Abn logo
Mar 17 2020 @ 00:35AM

అనుబంధాలు, ఆత్మీయతలే...

వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు, స్నేహసౌభ్రాతృత్వాలు, నైతిక విలువలనే ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి, ఇప్పుడు వర్చ్యువల్ ప్లానెట్ మాయాలోకంలో జీవిస్తూ ఒంటరి వాడై, నిరర్ధకుడయ్యాడు. సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. కృత్రిమ బంధాలు, క్విడ్ ప్రో కో సంబంధాలు నశించి కుటుంబ బంధాలు పెరగాలి. అపుడే వసుధైక కుటుంబం తిరిగి అవతరిస్తుంది. మనిషి శాంతియుతంగా, సుస్థిరంగా జీవించగలుగుతాడు.


కుంచించుకు పోతున్న మానవ సంబంధాలు, వాటి ప్రాధాన్యతల గురించి ప్రపంచానికి గుర్తు చేసేదే ‘అంతర్జాతీయ సోషల్ వర్క్ దినోత్సవం’. సోదరభావం, సమానత్వం, లౌకికత్వం, సహనం, జెండర్ సమానత్వం, మానవ హక్కులు, మైనారిటీల రక్షణ మొదలైన భావనలు పౌరులలో పెంపొందించడం ‘సోషల్ వర్క్ డే’ లక్ష్యం. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ సోషల్ వర్కర్స్’ ఆధ్వర్యంలో జరిగే ఈ దినోత్సవానికి చారిత్రక ప్రాధాన్యమున్నది. ‘ప్రమోటింగ్ ది ఇంపార్టెన్స్ అఫ్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్’ అనేది 2020 సంవత్సర ‘సోషల్ వర్క్ డే’ థీమ్. 


1990 దశకం తర్వాత మన సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. నగరీకరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నది. అప్పటి వరకు పెద్దగా వాడుకలో లేని ‘బిజీ’ అనే పదం ప్రతి ఒక్కరి నోటి నుంచి విరివిగా విన్పిస్తోంది. ప్రపంచం కుగ్రామంగా మారింది. వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సామాజిక సమూహాల మధ్య అప్పటివరకున్న సఖ్యత, సాన్నిహిత్యాలు మృగ్యమయ్యాయి. నగర, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడాలేకుండా ఈ పరిణామం అందరిపై ప్రభావం చూపింది. వేషభాషలు, ఆహారపు అలవాట్లు, మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి. మన అన్న భావన తొలిగి నేను- నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి. నైతిక విలువలు, మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి, చదువు, సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసక బారడం మొదలయింది. అంతరిక్ష దూరాలను అవలీలగా జయించిన మనిషి పొరుగున ఉన్న మనిషిని మర్చిపోయాడు. సంబంధాలు సంకుచితమవ్వసాగాయి. సఖ్యత తరిగి మనుషుల మధ్య మానసిక దూరం పెరిగింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య జనరేషన్ గ్యాప్ ఎక్కువైంది. అడ్జెస్ట్‌మెంట్‌కు తావులేకుండా పోయింది. అన్ని విషయాల్లో ‘అసహనం’ పెరిగిపోయింది. 


సంప్రదాయ వృత్తుల స్థానంలో ఆధునిక వృత్తులు అనేకం వచ్చి చేరాయి. ఆర్థికంగా ఎదిగే క్రమంలో మానవ సంబంధాల పరిధి కుంచించుకుపోసాగింది. ఆర్జనే లక్ష్యమైపోయింది. మానసిక ఒత్తిడి అనివార్యమయింది. ఆర్థిక స్థితిగతుల విషయమై ‘ఇతరులతో పోలిక’ మనుషుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. కేవలం సంపాదన, పేరు ప్రతిష్ఠల వల్లే ‘సంతోషం’ సమకూరదని, అది కేవలం సామాజిక సంబంధాల వల్లనే వస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. 


