Abn logo
Apr 7 2020 @ 06:25AM

ముహూర్తం మారుతోంది!

ఏప్రిల్‌, మే నెలల్లో ముహూర్తాలు

వృత్తిరీత్యా దూర ప్రాంతాల్లో వధూవరులు

కరోనా ఎఫెక్ట్‌తో వివాహాలు వాయిదా

ఇప్పటికే కల్యాణ మండపాలకు అడ్వాన్సులు

తిరిగి తీసుకునే వీలులేక వదులుకుంటున్న వైనం


విజయనగరానికి చెందిన వసంత్‌...ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం అతనికి పెళ్లి కుదిరింది. మంచి ముహూర్తం ఉండడంతో ఏప్రిల్‌ 24న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వసంత్‌ ఇప్పటి వరకూ ముంబైలోనే ఉన్నాడు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఇక్కడి పెద్దలూ ఇంటి నుంచి కదిలే పరిస్థితి లేదు. వధువు తరఫు వారితో చర్చించి వివాహం వాయిదా వేసుకున్నారు. అయితే కల్యాణ మండపం... మేళతాళాలు...హోటళ్లు... కేటరింగ్‌ వంటి వాటికి ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చారు. ఈ మొత్తాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 


పార్వతీపురానికి చెందిన మాధురికి ఏప్రిల్‌ 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబంతో పాటు బెంగళూరులో ఉంటోంది. ఓవైపు వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది.  కల్యాణ మండపంతో పాటు వివాహానికి కావలసిన వివిధ వస్తువులు...ఇతరత్రా అంశాలకు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చారు. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లు, విమానాలు రద్దు కావడంతో ఆ కుటుంబం ఇక్కడికి రావడానికి వీలు కుదరడం లేదు. పెళ్లి పనులు ఒక్కటీ ముందుకు కదల్లేదు. దీంతో వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి వాయిదా వేసుకున్నారు. 

....ఇది కేవలం మాధురి... వసంత్‌ల కుటుంబ సభ్యుల పరిస్థితే కాదు. పదుల సంఖ్యలో కుటుంబాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ ఘట్టాన్ని ఆనందంగా జరుపుకోవాలని... వధూవరులు కలకాలం సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో సంప్రదాయబద్ధంగా పెద్దలు ముహూర్తాలు నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ కరోనా వారి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. సెంటిమెంట్‌ పరంగా అటు వధువు.. ఇటు వరుని కుటుంబాలకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నా.. తప్పనిసరి పరిస్థితిలో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. కొందరైతే ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇరుకుటుంబాల సమక్షంలో వివాహ ఘట్టం పూర్తి చేసి... రిసెప్షన్‌ వంటివి తరువాత చూసుకుందామనే నిర్ణయంతో ఉన్నారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)  : లాక్‌డౌన్‌ ప్రభావంతో వివాహాల పరిస్థితి తలకిందులైంది. చాలా మంది వాయిదా వేసుకోగా... మరికొందరు ముహూర్త బలం ముఖ్యమని భావించి సాదాసీదాగానైనా పెళ్లి కానిచ్చేయాలని ఆలోచిస్తున్నారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 వివాహాలపై లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. ఇందులో ముహూర్తాలు పెట్టిన తరువాత వాయిదా వేసుకున్నవి ఎక్కువ. మిగతా వారు ముహూర్తాలు కూడా తర్వాత పెట్టుకోవాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల్లో వివాహాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న వారిపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యేలా చేసింది. దీంతో శుభ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వీటిలో పెళ్లిళ్లు అధికంగా ఉన్నాయి. మరోవైపు శుభకార్యాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది పనులు లేక అవస్థలు పడుతున్నారు. 


కల్యాణ మండపాలు ఖాళీ..

 వివాహాలకు కల్యాణ మండపాలపై ఆధారపడుతున్న రోజులివి. అక్కడ ఏ హంగులకూ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. ప్రస్తుత పరిస్థితిలో బుక్‌ చేసుకున్న ఫంక్షన్లు చాలా వరకు రద్దయ్యాయి. విజయనగరం పట్టణంలోని తోటపాలెం, రింగురోడ్డులోని కల్యాణ మండపాలు, అర్‌అండ్‌బీ, దాసన్నపేట రైతుబజార్ల సమీపంలో ఉన్న మండపాలు.. కేఎల్‌ పురం, ఫూల్‌బాగ్‌ ప్రాంతాల్లో వేంకటేశ్వర ఆలయం ఉన్న కల్యాణ మండపాలు నేడు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో మండపాలు ఉన్నాయి. ఇవన్నీ గత నెల 21 తరువాత ఖాళీ అయిపోయాయి. ఈనెల 14వరకు ఎట్టి పరిస్థితిలోనూ కల్యాణ మండపాలు తెరవద్దని పోలీస్‌ శాఖ ప్రకటించింది. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. 


 వ్యాపారాలు లేవు..

పెళ్లిలో భోజన ఏర్పాట్లకు అధిక ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. రకరకాల వంటకాలు.. ఇతర రాష్ట్రాలు, దేశాల వంటకాలు పెడుతున్నారు. ఇందుకోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు. లాక్‌డౌన్‌తో వివాహాలు వాయిదా పడుతున్న కారణంగా వంట సామగ్రి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో పూర్తిగా షాపులు మూతపడ్డాయి. కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. వివాహ కార్యక్రమాల్లో వంటలు చేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. 


డెకరేషన్లు లేక..

కల్యాణ మండపాలు.. వావాహ కార్యక్రమాల వద్ద విద్యుత్‌ కాంతులు ఏర్పాట్లు చేసే ఎలక్ట్రీషియన్లకు పనులు లేకుండా పోయాయి. విద్యుత్‌ పనివారు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే వివాహ వేదికల వద్ద పెద్ద ఎత్తున డెకరేట్‌ చేసే పరిస్థితి ఇపుడు అన్ని చోట్ల విస్తరించింది. ప్రత్యేకమైన రంగురంగుల పూలతో అలంకరణ చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ మొత్తం చూసుకునే ఈవెంట్‌ అర్గనైజర్లకు పనులు లేవు. వీడియోగ్రాఫర్లు, ఫొటో ఆల్బమ్‌లు చేసేవారిదీ ఇదే పరిస్థితి.  ఇలా అనేక రంగాలతో పాటు వావాహాది శుభకార్యాలపై ఆధారపడిన వారంతా నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement