అద్వైత వేదాంతమే ఏకైక ఆస్తి

ABN , First Publish Date - 2021-07-25T05:21:47+05:30 IST

విశాఖ శారదా పీఠానికి ఆస్తులు ముఖ్యం కాదని, అద్వైత వేదాంతమే పీఠం ఏకైక ఆస్తి అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.

అద్వైత వేదాంతమే ఏకైక ఆస్తి
చాతుర్మాస్య దీక్ష స్వీకరిస్తున్న శారదా పీఠాధిపతి

శారదా పీఠానికి ఆస్తులు ముఖ్యం కాదు

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

రుషికేశ్‌లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభం


పెందుర్తి, జూలై 24: విశాఖ శారదా పీఠానికి ఆస్తులు ముఖ్యం కాదని, అద్వైత వేదాంతమే పీఠం ఏకైక ఆస్తి అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. రుషికేశ్‌లోని శారదా పీఠం శాఖలో స్వామిజీ చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా గంగానది తీరాన అర్చన చేసి అనంతరం గోపూజ, లక్ష్మీగణపతి హోమం చేశారు. వ్యాసపూజ నిర్వహించి చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ పీఠం అంటే అధ్యయనం, అధ్యాపనమని.. అర్చనలు, పూజలు కాదన్నారు. అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తూ, శంకర భాష్యాన్ని ప్రవచిస్తూ లోకహితం కోసం నిర్విరామ కృషి చేస్తున్న శారదా పీఠం విద్యాపీఠంగా వెలుగొందుతోందన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ పీఠం శ్వాస, ధ్యాస అని స్వామిజీ అన్నారు. హైందవాన్ని నిర్వీర్యపరిచే చర్యలు, ధర్మాన్ని కించపరిచే శక్తులపై 30 సంవత్సరాలుగా పీఠం పోరాటం చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడులపై ధర్మపోరాటం సాగించిన ఏకైక పీఠం శారదా పీఠం అన్నారు. ఈ చాతుర్మాస్య దీక్షతో ధర్మ పరిరక్షణకు నూతనోత్తేజం లభిస్తుందన్నారు. పీఠాధిపతితో పాటు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు.



Updated Date - 2021-07-25T05:21:47+05:30 IST