మనిషి సృష్టించిన సాంకేతికత మనిషినే శాసించే స్థాయికి చేరుకుంది. అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసి ముఖాముఖీ, ఆత్మీయ సంభాషణలకు మంగళం పలికి నిరంతరం టీవీకి అతుక్కుపోయేలా మనిషిని బానిసగా మార్చుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని మనిషి తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. సంప్రదాయ ఆటలు అంతరించి వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ మనుషులను ఆటాడిస్తున్నాయి. లైఫ్ స్టైల్ రోగాలు చిన్న వయసులోనే కబళిస్తున్నాయి. పిల్లల్ని వారించాల్సిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు మొబైల్స్‌ను అలవాటు చేయడం పరిపాటిగా మారింది. ఈ సెల్‌ఫోన్‌ అతి వినియోగం వల్ల పిల్లల్లో క్రైమ్ రేటు పెరుగుతోందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


సంతులిత సామాజికీకరణను అందించడంలో కుటుంబ పాత్ర ఎనలేనిది. సమిష్టితత్వ భావన, పరస్పర ఆధారిత (Inter dependency) భావనలను కలిగించడంలో ఉమ్మడి కుటుంబం పాత్ర కీలకమైనది. నగరీకరణ పుణ్యమా అని నవతరం ఉమ్మడి కుటుంబ ఆప్యాయతానురాగాలకు నోచుకోలేకపోతున్నది. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోయి పిల్లలకు ప్రైవసీ ఎక్కువగా లభిస్తోంది. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే కానీ కుటుంబం జరగని పరిస్థితి నెలకొంది. ఇద్దరూ ఉద్యోగం చేయవలసి రావడంతో పిల్లల ఆలనాపాలన చూడలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో సంతానాన్ని పరాయి వారి దగ్గర వదిలి పెట్టాల్సి వస్తుంది.


డబ్బు ప్రతి పనికి వెలగడుతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక చట్రంలో ఇరుక్కుపోయాయి. అమ్మలాలన, ఇల్లాలి ఆదరణ, పెద్దల పోషణ, నిస్సహాయుల ఆదరణ, కుటుంబ పాలన మొదలైనవన్నీ డబ్బు ద్వారా ఇతరుల చేత పొందుతున్నారు. విలువలు, బంధాలు మార్కెట్‌లో సరుకులయ్యాయి. మంచి చెడు, పవిత్రత, అపవిత్రత సరిహద్దు రేఖలు చెరిగిపోవడానికి డబ్బు కారణమయ్యింది. సృష్టిలోని సకల జీవల మధ్య సంబంధాలు పరస్పర పూరకాలు. అయితే, నేటి ఆధునిక భౌతికవాద ప్రపంచంలో డబ్బు పాత్రే ముఖ్యమైనది. డబ్బు కోసం ఎటువంటి పని చేయడానికైనా ఎవరూ వెనుకాడడంలేదు. విలువలు మరిచి ఎన్నో అఘాయిత్యాలకు ఒడిగట్టేలా కాసుల కక్కుర్తి మనిషిని పురికొల్పుతోంది. కల్తీ కల్లు, సారా అమ్మకాలు, మానవ అవయవాల దోపిడీ, బాలలపై అత్యాచారాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాపులు, వ్యభిచారం వంటి అకృత్యాలన్నీ షార్ట్ కట్ సంపాదనా మార్గాలైపోయాయి. డ్రగ్ సప్లై, దొంగతనాలు, కుట్రలు, కుతంత్రాలు. మర్డర్స్, కన్నవారిపై దాడులు, వరకట్న వేధింపులు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లు, ఆసిడ్ దాడులు, పరువు హత్యలు మొదలైనవి మనిషిని పశువుగా మార్చేశాయి. 


