సిమెంట్‌ రంగంలోకి అదానీ

ABN , First Publish Date - 2021-06-13T08:34:08+05:30 IST

ఓడరేవులు, విమానాశ్రయాల రంగంలో మెజారిటీ మార్కెట్‌ వాటాను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్‌.. తాజాగా సిమెంట్‌ రంగంపైనా కన్నేసింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ సిమెంట్‌ పేరుతో ప్రత్యేక కంపెనీని సైతం

సిమెంట్‌ రంగంలోకి అదానీ

ప్రత్యేక కంపెనీ ఏర్పాటు 


ముంబై: ఓడరేవులు, విమానాశ్రయాల రంగంలో మెజారిటీ మార్కెట్‌ వాటాను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్‌.. తాజాగా సిమెంట్‌ రంగంపైనా కన్నేసింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ సిమెంట్‌ పేరుతో ప్రత్యేక కంపెనీని సైతం ఏర్పాటు చేసింది. రూ.10 లక్షల ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌, రూ.5 లక్షల పెయిడప్‌ క్యాపిటల్‌తో అదానీ సిమెంట్‌ను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌ మార్కెట్లకు వెల్లడించింది. అదానీ గ్రూప్‌ ప్లాగ్‌షిప్‌ కంపెనీయైున అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 100 శాతం అనుబంధ కంపెనీగా అదానీ సిమెంట్‌ కొనసాగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగించనుంది. అదానీ రంగ ప్రవేశంతో సిమెంట్‌ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కిందని, ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కావచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ రంగంలోనూ అదానీ గ్రూప్‌ భారీ కొనుగోళ్లకు పాల్పడవచ్చన్న ఊహాగానాలు నెలకొన్నాయి. 


సిమెంట్‌ భవిష్యత్‌ ఆశాజనకం

కరోనా సంక్షోభంతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ.. రెండో విడత ఉధృతి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వచ్చే త్రైమాసికం నుంచి దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ జోరందుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మౌలిక రంగ పునరుద్ధరణతో సిమెంట్‌ రంగం కూడా మంచి వృద్ధిని నమోదు చేసుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో సిమెంట్‌ రంగంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకే అదానీ సిమెంట్‌ ఏర్పాటు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, కరోనా తొలి దశ తీవ్రత తగ్గుముఖం పట్టాక అంతర్జాతీయంగా రాగికి డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. అదే అదనుగా ఈ గ్రూప్‌ 2021 తొలినాళ్లలో అదానీ కాపర్‌ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. 


ఈ ఏడాది అదానీదే జోరు 

ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయ కార్పొరేట్‌ రంగంలో అదానీ గ్రూప్‌దే జోరు. అదానీ కంపెనీల షేర్లు దూసుకెళ్తుండటంతో గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ సంపద ఈ ఏడాదిలో 4,300 కోట్ల డాలర్ల మేర పెరిగి 7,670  కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా సంపద వృద్ధి చెందిన వ్యక్తి ఈయనే. ప్రస్తుతం దేశంలోనే కాదు, ఆసియాలోనే రెండో అతిపెద్ద ధనవంతుడుగా అదానీ ఎదిగారు. 

Updated Date - 2021-06-13T08:34:08+05:30 IST