కఫీల్ ఖాన్‌‌ను విడుదల చేయండి : మోదీకి అధీర్ లేఖ

ABN , First Publish Date - 2020-08-04T23:07:25+05:30 IST

జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) క్రింద అరెస్టయిన మెడికల్ ప్రాక్టీషనర్ కఫీల్ ఖాన్‌ను

కఫీల్ ఖాన్‌‌ను విడుదల చేయండి : మోదీకి అధీర్ లేఖ

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) క్రింద అరెస్టయిన మెడికల్ ప్రాక్టీషనర్ కఫీల్ ఖాన్‌ను విడుదల చేయాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 


ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్‌ విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆరోపిస్తూ, ఎన్ఎస్ఏ క్రింద అరెస్టు చేశారని అధీర్ తన లేఖలో పేర్కొన్నారు. కఫీల్‌కు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు నిరసనగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు ఆరోపణలు నమోదు చేశారని తెలిపారు. అన్యాయం, వివక్ష, ప్రతీకారాలకు రామ రాజ్యం వ్యతిరేకమని పేర్కొన్నారు. 


తాను, తన పార్టీ పార్లమెంటులోనూ, బయట సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించామని, అయినప్పటికీ తనపై కానీ, లక్షలాది మంది నిరసనకారులపై కానీ ఎటువంటి కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. 


భారత దేశ రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ స్పష్టంగా ఉన్నప్పటికీ, ఓ యువ వైద్యుడిని ఎందుకు ఇరికించారని ప్రశ్నించారు. జనవరి నుంచి జైలులో ఉన్న కఫీల్ ఖాన్‌కు న్యాయం చేయాలని మోదీని కోరారు. 


Updated Date - 2020-08-04T23:07:25+05:30 IST