మూడో దశకు ముందే అప్రమత్తత

ABN , First Publish Date - 2021-06-12T05:25:36+05:30 IST

కరోనా మూడో దశ ఆగస్టు - డిసెంబర్‌ నెలల మధ్య కాలంలో ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా అన్ని ముందస్తు ఏర్పాట్లను చేస్తున్నారు.

మూడో దశకు ముందే అప్రమత్తత
ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌

కరోనా బారిన పడే పిల్లల చికిత్సకు ముందస్తు సన్నాహాలు
280 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
వెంటిలేటర్లు, మందుల కోసం ఇండెంట్‌
ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌


హన్మకొండ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : కరోనా మూడో దశ ఆగస్టు - డిసెంబర్‌ నెలల మధ్య కాలంలో ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా అన్ని ముందస్తు ఏర్పాట్లను చేస్తున్నారు.  ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్‌ ఎంజీఎంలో అప్పుడే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కరోనా థర్డ్‌ వేవ్‌ నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పిల్లలపై పడగవిప్పవచ్చునని తెలుస్తుండడంతో వారి రక్షణకు చేస్తున్న ఏర్పాట్లపై ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ముందస్తు ఏర్పాట్లు
కరోనా మొదటి, రెండో దశల తీవ్రత వల్ల తలెత్తిన దుష్పరిణామాలు, ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాం.  కరోనా మూడో దశకు అనుగుణంగా ప్రత్యేకంగా పిల్లలకు తగిన చికిత్స కోసం 280 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నాం. కరోనా మొదటి, రెండో వేవ్‌లో పెద్దలకు చికిత్స చేసే విషయంలో చేసిన ఏర్పాట్ల స్థాయిలోనే మూడో వేవ్‌లో పిల్లలకు తగిన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చుతాం. మొదటి వేవ్‌ సందర్భంగా ఎంజీఎంలో కొవిడ్‌ రోగుల కోసం 250 పడకలను ఏర్పాటు చేయగా, అదే రెండో వేవ్‌లో వాటి సంఖ్యను 800 వరకు పెంచాం. అదే స్థాయిలో పిల్లల విషయంలోనూ కరోనా తీవ్రత, పరిస్థితులను బట్టి పడకలను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాం. పిల్లల కోసం 100పడకలతో ఒక వార్డును అప్పుడే గుర్తించాం. ఆక్సిజన్‌ సరిపోతుంది కానీ.. పెద్దలకు వాడిన వెంటిలేటర్స్‌ పిల్లలకు సరిపోవు. వారికి సరిపోయే 100 వెంటిలేటర్లను సమకూర్చుకుంటున్నాం. వీటిలో 80 పెద్ద పిల్లలకు, 20 నవజాత శిశువులకు పనికొచ్చేట్టు తెప్పిస్తున్నాం.  ఇందుకోసం ఇండెంట్‌ను కూడా పెట్టాం. ఆస్పత్రిలో ప్రస్తుతం పిల్లలకు పనికొచ్చే కొన్ని వెంటిలేటర్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వాడుకోవచ్చు.

చాలినన్ని మందులు
మందుల విషయానికి వస్తే పిల్లలకు రెమ్‌డెవిసిర్‌ పనిచేయదు. దీంతో  కరోనా బాధిత పిల్లలకు శక్తివంతంగా పనిచేసే ఐబీ ఇమ్యూనోగ్లాబిన్‌్‌ (ఐబీఐజీ) అనే  మందు కోసం కూడా ఇండెంట్‌ పెట్టాం. సమగ్రమైన పీడియాట్రిక్‌ వార్డు ఎంజీఎంలోనే ఉంది. ఈ వార్డులో పిల్లల కోసం మొత్తం 180 పడకలు ఉన్నాయి. ఇందులో 120 జనరల్‌ పడకలు కాగా, నవజాత శిశువుల (ఎన్‌ఐసీ) కోసం 20, పీడియాట్రిక్‌ ఎమర్జెన్సీ విభాగం (ఐసీయూ)లో 20, ఎదుగుల ఆగిపోయిన శిశువుల కోసం ఇంకో 20 పడకలు ఉన్నాయి. ఇవి కాక అదనంగా మరో 100 పడకలను అందుబాటులో ఉంచబోతున్నాం. మూడో వేవ్‌లో పెద్దలకు కరోనా అంతగా సోకక, వారి రాక తగ్గిన పక్షంలో వారి కోసం ఉద్దేశించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకల్లో కొన్నిటిని కూడా అవసరాన్ని బట్టి పిల్లల కోసం వాడుకునే దిశగా కూడా ఆలోచన చేస్తున్నాం. ఆ మేరకు అదనంగా వెంటిలేటర్లను కూడా తెప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. నవజాతశిశువు వార్డులో ప్రస్తుతం 20 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. వంద వరకు అదనంగా తెప్పించుకోవాలనుకుంటున్నాం.

సమావేశం
థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా సోకిన పక్షంలో వారికి ఎలాంటి చికిత్స చేయాలనే విషయంలో చర్చించేందుకు పిల్లల డాక్టర్లతో ఇటీవలే ఒక సమావేశాన్ని నిర్వహించాం. ఇందులో రాబోయే ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు, అందుబాటులో ఉంచాల్సిన అత్యవసర మందులు, పారామెడికల్‌ సిబ్బంది తదితర అంశాలపై చర్చించాం.  థర్డ్‌వేవ్‌లో కరోనా ప్రభావం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిన పక్షంలో వారికి సకాలంలో, సమర్ధవంతమైన రీతిలో చికిత్స అందచేసేందుకు పీడియాట్రిక్‌ డాక్టర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎంజీఎంలో పీడియాట్రిక్‌ డాక్టర్ల కొరత ఏమీ లేదు. ప్రస్తుతం అయిదుగురు పీడియాట్రిక్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇంకా అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే కాంట్రాక్టు పద్ధతిన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు వివిధ విభాగాల నుంచి డాక్టర్లను  తీసుకున్నాం. ఎంబీబీఎస్‌ పాస్‌ అయినవారందరి సేవలు ఉపయోగించుకున్నాం. అలాగే కరోనా బారిన పడిన పిల్లలకు చికిత్స విషయంలో కూడా వారికి వైద్యం చేయడంలో నైపుణ్యం ఉన్నవారందరి సేవలను వాడుకుంటాం.

Updated Date - 2021-06-12T05:25:36+05:30 IST