21 ఏళ్లలోపు కుర్రాడు పెళ్లి చేసుకోకూడదు.. కానీ సహజీవనం చెయ్యొచ్చట: హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-12-22T01:47:25+05:30 IST

ఇటీవల వరుసపెట్టి సంచలన తీర్పులు వెల్లడిస్తున్న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మరోసారి తన తీర్పుతో దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న

21 ఏళ్లలోపు కుర్రాడు పెళ్లి చేసుకోకూడదు.. కానీ సహజీవనం చెయ్యొచ్చట: హైకోర్టు సంచలన తీర్పు

చండీగఢ్: ఇటీవల వరుసపెట్టి సంచలన తీర్పులు వెల్లడిస్తున్న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మరోసారి తన తీర్పుతో దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న మహిళల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న వేళ.. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా దేశంలో పురుషుడి వివాహ విషయం 21 ఏళ్లుగా ఉంది. ఆ లోపు పెళ్లి చేసుకోవడం చట్టం దృష్టిలో నేరం. అయితే, 21 ఏళ్ల లోపు కుర్రాడు పెళ్లి కాకున్నా18 ఏళ్లు పైబడిన యువతితో ఆమె అంగీకారంతో సహజీవనం చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది. యుక్తవయస్కులైన ఇద్దరు యువతీయువకులు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించవచ్చంటూ మే 2018న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు ఉండడం గమనార్హం.


పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఓ జంట వేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి వయసు 18 ఏళ్లుపైనే. పెళ్లికి అమ్మాయి చట్టపరంగా అర్హురాలు. అయితే, యువకుడి వయసు మాత్రం 18 ఏళ్లే కావడంతో వివాహానికి అనర్హుడు. హిందూ వివాహ చట్టం ప్రకారం పురుషుడు 21 ఏళ్లలోపు పెళ్లికి అనర్హుడు. కాగా, తమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఈ జంట కోర్టును ఆశ్రయించింది. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది.


పిటిషన్‌ను విచారించిన కోర్టు.. దేశంలోని ప్రతి పౌరుడి జీవితం, స్వేచ్ఛను రక్షించడం రాజ్యాంగ బాధ్యతల ప్రకారం ప్రభుత్వ విధి అని పేర్కొంది. పిటిషనర్ నంబరు 2(యువకుడు) వివాహ వయసులో లేనంత మాత్రాన ఆయన తన ప్రాథమిక హక్కును కోల్పోడని జస్టిస్ హర్నరేష్ సింగ్ గిల్ వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్న జంట ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వారికి రక్షణ కల్పించాలని గురుదాస్‌పూర్ ఎస్ఎస్‌పీని ఆదేశించారు. 


నిజానికి దేశంలో లివిన్ (సహజీవనాన్ని) రిలేషన్‌షిప్‌ను నియంత్రించే ఎలాంటి చట్టాలు లేవు. అంతమాత్రాన అది చట్ట విరుద్ధం కూడా కాదు. ఖుష్బూ వి. కణైమామల్-ఏఎన్ఆర్ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం కలిసి జీవించడం జీవించే హక్కు కిందికే వస్తుందని స్పష్టం చేసింది. కాబట్టి సమాజం ఎలా పరిగణించినా, అనైతికంగా చూసినా సహజీవనం అనేది చట్టం దృష్టిలో నేరం కానే కాదు. నిజానికి సహజీవనం అనేది రెండు మనసుల మధ్య ప్రేమకు సంబంధించిన విజయం. ఈ విషయాన్ని దృష్టిపెట్టుకుని హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-12-22T01:47:25+05:30 IST