Abn logo
Feb 13 2021 @ 03:44AM

ఆదిత్యనాథ్ ‘యూపీ నమూనా’

గతఏడాది దేశప్రజలను అమితంగా కలవరపరిచిన, తరచు మీడియా పతాక శీర్షికలలో ఉన్న మూడు అంశాలు– కరోనా మహమ్మారి, మందగించిన ఆర్థికాభివృద్ధి, చైనాతో సరిహద్దు సంఘర్షణలు. రాజకీయాల ప్రస్తావన రాకుండా భారతీయుల పిచ్చాపాటీ జరుగుతుందా? అసంభవం. అయినా 2020లో ఆరోగ్యం, ఆర్థికం, రక్షణ అంశాలే సకల ప్రజల మాటామంతీలో అనివార్యంగా ప్రాధాన్యం వహించాయి. చాలామంది గమనంలోకి రాని ఒక ముఖ్యపరిణామం గత ఏడాది భారత రాజకీయాలలో జరిగింది. అదొక ఆందోళనకర విషయం. దాని పర్యవసానాలు మన గణతంత్ర రాజ్య భవిష్యత్తుపై విషమ ప్రభావాన్ని చూపేవిధంగా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీలో తదుపరి సర్వోన్నత నేతగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిర్భావమే ఆ పరిణామం. 


2019 సంవత్సరాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావి ప్రధానమంత్రిగా ప్రజల దృష్టిలోకి వచ్చారు. 2024 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ స్థానంలో అమిత్ షా తప్పకుండా ప్రధానమంత్రి పదవిని చేపడతారని సంఘ్‌పరివార్, దేశ ప్రజలలో అత్యధికులు భావించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నరేంద్ర మోదీకి అమిత్ షా ఆంతరంగిక సచివుడుగా ఉన్నారు. మోదీ నిర్ణయాలను ప్రభావితం చేయగలగడంతో పాటు వాటిని సమర్థంగా అమలుపరిచే నేతగా అమిత్ షా పేరు పొందారు. కేంద్ర హోంమంత్రిగా అధికరణ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడంలో అమిత్ షా కీలకపాత్ర వహించడంతో ఆయనే భావి ప్రధాని అన్న నమ్మకం చాలా మందిలో దృఢపడింది. అమిత్ షా ప్రభవ ప్రాభవాలకు మోదీ ఆమోదం సంపూర్ణంగా ఉందని కూడా ప్రజలు విశ్వసించారు. 2020 సంవత్సరాంతంలో ఆ పరిస్థితిలో మార్పులు కనిపించాయి. ఆదిత్యనాథ్ ప్రాధాన్యం క్రమంగా పెరగసాగింది. బీజేపీలోని సీనియర్ నాయకులు ఆదిత్యనాథ్ ఉత్థానాన్ని గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అనుసరించి శివరాజ్ సింగ్ చౌహాన్, బిఎస్ యడ్యూరప్ప హిందూ–-ముస్లిం వివాహాలకు వ్యతిరేకంగా తమ తమ రాష్ట్రాలలో చట్టాలు తీసుకువచ్చారు. ఆదిత్యనాథ్‌తోనే తమ రాజకీయ భవిష్యత్తు పదిలమని వారిరువురు భావిస్తున్నారు. ఉదారవాద విధానాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, సంపూర్ణ మతతత్వ విధానాలను అనుసరించడమే ప్రయోజనకరమనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు కనిపిస్తోంది.  


ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలనే తన ఆకాంక్షను నరేంద్ర మోదీ తొలుత 2012–13లో బహిరంగంగా వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయన ‘గుజరాత్ నమూనా’ గురించి పదే పదే ప్రస్తావించారు. గుజరాత్ సర్వతోముఖాభివృద్ధికి తాను అనుసరించిన విధానాలను దేశవ్యాప్తంగా అమలుపరచడం ద్వారా భారత్ను సమున్నతంగా తీర్చిదిద్దుతానని మోదీ హామీ ఇస్తుండేవారు. ప్రగతిశీల ఆర్థిక, సామాజిక దార్శనికతకు ‘గుజరాత్ నమూనా’ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పేవారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు ప్రశస్తమైనది కాదని ఆయన విమర్శకులు స్పష్టం చేసేవారు. ముస్లింల అణచివేత, భిన్నాభిప్రాయాల పట్ల అసహనం మొదలైన వాస్తవాలను అందుకు నిదర్శనంగా వారు పేర్కొనేవారు. ఆదిత్యనాధ్ ఇంతవరకు ‘యూపీ నమూనా’ గురించి స్పష్టంగా ఏమీ వెల్లడించలేదు. ఆ నమూనాను దేశ వ్యాప్తంగా అమలుపరచాలనే ఆకాంక్ష ఆయనలో ప్రగాఢంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన ఇంతవరకు అందించిన పాలన ప్రాతిపదికగా ఆ అభివృద్ధి నమూనా ఎలా ఉంటుందో మనం గ్రహించవచ్చు. 


