ఆఫ్ఘన్ ఉద్యమకారిణిపై తాలిబన్ల దురాగతం

ABN , First Publish Date - 2021-09-05T01:08:47+05:30 IST

రాజకీయ హక్కుల కోసం ఉద్యమించిన ఆఫ్ఘన్ మహిళలపై

ఆఫ్ఘన్ ఉద్యమకారిణిపై తాలిబన్ల దురాగతం

కాబూల్ : రాజకీయ హక్కుల కోసం ఉద్యమించిన ఆఫ్ఘన్ మహిళలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టారు. ఆమె తలకు గాయమవడంతో ముఖంపై నుంచి రక్తం కారుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. 


ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడబోతున్న నూతన ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ హక్కులు కల్పించాలనే డిమాండ్‌‌తో మహిళలు శనివారం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు ప్రదర్శనగా వెళ్ళేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు తాలిబన్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతోపాటు దాడికి పాల్పడ్డారని స్థానిక మీడియా తెలిపింది. 


తాలిబన్ల దాడిలో గాయపడిన మహిళ నర్గీస్ సాదత్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, మహిళా హక్కుల కార్యకర్తలు శనివారం ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు ప్రదర్శనగా వెళ్ళేందుకు ప్రయత్నించగా, తాలిబన్లు దాడి చేసి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారని చెప్పారు. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని చెప్పారు. 


ఈ ప్రదర్శనలో పాల్గొన్న కొందరు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ, తాము ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు ధర్నా నిర్వహించాలనుకున్నామని చెప్పారు. తాలిబన్లు తమకు అవకాశం ఇవ్వలేదన్నారు. 


కొందరు పాత్రికేయులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం, మహిళా ఉద్యమకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. కానీ వారు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. 


ఆప్ఘనిస్థాన్ మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. హెరాత్ ప్రావిన్స్, కాబూల్‌లలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-09-05T01:08:47+05:30 IST