అదృష్ట దీపక్‌ అభినందన సభ

ABN , First Publish Date - 2020-02-02T02:47:40+05:30 IST

‘ఎర్రజెండాయే నా ఎజెండా!’ అంటూ అసమ సమాజం మీద అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని కలం యోధుడు అదృష్ట దీపక్‌. విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలిలో

అదృష్ట దీపక్‌ అభినందన సభ

‘ఎర్రజెండాయే నా ఎజెండా!’ అంటూ అసమ సమాజం మీద అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని కలం యోధుడు అదృష్ట దీపక్‌. విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలిలో ఎన్నో బాధ్యతలు నిర్వహించాడు. కవిగా, కథకుడిగా, బుర్రకథా రచయితగా, వ్యాసకర్తగా, భాషావేత్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా... అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్‌. 

ఏడేళ్ల వయస్సులో గాయకుడిగా, తొమ్మిదేళ్ల వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ల వయస్సులో రచయితగా కళా జీవితాన్ని ప్రారంభించాడు. ఉత్తమ కవిగా, ఉత్తమ కథా రచయితగా, ఉత్తమ నటుడిగా బహుమతులు పొందాడు. బెర్ర్టోల్డ్‌ బ్రెహ్ట్‌, పేబ్లో నెరుడాల కవితలను తెలుగులోకి అనువదించాడు. దీపక్‌ రాసిన కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్‌ హిందీలోకి అనువదించారు. 

1980లో మాదాల రంగారావు సారథ్యంలో వచ్చిన ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో..’ గీత రచనతో సినిమా రంగంలో ప్రవేశించి నలభైకి పైగా ప్రగతిశీల పాటలు రాశాడు. నేటి భారతం సినిమాలో ఆయన రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అద్భుతం. తన సినిమా పాటల సంపుటి ‘ఆశయాల పందిరిలో’ మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చాడు. ‘నేటి భారతం’లో నంది అవార్డు గెలుచుకున్న ‘అర్ధరాత్రి స్వతంత్రం–అంధకార బంధురం’ గీతాన్ని అనారోగ్యంతో మంచం మీద ఉన్న శ్రీశ్రీతో దగ్గరుండి రాయించాడు దీపక్‌. 

శ్రీశ్రీ సాహిత్యంపై దాడి చేసే అభ్యుదయ విచ్ఛిన్నకర శక్తులపై తన కలాన్ని కత్తిలా ఝళిపిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు. శ్రీశ్రీపై దీపక్‌ రచనలను ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ పేరున పుస్తక రూపంలో ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ ప్రచురించింది. ఇలా ప్రగతిశీలంగా పని చేసిన అభ్యుదయ రచయిత అయిన అదృష్ట దీపక్‌ ‘సప్తతి పూర్తి’ సందర్భంగా అభినందన సభ జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీ, శనివారం విజయవాడ, గాంధీ నగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 6 గంటలకు ఎక్స్‌రే అధ్యక్షులు కొల్లూరి అధ్యక్షతన జరిగే ఈ సభలో అదృష్ట దీపక్‌ రాసిన వ్యాసాల సంకలనం ‘తెరచిన పుస్తకం’ను కవి, రచయిత కొప్పర్తి ఆవిష్కరిస్తారు. 

దీపక్‌పై వ్యాసాల సంకలనం ‘దీపం’ ను అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరిస్తారు. ఆత్మీయ అతిథులుగా విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్‌, రచయిత సర్వజిత్‌, శ్రీశ్రీ సాహిత్య నిధి కన్వీనర్‌ సింగంపల్లి అశోక్‌ కుమార్‌ హాజరవుతారు.

సింగంపల్లి ఆశోక్‌ కుమార్‌


Updated Date - 2020-02-02T02:47:40+05:30 IST