అఫ్ఘాన్‌లో అనిశ్చితి.. భారత్‌, ఆసియా దేశాలకు ముప్పు

ABN , First Publish Date - 2021-09-18T08:15:12+05:30 IST

‘‘అత్యాధునికమైన ఆయుధాలు అఫ్ఘానిస్థాన్‌లో పెద్దఎత్తున మిగిలిపోయాయి. అక్కడి తాజా పరిణామాల కారణంగా డ్రగ్స్‌, అక్రమ ఆయుధ వ్యాపారం, మానవ అక్రమ రవాణా...

అఫ్ఘాన్‌లో అనిశ్చితి.. భారత్‌, ఆసియా దేశాలకు ముప్పు

  • షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ‘‘అత్యాధునికమైన ఆయుధాలు అఫ్ఘానిస్థాన్‌లో పెద్దఎత్తున మిగిలిపోయాయి. అక్కడి తాజా పరిణామాల కారణంగా డ్రగ్స్‌, అక్రమ ఆయుధ వ్యాపారం, మానవ అక్రమ రవాణా నియంత్రించలేని విధంగా మారనున్నాయి. ఫలితంగా, మధ్య ఆసియా మొత్తం అస్థిరత నెలకొనే ప్రమాదం ఉంది. అఫ్ఘానిస్థాన్‌లోని తాజా పరిణామాలు భారత్‌ వంటి పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ అనిశ్చితి కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు, తీవ్రవాద భావజాలాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో)  వార్షిక సమావేశాలు తజక్‌స్థాన్‌ రాజధాని దుశ్చాంబేలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘మధ్య ఆసియాలో మనకు అతి పెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాస రాహిత్యం. ఈ సమస్యకు ప్రధాన కారణం పెరుగుతున్న తీవ్రవాదం. అందుకే, తీవ్రవాదం, ఉగ్రవాదాలపై పోరాటానికి మనం ఉమ్మడి విధాన పత్రాన్ని రూపొందించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా, దుశ్చాంబేలో ఎస్‌సీవో సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్‌ యి, సెర్గీ లవ్‌రోవ్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఎబ్రహిం రైసిలతో చర్చలు జరిపారు. భారత్‌తో చైనా సంబంధాలను మూడో దేశం కళ్లతో చూడవద్దని హితవు పలికారు. 

Updated Date - 2021-09-18T08:15:12+05:30 IST