మానవ విలువల్ని పెంపొందించడంలో విద్య పాత్ర ఎనలేనిది. అయితే, బాధ్యతాయుతమైన పౌరుల్ని తయారు చేయడంలో మన విద్యా విధానం విఫలమవుతోంది. పిల్లల్ని డాలర్లు సృష్టించే యాంత్రాలుగా పరిగణించే పరిణామం నెలకొంది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడే సామాజిక శాస్త్రాల అధ్యయనం తగ్గిపోతోంది. ఈ సబ్జెక్టులపై పాలకుల శీత కన్ను పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. సాంకేతిక విద్య తనదైన రీతిలో సమాజాన్ని శాసిస్తుంది. అందరూ ఇంజనీర్లు అయి, అమెరికా వెళ్లి డాలర్లు కూడబెట్టాలని కలలు కనేవారే. ఆన్‌లైన్ కోచింగులు గురువుల స్థానాన్ని ఆక్రమించాయి. ఏ మాత్రం విలువలు నేర్పని ఈ ఆర్టిఫిషీయల్ గురువులు పిల్లల భవిషత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పిల్లల్ని చాలా అసహనశీలురుగా తయారు చేస్తున్నాయి. ఈ కారణంగా, ఏ చిన్న ఫెయిల్యూర్‌ ఎదురైనా ఎదుర్కొనలేని సత్తా లేనివారిగా, డిప్రెషన్‌కు లోనై, ఆత్మహత్యలకు పాల్పడే దుర్భలురుగా పిల్లలు తయారవుతున్నారు. విద్యార్థులను ప్రయోజకులుగా, సత్ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మన విద్య విధానం అపసవ్య దిశలో సాగుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. భావితరాలను తీర్చిదిద్దే పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి. పిల్లల్ని సమాజంలో భాగంగా పెంచాలి. వ్యక్తి ఏకాకి కాడు. వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆధారపడుతారన్న విచక్షణను పిల్లలకు అలవరచాలి. 


టెక్నాలజీ విస్తృతమై సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ మనిషి ఒంటరి అవుతున్నాడు. కృతిమ వాతావరణం సృష్టించుకొని తోటి మనిషితో కానీ ప్రకృతితో కానీ, జంతుజాలంతో కానీ సంబంధాలు తెంచుకుంటున్నాడు. పరస్పరం ఆధారపడడమనేది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. కానీ, ప్రస్తుత తరం ఈ సత్యాన్ని గుర్తించే పరిస్థితిలో లేదు. సామాజిక పరివర్తన అనేది ఎపుడూ సానుకూల దిశలో సమాజ హితంగా జరగాలి. వ్యతిరేక దిశలో పయనిస్తే తగిన మూల్యం చెల్లించకోక తప్పదని మానవ సంబంధాల నిపుణుడు మేయో అన్నాడు. వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. వ్యక్తి అంటే వ్యవస్థ. కుటుంబం అనే పునాది వేసుకొని బంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, స్నేహాలు, అనుబంధాలు, ఆత్మీయ తలు, నైతిక విలువలనే ఇటుకలుగా పేర్చి ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి ఇప్పుడు వర్చ్యువల్ ప్లానెట్ మాయాలోకంలో జీవిస్తూ ఒంటరి వాడై, నిరర్ధకుడై పోయాడు. సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. అవి కరువైతే మానవ మనుగడకే ప్రమాదం. కృత్రిమ బంధాలు, క్విడ్ ప్రో కో సంబంధాలు నశించి కుటుంబ అను బంధాలు పెరిగినప్పుడే వసుధైక కుటుంబం తిరిగి అవతరిస్తుంది. మనిషి శాంతియుతంగా, సంతోషాతిరేకాలతో సుస్థిరంగా జీవించగలుగుతాడు. 

డాక్టర్ ఎం. స్వర్ణలత, కాకతీయ యూనివర్సిటీ

(నేడు ఇంటర్నేషనల్ సోషల్ వర్క్ డే)

Advertisement
Advertisement
Advertisement