ఆస్పత్రుల్లో దొరకని అడ్మిషన్‌

ABN , First Publish Date - 2021-05-08T06:51:52+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ దొరకడం దుర్లభంగా మారింది. కనాకష్టంగా దొరికినా ఆక్సిజన్‌ బెడ్లకు తీవ్ర కొరత నెలకొంది.

ఆస్పత్రుల్లో దొరకని అడ్మిషన్‌
పద్మావతీ ఆస్పత్రిలో బెడ్‌ దొరక్కపోవడంతో బయటే అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ పెట్టుకుంటున్న బాధితురాలు

ఆక్సిజన్‌ బెడ్లకు తీవ్ర కొరత... పెరిగిపోతున్న మరణాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తీరుపై అసంతృప్తి

ప్రైవేటులో ఫీజుల దోపిడీ... అంబులెన్సు ఛార్జీల మోత

కఠిన చర్యలకు ఉపక్రమించని జిల్లా యంత్రాంగం


తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ దొరకడం దుర్లభంగా మారింది. కనాకష్టంగా దొరికినా ఆక్సిజన్‌ బెడ్లకు తీవ్ర కొరత నెలకొంది.కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య బాగానే వున్నా తిరుపతిలోని పద్మావతి, రుయా, చిత్తూరు, మదనపల్లె ప్రభుత్వాస్పత్రులు కీలకం. వీటిపైనే 70 శాతం మంది బాధితులు ఆధారపడుతున్నారు. అయితే వీటిలో అడ్మిషన్‌ దొరకడం దుర్లభంగా మారుతోంది. పద్మావతి, రుయా, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వెంటిలేటర్‌ బెడ్లు వున్నాయి. అవి కూడా పరిమితంగానే. తిరుపతిలో ఆయుర్వేద,ఈఎస్‌ఐ, మదనపల్లె ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే వున్నాయి. వెంటిలేటర్‌ బెడ్లు లేవు. కుప్పం, పలమనేరు, శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రులు నామమాత్రపు సేవలందిస్తున్నాయి. పద్మావతి, రుయా, చిత్తూరు ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్‌ బెడ్లకు విపరీతమైన డిమాండ్‌ వుంది. ఇక్కడ సాధారణ బాధితులకు తక్కువగానూ, సిఫారసు చేయించుకున్న వారికి ఎక్కువగానూ బెడ్లు దొరుకుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆయుర్వేద, ఈఎస్‌ఐ, చిత్తూరు, మదనపల్లె ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు దొరకడం దుర్లభమవుతోంది.అడ్మిషన్లకు రాజకీయ ప్రముఖులు లేదా అధికారులతో సిఫారసు చేయించుకున్నా కూడా ఎంతో నిరీక్షణ తరువాత గానీ బెడ్డు దొరకడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసులకే ఆస్పత్రి వర్గాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.వీటిలో వాస్తవం లేకపోలేదు. బెడ్లు దొరక్క పద్మావతీ, రుయా ఆవరణల్లో అసంఖ్యాకంగా బాధితులు అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ఒక బెడ్డుకు పది మంది బాధితులు వెయిటింగ్‌లో వుంటున్నారు. ప్రత్యేకించి మదనపల్లెలో కూడా ఈ నిరీక్షణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. అక్కడా రాజకీయ సిఫారసులే అడ్మిషన్లలో కీలకపాత్ర వహిస్తున్నట్టు సమాచారం. చాలామంది ఆక్సిజన్‌ అవసరం లేకున్నా ముందుజాగ్రత్తగా తమకున్న పలుకుబడితో సిఫారసు చేయించుకుని పద్మావతీ, రుయా, ఆయుర్వేద, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు పొందుతున్నారని, దీనివల్ల నిజంగా ఆక్సిజన్‌ అవసరమైన బాధితులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల బయట పడిగాపులు కాస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సిఫారసులు, ఒత్తిళ్ళతో భయపడి వైద్యాధికారులు, నోడల్‌ అధికారులు చాలావరకూ ఫోన్లు ఎత్తడం లేదని సమాచారం. అడ్మిషన్లను పారదర్శకంగా నియంత్రించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు.


విపరీతంగా పెరిగిపోతున్న మరణాలు


జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. రోజువారీ 2 వేలకు పైగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పడకల కొరత, ఆక్సిజన్‌ కొరత, సకాలంలో తగిన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచీ ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం 166 మరణాలు నమోదు కాగా వాస్తవంగా మరణాల సంఖ్య దానికి కొన్ని రెట్లు అధికంగా వుంది. రోజువారీ జిల్లాలో 20కి పైగా నమోదవుతుంటే ఆరేడుకు మించి బులెటిన్‌లో పేర్కొనడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధితుల పట్ల మానవత్వంతోనూ, బాద్యతతోనూ వ్యవహరించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంకోవైపు రుయాలో పెద్దసంఖ్యలో వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ సేవలకు దూరంగా ఖాళీగా వుంటున్నట్టు సమాచారం. వారి సేవలను వినియోగించుకోగలిగితే బాధితులకు సకాలంలో మరింత మెరుగైన వైద్యం అందే అవకాశముంది. 


ప్రైవేటులో ఫీజుల దోపిడీ


జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులను ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మదనపల్లె, పుత్తూరు, శ్రీకాళహస్తి, పీలేరు వంటి చోట్ల నామమాత్రంగానూ, తిరుపతిలో ప్రధానంగానూ కొవిడ్‌ ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. చాలావరకూ ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద ఎవరినీ చేర్చుకోవడం లేదు. ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్‌ కోరితే బెడ్లు లేవన్న సమాధానం వస్తోంది. ప్రైవేటుగా అడ్మిషన్‌ అయితే అతి కష్టమ్మీద ఇస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చి మరీ చేర్చుకుంటున్నారు. ఫీజులు కూడా భారీగా వేస్తున్నారని సమాచారం. సాధారణ బెడ్డుకు రూ. 30 వేల నుంచీ రూ. 50 వేలు, ఆక్సిజన్‌ బెడ్డుకు రూ. లక్ష, వెంటిలేటర్‌ బెడ్డుకు రూ. లక్షన్నర నుంచీ రూ. 2.50 లక్షల వరకూ అడ్మిషన్‌ సమయంలో అడ్వాన్సు చెల్లించాల్సి వస్తోంది. తర్వాత రోజువారీ బిల్లు కనిష్టంగా రూ. 30 వేల నుంచీ గరిష్టంగా రూ. లక్ష దాకా వుంటోంది. రెమ్‌డెసివిర్‌ వంటి ఇంజక్షన్ల ధరలు బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారి కుటుంబీకుల ఆరాటాన్ని బట్టి ఎంతైనా పలుకుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు అమలయ్యేలా చూడాల్సిన నోడల్‌ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, పుత్తూరుల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో విజిలెన్స్‌ అధికారులు జరిపిన తనిఖీల సందర్భంగా ఇప్పటి వరకూ నాలుగైదు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. అయినా పరిస్థితిలో మార్పులేదు. అంబులెన్సు ఆపరేటర్లు కూడా దొరికినకాడికి బాధితులను దోపిడీ చేస్తున్నారు. వేలూరు, చెన్నై, బెంగళూరుల్లోని ఆస్పత్రులకు బాధితులను తరలించడానికి, కొవిడ్‌ మృతదేహాల తరలింపునకు కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మృతదేహాల తరలింపులో వీరి దోపిడీకి జడిసి పేద, మధ్యతరగతి వర్గాల బాధితులు తమ వారి మృతదేహాలను రుయా మార్చురీలోనే వదిలేసి వెళుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల దందా


మదనపల్లెలో శుక్రవారం రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల దందా బట్టబయలైంది. ఐదుగురితో కూడిన ముఠాను పోలీసులు గుర్తించి అందులో నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచీ రెండు ఇంజక్షన్ల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మచ్చుకు మాత్రమే. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్ల్లకు భారీ మొత్తాల్లో వసూలు చేసి అందజేస్తున్నారు. లేదంటే మీరే తెచ్చుకోండంటూ బాధితులపైనే వదిలిపెడుతున్నారు. ఫలితంగా తమవారి ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితుల కుటుబీకులు ఎంతైనా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలను చక్కదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని శనివారం జిల్లాకు వస్తున్నారు. తిరుపతిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.ఈ సమీక్షతోనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాల్సివుంది.

Updated Date - 2021-05-08T06:51:52+05:30 IST