పెర్ఫామెన్ష్ పాత్రలు అంటే తెలుగులో మన దర్శక నిర్మాతలకు గుర్తుకొచ్చే హీరోయిన్స్ లిస్టులో అదితి రావు హైదరి ఒకరు. హైదరాబాద్ మూలాలున్న ఈ అమ్మడు.. దక్షిణాదినే కాదు, బాలీవుడ్లోనూ వైవిధ్యమైన పాత్రలున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తను ఎంచుకునే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యక్తి పేరుని అదితిరావు హైదరి రివీల్ చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, దక్షిణాదిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం. అసలు సినిమా రంగం ఎలా ఉంటుందో తెలియక ముందు హీరోయిన్గా మణిరత్నం సినిమాల్లో నటించాలని అనుకుందట అదితిరావు హైదరి. తమిళ సినిమా శృంగారంతో ఎంట్రీ ఇచ్చినా, తర్వాత హిందీ సినిమాలకే పరిమితం అయ్యింది. అలాంటి సమయంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చెలియా సినిమాతో సౌత్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అదితిరావు హైదరి. 'మణిరత్నంగారితో పని చేయడం వల్ల నటిగా ఎంతో పరిణితిని సాధించాను. తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. నటిగా వంద శాతం పాత్రలో ఇన్వాల్వ్ అవుతాను. పనిలో ఉన్నప్పుడు ఇంకేమీ గుర్తుకు రావు. మణిరత్నంగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నాకు నచ్చిన పనిని హాయిగా చేసుకోగలుగుతున్నాను' అని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నంపై తన గురుభక్తిని చాటుకున్నారు అదితి రావు హైదరి.