బిల్లుల బాదుడు!

ABN , First Publish Date - 2021-09-05T05:55:44+05:30 IST

తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ.. అధిక లోడు పేరుతో బాదుడుకు సిద్ధమైంది. జిల్లాలో సబ్‌స్టేషన్ల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తూ ప్రతి ఇంట్లో విద్యుత్‌ వినియోగంపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తోంది. వాడకాన్ని బట్టి బిల్లుల వసూలుకు విద్యుత్‌ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ సమాచారం వినియోగదారులకు ముందుగా తెలియజేయకుండా బిల్లులు పెద్ద మొత్తంలో పెంచే ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. జిల్లాలో గృహవసర వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, చిన్నమధ్య తరహా పరిశ్రమలపై ఈ ప్రభావం పడనుంది.

బిల్లుల బాదుడు!
ఈదుపురంలోని సబ్‌ స్టేషన్‌

- కిలోవాట్‌ వాడకంపై అదనపు వసూళ్లు

- సబ్‌స్టేషన్ల వారీగా మీటర్ల తనిఖీలు

- వినియోగదారుల్లో ఆందోళన

(ఇచ్ఛాపురం రూరల్‌)

తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ.. అధిక లోడు పేరుతో బాదుడుకు  సిద్ధమైంది. జిల్లాలో సబ్‌స్టేషన్ల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తూ ప్రతి ఇంట్లో విద్యుత్‌ వినియోగంపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తోంది. వాడకాన్ని బట్టి బిల్లుల వసూలుకు విద్యుత్‌ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ సమాచారం వినియోగదారులకు ముందుగా తెలియజేయకుండా బిల్లులు పెద్ద మొత్తంలో పెంచే ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. జిల్లాలో గృహవసర వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, చిన్నమధ్య తరహా పరిశ్రమలపై ఈ ప్రభావం పడనుంది. జిల్లావ్యాప్తంగా 7.67 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు, మరో 82 వేల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో విద్యుత్‌ వాడకం భారీగా పెరిగింది. ఏసీలు, ఆన్‌లైన్‌ క్లాసులు, కొవిడ్‌ ప్రభావంతో అందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో విద్యుత్‌ వాడకం ఎక్కువైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు ఇంటింటా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి విద్యుత్‌ సర్వీసు తీసుకునే సమయంలో పేర్కొన్న కిలోవాట్స్‌కు, ప్రస్తుత వినియోగానికి తేడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాన్ని నిర్ధారించేందుకు ప్రతి ఇంటినీ పరిశీలిస్తున్నారు. ప్రతి నెల అధికలోడు వినియోగిస్తున్న వారి నుంచి కిలోవాట్‌ పేరుతో అదనపు వసూళ్లు చేయనున్నారు.  


కిలో వాట్‌కు రూ.1200 : 

గృహ వినియోగదారులు మీటరు తీసుకున్న సమయంలో కిలోవాట్‌కు, ప్రస్తుతం అదనంగా వాడుతున్నట్లు గుర్తిస్తే ప్రతి కిలోవాట్‌కు రూ.1200 అభివృద్ధి చార్జీలు, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, ఇంటిని పరిశీలించినందుకు రూ.100, దరఖాస్తు రుసుం రూ.50, జీఎస్‌టీ రూ.180 వసూలు చేస్తారు. అదే వాణిజ్య సర్వీసులయితే గృహ వినియోగదారులకన్నా.. సెక్యూరిటీ డిపాజిట్‌ చార్జీలు అదనంగా 600 వసూలు చేస్తారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్‌స్టేషన్ల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. ఈ మేరకు అధికారులు ఇంటింట తనిఖీలు చేస్తున్నారు. కొన్నిచోట్ల గృహ అవసరాలకు మీటర్లు తీసుకుని వాణిజ్య అవసరాలకు వాడుతున్నవారు ఉన్నారు. కొన్ని చోట్ల కోళ్లఫారాలు, మిల్లులు, చిరు వ్యాపార సంస్థలు నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులే ఎక్కువ. కానీ పట్టణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులతో సమాన స్థాయిలో వాణిజ్య సర్వీసులు ఉన్నాయి. వాటినే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారు.  


సర్దుబాటు పేరిట షాక్‌!

విద్యుత్తు వినియోగదారులపై సర్దుబాటు పేరిట ప్రభుత్వం అదనపు భారం మోపింది. విద్యుత్తు కొను గోలు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు కావాల్సిన నిధుల కోసం వేసిన అంచనా వ్యయానికి... వాస్తవ వినియోగానికి తేడా వస్తోందనే కారణంతో వినియోగ దారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వినియోగ దారుల నెలవారీ బిల్లులోనే ట్రూఆప్‌ పేరుతో అద నంగా కొంతమొత్తం వేస్తున్నారు. వినియోగించిన యూనిట్‌కు రూ.0.43 చొప్పున లెక్క కట్టి నెల బిల్లులో కలుపుతున్నారు. వ్యవసాయ సర్వీసులకూ ఇది వర్తి స్తుంది. ఉచిత విద్యుత్తు కావడంతో ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. మిగిలిన అన్ని కేటగిరీల విని యోగదారులు అదనపు మొత్తం చెల్లించాల్సిందే. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పించిన 200యూనిట్ల వరకు మినహాయింపు ఇచ్చి.. ఆ పైన వినియోగించే విద్యుత్తుకు వినియోగదారులే చెల్లించాలి. ఈ విధం గా ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ట్రూఆప్‌ విధానంతో అదనపు ఛార్జీలు వేస్తా రు. ఆగస్టులో యూనిట్‌కు రూ.0.44, సెప్టెంబరులో రూ.0.42, అక్టోబరులో 0.44, నవంబరులో రూ.0.43, డిసెంబరులో రూ.0.45, జనవరిలో రూ.0.43, ఫిబ్రవరిలో రూ.0.42, మార్చిలో రూ.0.40 ప్రకారం అదనపు భారం పడనుంది. ప్రతి నెల సర్దుబాటు పేరుతో రూ.79.09 కోట్ల మేరకు అదనపు ఛార్జీలు జిల్లా వినియోగదారులపై పడనున్నాయి. ఆగస్టు నుంచి మార్చి వరకు మొత్తం రూ.632.72 కోట్ల మేర పడనుంది. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ అనంతరం ఇచ్చిన విద్యుత్తు సర్వీసులకు ట్రూఅప్‌ విధానం వర్తించదు. ఇలాంటి సర్వీసులు అన్ని కలిపి సుమారు 35 వేల వరకు ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.  


వృఽథాను నిరోధించేందుకే 

ఇళ్లలో కొందరు విద్యుత్‌ను వృఽథాగా వాడుతున్నారు. దీని వల్ల సబ్‌స్టేషన్ల వారీగా అదనపు లోడు పడుతోంది. అనేకసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ పొదుపుగా వాడేందుకు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ పొందే సమయంలో పరిమిత వాడకాన్ని నిర్దేశిస్తూ డిపాజిట్‌, ఇతర మొత్తాలు కట్టించుకున్నాం. ఇప్పుడు అదే మీటరుపై అదనపు ఓల్టేజీని వాడుతున్నప్పడు తప్పనిసరిగా వివిధ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగించే విద్యుత్తు ఆధారంగానే ట్రూఆప్‌ మొత్తం వస్తుంది.

- ఎల్‌.మహేంద్రనాధ్‌, విద్యుత్‌ ఎస్‌ఈ, శ్రీకాకుళం.

Updated Date - 2021-09-05T05:55:44+05:30 IST