ట్రాఫికింగ్‌కు అడ్డా!

ABN , First Publish Date - 2020-12-03T08:15:47+05:30 IST

మానవ అక్రమ రవాణా (హ్యూమన్‌ ట్రాఫికింగ్‌)కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు..

ట్రాఫికింగ్‌కు అడ్డా!

హైదరాబాద్‌ కేంద్రంగా బంగ్లాదేశీ యువతుల అక్రమ రవాణా..

ఎన్‌ఐఏ మొదటి కేసూ రాజధానిలోనే.. 

తాజాగా మరో ఇద్దరు యువతుల గుర్తింపు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా (హ్యూమన్‌ ట్రాఫికింగ్‌)కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యభిచార ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి.. విదేశాల నుంచి యువతుల్ని అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువస్తూ.. వారితో వ్యభిచారం చేయిస్తున్నాయి.


వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదంపై దృష్టిసారించే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా తొలిసారి మానవ అక్రమ రవాణాపై దృష్టిసారించడం.. అది కూడా హైదరాబాద్‌కు చెందిన ముఠాపై కేసు పెట్టడం గమనార్హం. ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. వారిని ఇక్కడ వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.


గత సంవత్సరం సెప్టెంబరులో పహాడీషరీఫ్‌ పోలీసులు.. జల్‌పల్లి, మహమూద్‌ కాలనీల్లోని వ్యభిచార గృహాలపై దాడిచేసి నిర్వహకులను అరెస్టు చేశారు. నలుగురు బంగ్లాదేశ్‌ యువతుల్ని రక్షించి.. వసతి గృహానికి తరలించారు. మొదట స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీఎ్‌సకు బదిలీ చేశారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అంశం కావడంతో కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది.

ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు 12 మంది నిందితులను అరెస్టు చేసి.. గత సెప్టెంబరులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సోనాయ్‌ నది మీదుగా.. బంగ్లా యువతుల్ని ఉద్యోగాల పేరుతో కోల్‌కతాకు తీసుకువచ్చి అక్కడి నుంచి హైదరాబాద్‌, ముంబై ఇతర ప్రాంతాల్లోని వ్యభిచార గృహాలకు తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 


రాచకొండ కమిషనరేట్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం పోలీ్‌సలు జరిపిన దాడుల్లో నలుగురు వ్యభిచార గృహ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బంగ్లాదేశ్‌ యువతుల్ని రక్షించి.. వసతి గృహానికి తరలించారు. దీంతో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌ యువతుల అక్రమ నిర్బంధం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాచకొండ పోలీసులు నమోదు చేసిన కేసు.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణాకు సంబంధించినది కావడంతో.. త్వరలోనే ఎన్‌ఐఏ రంగంలోకి దిగనుంది.




నిర్వహకులూ బంగ్లాదేశీలే..!

బంగ్లాదేశ్‌ నుంచి ఉద్యోగం, ఉపాధి పేరుతో యువతుల్ని అక్రమంగా తరలించి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నవారు కూడా ఆ దేశానికి చెందినవారే కావడం విశేషం. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారిలో కొందరు హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. తమకు తెలిసిన వారు, తెలిసిన మార్గంలో యువతుల్ని అక్రమంగా రవాణా చేసి తీసుకువస్తున్నారు.


మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఎన్‌ఐఏ నమోదు చేసిన మొదటి కేసులో 12 మంది నిందితుల్లో 9 మంది బంగ్లాదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. అబ్దుల్‌ బారిక్‌ షేక్‌, మహ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌, బీతీ బేగం, మహ్మద్‌ రాణా హుస్సేన్‌, మహ్మద్‌ అల్‌ ముమున్‌, సోజిబ్‌ షేక్‌, సురేశ్‌ కుమార్‌ దాస్‌, మహ్మద్‌ అబ్దుల్లా మున్షీ, మహ్మద్‌ ఆయుబ్‌ షేక్‌ ..బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహించారు. ఇటీవల రాచకొండ పోలీ్‌సలు అరెస్ట్‌ చేసిన వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు.


వర్చువల్‌ విధానంలో..


బంగ్లాదేశీ ట్రాఫికింగ్‌ గ్యాంగ్‌ల మూలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కోల్‌కతా కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. పూర్తి వివరాలు రాబట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. ట్రాఫికింగ్‌ ముఠాలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. వర్చువల్‌ విధానంలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా.. సమూలంగా ఈ వ్యవస్థను నిర్మూలించవచ్చని భావిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.


Updated Date - 2020-12-03T08:15:47+05:30 IST