అదానీ పోర్ట్స్‌ పరపతికి దెబ్బ

ABN , First Publish Date - 2021-06-16T06:09:47+05:30 IST

గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌నకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజెడ్‌).. దీర్ఘకాలిక పరపతి సామర్థ్యంపై ప్రతికూల

అదానీ పోర్ట్స్‌ పరపతికి దెబ్బ

సంస్థపై ప్రతికూల వైఖరిని వ్యక్తపరిచిన ఫిచ్‌ 


న్యూఢిల్లీ: గౌతమ్‌ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్‌నకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్‌లోని అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజెడ్‌).. దీర్ఘకాలిక పరపతి సామర్థ్యంపై ప్రతికూల వైఖరిని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ వ్యక్తపరిచింది. సంస్థకు బీబీబీ మైనస్‌ రేటింగ్‌ను కేటాయించిన ఫిచ్‌.. దీర్ఘకాలిక విదేశీ రుణాల చెల్లింపు కష్టమయ్యే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఇది కంపెనీ.. విదేశీ మారక ద్రవ్య రుణాల సేకరణపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. కాగా అదానీ పోర్ట్స్‌ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్టును టేకోవర్‌ చేసింది. గత ఏడాది కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 


అవకాశాలపైనా అనుమానాలు

అదానీ పోర్ట్స్‌..  దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలపైనా ఫిచ్‌ రేటింగ్స్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. కంపెనీ చెబుతున్న వ్యాపార అవకాశాల లక్ష్య సాధన అంత తేలిగ్గా కనిపించడం లేదని తెలిపింది. సరుకుల ఎగుమతి, దిగుమతి లక్ష్యంపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ పద్దతిలో కంపెనీ అనుసరిస్తున్న టేక్‌ ఆర్‌ పే విధానం (సరుకు తీసుకోవటం లేదా చెల్లింపుల కాంట్రాక్టు పద్దతి) కూడా కంపెనీకి కలిసి రాకపోవచ్చని తెలిపింది. మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఈ తరహా కార్గోను ఒక పోర్టు నుంచి ఇతర రేవులకు మళ్లించడమూ సాధ్యం కాదని ఫిచ్‌ స్పష్టం చేసింది. 


వీడని అనుమానాలు.. పతనబాటలోనే షేర్లు

మరోవైపు స్టాక్‌ మార్కెట్లో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లపై అనుమానాలు కొనసాగుతున్నాయి. మారిషస్‌ కేంద్రంగా ఉన్న మూడు ఎఫ్‌పీఐల ఖాతాలకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు మాత్రం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. సోమవారం భారీగా పతనమైన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మంగళవారం కూడా అంతంత మాత్రంగానే ట్రేడయ్యాయి.


మంగళవారం నాడు అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు 5 శాతం నష్టపోయి రూ.1,441.40 వద్ద క్లోజవగా అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు కూడా ఐదు శాతం నష్టంతో 1,467.35 వద్ద, అదానీ పవర్‌ షేరు 4.97 శాతం నష్టపోయి 133.90 వద్ద ముగిసాయి. కాగా అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేరు స్వల్పంగా 0.94 శాతం నష్టంతో 761.45 వద్ద క్లోజైంది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2..45 శాతం లాభంతో రూ.1,538.05 వద్ద క్లోజవగా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు 2.79 శాతం లాభపడి రూ.1,208.75 వద్ద స్థిరపడింది 


మాకు సంబంధం లేదు..

కాగా అదానీ గ్రూప్‌ మంగళవారం మరో వివరణ ఇచ్చింది. మారిషస్‌ కేంద్రంగా ఉన్న మూడు ఎఫ్‌పీఐల మొత్తం ఖాతాలను కాకుండా కొన్ని కంపెనీల జీడీఆర్‌ (గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌) ఇష్యూల ఖాతాలను మాత్రమే ఎన్‌ఎ్‌సడీఎల్‌  2016, జూన్‌ 16 నుంచి స్తంభింప చేసినట్టు తెలిపింది. ఇందులో తమ కంపెనీల షేర్లుగానీ, జీడీఆర్‌లుగానీ లేవని పేర్కొంది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-06-16T06:09:47+05:30 IST