్రూప్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.   


Advertisement
Advertisement
Advertisement