నరేంద్రమోదీ, ఆదిత్యనాథ్‌ల మధ్య పలు సామ్యాలు ఉన్నాయి. ఇరువురూ నిరంకుశ ధోరణులకు మంచి ఉదాహరణలు. తమ నిర్ణయాలు, సంకల్పాలను తమ చుట్టూ ఉన్న కేబినెట్ సహచరులు, శాసనసభ్యులు, ప్రభుత్వాధికారులు, వైజ్ఞానిక నిపుణులు, పాత్రికేయులు, ప్రజల-పై రుద్దేందుకు ప్రయత్నిస్తారు. తమ అభిమతమే వారి అభిమతం కావాలని కోరుకుంటారు. ఇరువురికీ తమ గొప్పతనం గురించి విశేష భావాలు ఉన్నాయి. వాస్తవ, ఊహాత్మక సాఫల్యాలు అన్నిటికీ సముచిత ప్రతిఫలాలు తమకు మాత్రమే దక్కాలని ఆ ఇరువురు గట్టిగా భావిస్తారు. 


నరేంద్ర మోదీ, ఆదిత్యనాథ్ వ్యక్తిత్వాల మధ్య చెప్పుకోదగిన వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మోదీతో పోల్చితే యోగి సంపూర్ణంగా అధిక సంఖ్యాకుల అనుకూలవాది. మతాలకు అతీతంగా తాను ప్రతి ఒక్కరికీ మిత్రుడినని మోదీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మెట్రోలో ముస్లింలతో కలిసి ప్రయాణిస్తుంటారు. ఆదిత్యనాథ్‌కు తన విశ్వాసాలు, వాటి పరిపూర్ణత విషయంలో ఎటువంటి సందిగ్ధత లేదు. ఇతర మతాల వారి కంటే, ముఖ్యంగా ముస్లింల కంటే హిందువులు ఉత్కృష్ట ప్రజలని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన బాహాటంగా చెబుతుంటారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ, తన విమర్శకులు మౌనం వహించేలా చేసేందుకు పోలీసులను, రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. ఆదిత్యనాథ్ కూడా ఇవే పద్ధతులను మరింత తీవ్రస్థాయిలో అనుసరించారు. పౌరసత్వచట్టాలకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ఉద్యమాలను ఆయన అణచివేసిన తీరే అందుకు ఒక తిరుగులేని నిదర్శనం.  


ఆదిత్యనాథ్ పాలనా విధానాలకు ఉత్తరప్రదేశ్ ప్రజలే ఎక్కువ బాధితులు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ‘ఆర్టికల్ 14’ అనే వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం ఆదిత్యనాథ్ పాలన గురించి ఈ విధంగా వ్యాఖ్యానించింది: ‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక భారతీయ జనతా పార్టీ పురోగతిలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఎటువంటి సంకోచం లేకుండా ముస్లింలను బహిరంగంగా దమనకాండకు గురిచేయడం, రాజకీయంగా విభేదించేవారిని ప్రజాశత్రువులుగా పరిగణించడమనే పాలనా నమూనాకు ఆమోదం లభించిందనడానికి ఆదిత్యనాథ్ ఎంపికే తార్కాణం’. ‘అధికారం చేపట్టిన తొలినాళ్ళ నుంచి చట్ట విరుద్ధ నిఘా బృందాలను ఆయన అన్నివిధాల ప్రోత్సహించారు. ముస్లింలను, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని వేధించేందుకు, జైలులో పెట్టేందుకు, చంపివేసేందుకు కూడా పోలీసులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. అగ్రవర్ణాల హిందువుల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు’ అని కూడా ఆ వ్యాసం పేర్కొంది. 


ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి చాలాకాలం కిత్రమే ‘హిందూ యువ వాహిని’ అనే సంస్థను నెలకొల్పారు. హిందూత్వ భావజాలానికి, జాతీయవాదానికి అంకితమైన సాంస్కృతిక, సామాజిక సంస్థగా ఆయన దానిని అభివర్ణించారు. నిజానికి అది ఒక సమరశీల, సంఘటిత సంస్థ. హింసాకాండకు పాల్పడడానికి వెనుకాడేది కాదు. మతతత్వ అల్లర్లను, హింసాకాండను రెచ్చగొట్టేదని, మసీదుల దగ్ధకాండకు పాల్పడేదనే ఆరోపణలు హిందూ యువవాహినిపై ఉండేవి. ఈ సంస్థ కార్యకర్తలు పూర్తిగా తమ అధినేతకు విధేయులు. ఆయన ఆదేశాలను అమలుపరిచేందుకు సదా సిద్ధంగా ఉండేవారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి పూర్వం చట్టవిరుద్ధ నిఘాకారుల బృందాన్ని నిర్వహించిన ఏకైక రాజకీయవేత్త ఆదిత్యనాథ్. 


నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దృఢమైన పారిశ్రామిక ప్రాతిపదికలు ఉన్నాయి. వ్యవస్థాపక సంస్కృతి ఉత్కృష్టంగా ఉండేది. 2017లో ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉత్తరప్రదేశ్ పారిశ్రామికంగా గానీ, వ్యవస్థాపక సామర్థ్యంలో గానీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు. దేశంలోనే అత్యధిక జనాభా గల ఆ రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబాటుతనానికి మాత్రమే పేరు పొందింది. ఈ అప్రతిష్ఠను రూపుమాపేందుకు ఆదిత్యనాథ్ పాలన చేసిన దోహదం ఏమీ లేదు. 


ఇదీ, భారతీయ జనతాపార్టీ భావి సర్వోన్నత నాయకుడి వ్యక్తిగత, రాజకీయ చరిత్ర. తదుపరి సార్వత్రక ఎన్నికలలో తమ పార్టీ ప్రచారానికి ఆదిత్యనాథ్ నాయకత్వం వహిస్తే ఓటర్లకు ఎటువంటి ‘అచ్చేదిన్’ గురించి హామీ ఇస్తాడు? 2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా యువ భారతీయులకు ఉద్యోగాలు సృష్టిస్తానని సంపద పెంచి పూర్తి ఆర్థికభద్రత కల్పిస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మరి ఆదిత్యనాథ్ ఇచ్చే హామీ ఏమిటి? హిందూయేతర మతాలకు చెందిన వారిని వేధింపులు, శిక్షలకు గురి చేయడంలో సంతృప్తిని కలిగించడం మినహా యువ భారతీయులకు మరేదైనా హామీని ఇవ్వగలరా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. భారత్ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించేలా పలుదేశాల నాయకులను ప్రభావితం చేశారు. ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవడం జరిగితే తన గురించి, తన దేశం గురించి ప్రపంచం ఏమనుకుంటుందనే విషయాన్ని పట్టించుకోరు. దేశంలో తన అధికారాన్ని పటిష్ఠం చేసుకోవడం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. తన భావాలకు పూర్తిగా భిన్నమైన రాజకీయ, తాత్విక, ఆధ్యాత్మిక విశ్వాసాలను కలిగివున్న భారతీయులపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించడానికే ఆయన ప్రాధాన్యమిస్తారు. 


కొన్నినెలల క్రితం ఇదేకాలమ్ (2020 జూలై 18, ‘ఇందిర, మోదీ, ప్రజాస్వామ్య పతనం’)లో అధికారాలను సంపూర్ణంగా తన వద్దనే కేంద్రీకరించుకోవడంలో నరేంద్ర మోదీ ‘ఇందిరాగాంధీని తలదన్నిన నేత’ అని వ్యాఖ్యానించాను. ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి అవడం జరిగితే ఆయన ‘నరేంద్ర మోదీని తలదన్నే నాయకుడు’గా పరిణమించే అవకాశం ఎంతైనా ఉంది. ఏడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న నరేంద్ర మోదీ ‘గుజరాత్ నమూనా’ మన గణతంత్రరాజ్య సామాజిక నిర్మాణానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఎనలేని నష్టం కలిగించింది. ఆదిత్యనాథ్ ‘ఉత్తరప్రదేశ్ నమూనా’ అయితే అంతకంటే తక్కువ కాలంలోనే మన సమున్నత గణతంత్ర రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయడం ఖాయం.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...